'వలిమై'(అజిత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కార్తికేయ విలన్‌గా నటించాడు) తర్వాత తమిళ ప్రేక్షకుల్లో నాకు గుర్తింపు వచ్చిన మాట వాస్తవమే. అలా అని నా తదుపరి చిత్రాలన్నీ తమిళ భాషలో కూడా విడుదల చేయాలనుకోవడం సరికాదు. తెలుగు, తమిళ ప్రేక్షకులకు నచ్చే కథ వచ్చినప్పుడు బైలింగ్వల్ చేస్తా. వలిమై తర్వాత నాకు తమిళ నుంచి రెండు, మూడు ఆఫర్లు వచ్చాయి కానీ.. ఏదీ నచ్చలేదు. అందుకు ఆ సినిమాలు చేయలేదు’అని యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ అన్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బెదురులంక 2012’. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆగస్ట్ 15న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా కార్తీకేయ మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు..
► కరోనా సమయంలో నాకు క్లాక్స్ కథ చెప్పాడు. ఆ సమయంలో ప్రపంచం అంత అయిపోతుందని అన్నట్లు ప్రచారం జరిగింది కదా! కథకు బాగా కనెక్ట్ అయ్యాను. ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది. కథలో కొత్తదనం, వినోదం ఉండటంతో ఓకే చేశా.
► 'బెదురులంక 2012' కథకు రిఫరెన్స్ ఏమీ లేదు. అంత కొత్తగా ఉంటుంది. సినిమా కంప్లీట్ అయ్యాక చూసుకున్నా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బాగా వచ్చింది. ఫన్, మెసేజ్ రెండూ ఉన్నాయి. ఆ సినిమాకు వచ్చిన ప్రేక్షకులు ఆలోచించేలా సన్నివేశాలు, డైలాగులు ఉంటాయి. వారిలో చిన్న మార్పు వస్తుందని నమ్ముతున్నాను.
► ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు శివ. ఓ సన్నివేశం దగ్గర 'శివ షో బిగిన్స్, శివ ఆట మొదలు' అన్నట్లు చెప్పాలి. ఇంపాక్ట్ సరిపోవడం లేదని, శివ పేరు చిన్నగా ఉందని అనిపించింది. సెట్‌లో ఎవరో శివ శంకర్ అయితే బావుంటుందేమో అన్నారు. అప్పుడు శివ శంకర వరప్రసాద్ పేరు స్ట్రైక్ అయ్యింది. అప్పటికప్పుడు వచ్చిన ఐడియాకు ఆ షాట్‌లో అలా చెప్పాం.
► శివ క్యారెక్టర్ విషయానికొస్తే.. అతనో స్వేచ్ఛా జీవి. తనకు నచ్చినట్లు జీవిస్తాడు. సిటీలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ మానేసి ఊరు వెళతాడు. ఎవరైనా నన్ను జడ్జ్ చేస్తున్నారా? ఎవరైనా నేను చేసిన పని గురించి ఆలోచిస్తున్నారా? అని అసలు పట్టించుకోడు. అలాగని, ఎవరినీ ఇబ్బంది పెట్టడు. వాడి పని వాడు చేసుకుంటాడు. నచ్చని విషయం చేయమంటే అసలు చేయడు.
► ఈ సినిమా ట్రైలర్ రామ్ చరణ్‌కు బాగా నచ్చింది. మ్యూజిక్ బావుందని చెప్పారు. షాట్స్ మేకింగ్, నేహా శెట్టితో నా జోడీ బావుందని చెప్పారు. శివ శంకర్ వరప్రసాద్ డైలాగ్ గురించి సరదాగా మాట్లాడుకున్నాం.
► నేహా శెట్టి మంచి నటి. 'డీజే టిల్లు'లో ఆమె బాగా చేసింది. వేరే పాత్రలో అంత బాగా చేస్తుందా? అని డౌట్ ఉంది. 'ఆర్ఎక్స్ 100' తర్వాత ఈ అబ్బాయి రగ్గడ్ లుక్ మైంటైన్ చేస్తూ ఆ రోల్ బాగా చేశాడని, వేరే క్యారెక్టర్ చేస్తాడా? లేదా? అని నా గురించి ఎలా అయితే అనుకున్నారో... సేమ్ ఆ అమ్మాయికి కూడా అలా ఉంది. ఒకటి రెండు రోజుల తర్వాత నేహా శెట్టి వైవిధ్యంగా చేస్తుందని అర్థమైంది. ఆ అమ్మాయి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంది. రాధికా పాత్ర ఎక్కడా కనిపించకూడదని కష్టపడింది. మేం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం.
► మణిశర్మ గారి నేపథ్య సంగీతం సినిమాకు ఎంతో బలాన్ని ఇచ్చింది. అఫ్‌కోర్స్... సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అయితే... ఇదొక కొత్త జానర్ సినిమా. చాలా లేయర్స్, థీమ్ మ్యూజిక్స్ ఉంటాయి. ఆయన వాటిని బాగా క్యారీ చేశారు. ఫెంటాస్టిక్ రీ రికార్డింగ్ చేశారు
► 'ఆర్ఎక్స్ 100'లో నా క్యారెక్టర్ పేరు శివ. ఇందులోనూ అదే పేరు. రెండు చిత్రాలు గోదావరి నేపథ్యంలో సాగుతాయి. అయితే ఇదంతా యాదృశ్చికంగా జరిగింది. డైరెక్టర్ క్లాక్స్‌కి ఆర్‌ఎక్స్ 100లో నా పాత్ర పేరు శివ అని గుర్తు లేదు. షూటింగ్ ప్రారంభమైన చాలా రోజుల తర్వాత అతనికి గుర్తు చేశా. తనకు ఆ సినిమాలో క్యారెక్టర్ పేరు గుర్తు లేదన్నాడు. ఆ క్యారెక్టర్, మైండ్ సెట్ కు శివ పేరు సెట్ అవుతుందని పెట్టానని చెప్పాడు. ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి ఈ సినిమా కూడా హిట్ అయితే హ్యాపీ. హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాం.
Comments
Please login to add a commentAdd a comment