
గత కొద్దిరోజులుగా తులసి ఇంట్లో దివ్య టెన్షన్ నెలకొన్న విషయం తెలిసిందే. దివ్యను ఎలా చదివించాలి? తన మెడిసన్ ఫీజు ఎలా కట్టాలి? అన్నదాని మీదే అందరూ మల్లగుల్లాలు పడ్డారు. కానీ కుటుంబం అంటే సంతోషాలను మాత్రమే కాదు బాధలను కూడా పంచుకునేది అని నిరూపిస్తూ అందరూ చేతులు కలిపారు.. తలా ఇంత పోగు చేసి నందు చేతిలో పెట్టారు. దీంతో తన కళ్లను తనే నమ్మలేకపోయిన నందు దివ్య చదువుకు ఇక ఎలాంటి ఆటంకం లేదన్న విషయం అర్థమై సంతోషంలో మునిగి తేలాడు. మరి నేటి ఇంటింటి గృహలక్ష్మి(మే 13) ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగిందో తెలియాలంటే ఇది చదివేయండి..
దివ్యను చదివించాలన్న తాపత్రయానికి తులసి సంతోషించింది. కానీ అందుకోసం నందు కారు అమ్మేయడానికి రెడీ అవడం మాత్రం అస్సలు మింగుడుపడలేదు. దీంతో తను మొదట్లో ఉద్యోగం చేరినప్పుడు ఇచ్చిన చెక్‌ను బయటకు తీసింది. అది ఇప్పుడు అక్కరకు వస్తుందని భావించి కొడుకు చేతికి అందించింది. ఇది చూసిన నందు తండ్రి తన పెన్షన్ డబ్బు లక్ష రూపాయలు ఇస్తానని ముందుకొచ్చాడు. అలాగే తులసి కొడుకు కూడా తన ఆఫీస్‌లో ఎంతో కొంత అడ్వాన్స్ అడిగి తీసుకుంటాను అని చెప్పాడు.
అలా అందరూ కలిసి సమకూర్చిన డబ్బును నందుకు ఇచ్చి దివ్య మెడిసిన్ విద్యకు మార్గం సుగమం చేశారు. ఇక దివ్య ప్రాబ్లమ్ క్లియర్ కావడంతో నందు మనసు మళ్లీ లాస్య వైపు మళ్లింది. ఆమెకు ఫోన్ చేసి.. ఇంకా ఎన్నాళ్లు దూరంగా ఉంటావు, అంత పాపం ఏం చేశాను? అని నిలదీశాడు. దీంతో లాస్య.. నువ్వు నీ కుటుంబ సభ్యులతోనే ఆనందంగా ఉంటావు. అందుకే అక్కడనుంచి వచ్చేశాను అని చెప్పింది.
నువ్వు నాతోనే, నా పక్కనే ఉండాలని నందు అభ్యర్థించాడు. కానీ అది జరిగి తీరదని, తులసి నన్ను అవమానిస్తూ, చీదరించుకుంటూ ఉంటుందని, పైగా మనల్ని దూరం చేస్తోందని చెప్తూ మొసలి కన్నీళ్లు కార్చింది. కాబట్టి ఇకపై నీతో కలిసి జీవించలేనని తెగేసి చెప్పేసింది. దీంతో నందుకు అప్పటివరకు పడ్డ ఆనందం అంతా ఆవిరైపోయినట్లు అనిపించింది. కానీ లాస్య నందును వదిలేసే ప్రసక్తే లేదు. కేవలం అతడి సంతోషాన్ని పోగొట్టేందుకు గుండెల్లో దిగులు పుట్టేందుకు ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. మరి వీరి సంతోషాన్ని కాలరాసేందుకు లాస్య ఇంకా ఎన్ని ఎత్తులు వేస్తుందో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment