అకాడమీ అవార్డ్స్... గెలువడం ప్రపంచ వ్యాప్తంగా సినీ రంగ ప్రముఖులకు ఓ కల. అకాడమీ అవార్డు సాధించారంటే చాలు తమ జీవితాశయం నెరవేరినట్లే సంబరపడిపోతారు. భారతీయ సినీ ప్రముఖులూ అందుకు మినహాయింపేమీ కాదు. ఆ క్రమంలోనే అద్భుతమైన చిత్రాలు తీస్తూనే ఉన్నారు. వాటిల్లో కొన్ని ఆస్కార్ దాకా వెళ్తున్నాయి కూడా. నాటి మదర్ ఇండియా మొదలు నేడు వైట్ టైగర్ దాకా ఆస్కార్‌లో భారతీయ చిత్రాలు పోటీపడుతూనే ఉన్నాయి. మన దేశం తరపున ఏ చిత్రం నామినేట్ అయినా భారత్‌తో ఆస్కార్ అనుబంధం మీద చర్చ సహజమే. 93వ అకాడమీ అవార్డ్స్ లైవ్ స్టార్ మూవీస్, స్టార్ వరల్డ్ ఛానెల్స్‌లో ఏప్రిల్ 26న ఉదయం 5.30 గంటలకు ప్రసారం కానుండగా, ఈ కార్యక్రమాన్ని అదే రోజు రాత్రి 8.30 గంటలకు పునః ప్రసారం అవుతుంది. ఈ నేపధ్యంలో మన సినిమాలతో ఆస్కార్ కున్న అనుబంధం ఒకసారి పరిశీలిస్తే...
- ఆస్కార్‌లో భారతీయ చిత్ర ప్రవేశం 1958లో జరిగింది. మదర్ ఇండియా చిత్రం ఉత్తమ అంతర్జాతీయ చిత్రంలో పోటీపడింది. అయితే ఒకే ఒక్క ఓటు తేడాతో ఇటాలియన్ చిత్రం నైట్స్ ఆఫ్ కబ్రినాకు అవార్డును కోల్పోయింది
- ఆస్కార్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయులు అనగానే చాలామంది రక రకాలుగా చెప్తారు కానీ, 1983లో ఓ భారతీయ కాస్ట్యూమ్ డిజైనర్‌కు ఆస్కార్ లభించిందంటే ఆశ్చర్యం కలుగక మానదు. గాంధీ చిత్రానికి గానూ భాను అథైయా గోల్డెన్ ట్రోఫీ అందుకున్నారు. ఇదే చిత్రానికి రవిశంకర్ సైతం నామినేట్ చేయబడ్డారు.
- మన దేశానికి ఆస్కార్‌లో లభించిన అరుదైన గౌరవం మాత్రం సత్యజిత్‌రేకు హానరరీ అకాడమీ అవార్డును 1992లో అందించడమే. ఇప్పటిదాకా ఈ గౌరవాన్ని అందుకున్న ఏకైక భారతీయుడు సత్యజిత్‌రే మాత్రమే.
- భారతీయ కథతో రూపుదిద్దుకున్న బ్రిటీష్ చిత్రం స్లమ్ డాగ్ మిలియనీర్ 2008లో ఏకంగా 8 అవార్డులు అందుకుంది. సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ ఒరిజినల్ సాంగ్, ఒరిజినల్ స్కోర్ పేరిట రెండు అవార్డులు అందుకున్నారు. ఒకటి కన్నా ఎక్కువ అవార్డులు అందుకున్న తొలి భారతీయుడు రెహ్మాన్.
- ఇండియా నుంచి ఉత్తమ అంతర్జాతీయ చిత్ర విభాగాలలో నామినేషన్లు పొందిన చిత్రాలుగా మదర్ ఇండియా, లగాన్, సలామ్ బాంబే మాత్రమే నిలిచాయి.
- ఈ సంవత్సరం వైట్ టైగర్ చిత్రానికి బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే విభాగంలో నామినేషన్ లభించింది. ప్రియాంక చోప్రా, రాజ్‌కుమార్ రావు, ఆదర్శ్ గౌరవ్ లు దీనిలో నటించారు. మరి ఈ చిత్రం ఈ ఏడాది ఆస్కార్‌లో ఏం సాధించనుందో...చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment