
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) (IIFA Awards) అవార్డుల కార్యక్రమానికి ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. భారత్‌లోని జైపూర్ వేదికగా ఐఫా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా (IIFA-2024) అవార్డులు 2000 సంవత్సరంలో మొదటిసారి ప్రకటించారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ రంగాలలో మెప్పించిన నటీనటులు, చిత్రాలను గుర్తించి అవార్డ్స్ అందిస్తారు. ఈసారి హోస్ట్‌లుగా బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో పాటు నిర్మాత కరణ్ జోహార్ వ్యవహరించనున్నారు.
మార్చి 8,9 తేదీల్లో జైపుర్ వేదికగా ఐఫా వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే భారీగా నటీనటులు అక్కడకు చేరుకున్నారు. ఐఫా అవార్డ్స్ కార్యక్రమాన్ని భారత్‌లో జరపడం ఇది రెండోసారి. సుమారు ఐదేళ్ల క్రితం ముంబైలో నిర్వహించారు. ప్రతి ఏడాది అబుదాబి, సింగపూర్,మలేషియా, అమెరికా వంటి దేశాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. అయితే, ఐఫా అవార్డ్స్ ప్రయాణానికి 25 ఏళ్లు పూర్తి కావడంతో ఈసారి భారత్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్, షాహిద్ కపూర్, కృతి సనన్,కరీనా కపూర్, శ్రేయా ఘోషల్ వంటి స్టార్స్ ఐఫా వేదిక మీద తమ డ్యాన్సులతో మెప్పించనున్నారు.