టైటిల్ : జై భీమ్
నటీనటులు : సూర్య, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, రాజిష విజయన్, లిజోమోల్ జోసీ, మణికంఠన్ తదితరులు
నిర్మాతలు : సూర్య, జ్యోతిక
దర్శకత్వం : టి.జె.జ్ణానవేల్
సంగీతం : షాన్ రొనాల్డ్
ఎడిటింగ్ : ఫిలోమిన్ రాజ్
సినిమాటోగ్రఫీ : ఎస్.ఆర్.కాదిర్
విడుదల తేది : నవంబర్ 02, 2021(అమెజాన్ ప్రెమ్ వీడియో
సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రయోగాలకే పెద్ద పీట వేస్తుంటాడు తమిళ స్టార్ హీరో సూర్య. విభిన్నమైన కథలతో తెరకేక్కే సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపుతాడు. కొత్త కొత్త గెటప్ లలో దర్శనం ఇస్తూ సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురి చేస్తాడు. సూర్య కెరీర్లో అత్యధిక విజయాలు ప్రయోగాల ద్వారా వచ్చినవే. తాజాగా ఈ స్టార్ హీరో చేసిన మరో ప్రయోగమే ‘జై భీమ్’.కోర్టు రూమ్ డ్రామాగా రూపొందించిన ఈ సినిమా నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైంది. దళితులపై అగ్ర కులాల ఆకృత్యాల నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. (Jai Bhim: దుమారం రేపుతున్న ‘చెంపదెబ్బ’ సీన్)
కథేటంటే..
రాజన్న(మణికందన్), సినతల్లి(లిజోమోల్ జోస్) దళిత దంపతులు. పాములు పట్టుకుంటూ జీవనం సాగిస్తారు. ఒక రోజు ఆ ఊరి ప్రెసిడెంట్ ఇంట్లోకి పాము రావడంతో దాన్ని పట్టుకునేందుకు రాజన్న వెళ్తాడు. ఆ తర్వాత ప్రెసిడెంట్ ఇంట్లో దొంగతనం జరుగుతుంది. ఈ కేసులో రాజన్నను అరెస్ట్ చేస్తారు పోలీసులు. పాములు పట్టే క్రమంలో అన్ని గమనించే రాజన్న ఈ చోరీకి పాల్పడ్డాడని కేసు ఫైల్ చేస్తారు. నేరం ఒప్పుకోమని రాజన్నతో పాటు అతని కుటుంబ సభ్యులను సైతం వేధిస్తారు. అయితే చేయని తప్పుని ఒప్పుకోనని మొండికేస్తాడు రాజన్. కట్ చేస్తే.. జైలు నుంచి రాజన్న తప్పించుకుపోయాడని భార్య సినతల్లికి చెబుతారు పోలీసులు. దీంతో తన భర్త ఏమయ్యాడో తెలియక ఆమె బాధపడుతుంటుంది. తన భర్త ఆచూకి కోసం లాయర్ చంద్రు(సూర్య)ను కలుస్తుంది సినతల్లి. ఆమె దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ కేసును టేకాప్ చేస్తాడు చంద్రు. ఈ క్రమంలో చంద్రుకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? రాజన్న కోసం చంద్రు వేసిన పిటిషన్ కారణంగా ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయి?ఇంతకీ రాజన్న ఏమయ్యాడు? అనేదే ‘జైభీమ్’కథ
ఎవరెలా చేశారంటే..?
లాయర్ చంద్రు పాత్రలో సూర్య ఎప్పటి మాదిరే అద్భుతంగా నటించాడు. కోర్టు సీన్స్‌లో ఆయన పలికించిన హావభావాలు మనసును తాకుతాయి. ‘ఆకాశం నీ హద్దురా’లాంటి అద్భుతమైన చిత్రం తర్వాత.. అదే స్థాయి డెప్త్ ఉన్న రోల్ తనది. చంద్రు పాత్రలో సూర్య తప్ప మరొకరని ఊహించుకోలేం. ఇక గిరిజన దంపతులుగా మణికందన్, లిజో మోల్ జోసేలు అద్భుత నటనను కనబరిచారు. ముఖ్యంగా సినతల్లిగా నటించిన లిజోమోల్ జోస్ గురించి చెప్పాలి. సమాజంలోని దాష్టీకాన్ని ఎదిరించే దళిత మహిళగా ఆమె నటన అభినందనీయం. డీజీపీ దగ్గర ఆమె చెప్పే డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. సిన్సియర్ పోలీస్ గా ప్రకాష్ రాజ్, పంతులమ్మగా రజిషా విజయన్, రావు రమేశ్ తమదైన నటనతో మెప్పించారు.
జై భీమ్ ఎలా ఉందంటే..?
పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసిన తన భర్తను విడిపించుకునేందుకు ఓ గిరిజన మహిళ చేసిన పోరాటమే ‘జై భీమ్’. తమిళనాడులోని కడలూరులో జరిగిన ఓ నిజ ఘటనను ఆధారంగా చేసుకుని ఈ మూవీని రూపొందించాడు దర్శకుడు జ్ణానవేల్. ఇటీవల తెలుగులో వచ్చిన వకీల్ సాబ్, నాంది, తిమ్మరుసు సినిమాల మాదిరే ‘జైభీమ్’ కూడా కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కింది. ఓ అమాయకుడు చేయని తప్పుకు జైలుపాలవ్వడం.. ఆ కేసును హీరో టేకప్ చేసి, ప్రత‍్యర్థుల ఎత్తుగడలను తిప్పికొడుతూ.. చివరకు న్యాయం జరిపించడం. దాదాపు కోర్టు డ్రామా నేపథ్యంలో వచ్చే సినిమాలన్ని ఇలానే సాగుతాయి. దర్శకుడు జ్ఞాన్‌వేల్ అలాంటి పాయింట్‌నే ఎంచుకుని ఉత్కంఠ భరితంగా ‘జై భీమ్’ను తెరకెక్కించాడు. తాను ఎంచుకున్న పాయింట్‌ని తెరపై చూపించడంలో వందశాతం సఫలమయ్యాడు. అమాయకులపై కొందరు పోలీసులు అక్రమ కేసులు పెట్టి, వారు నేరం ఒప్పుకునేందుకు ఎలాంటి చర్యలకు పాల్పడతారనే విషయాలను కళ్లకు కట్టినట్లుగా చూపించాడు.
లాయర్ చంద్రుగా సూర్య ఎంట్రీ అయినప్పటి సినిమాపై ఆసక్తి పెరుగుతంది. అరెస్ట్ అయిన రాజన్న జైలులో కనిపించకపోవడం, అతను ఏమయ్యాడే విషయాన్ని చివరి వరకు చెప్పకపోవడంతో సినిమాపై ఉత్కంఠ పెరుతుంది. పోలీసులు అతడిని ఏం చేశారు? అసలు బతికే ఉన్నాడా? అన్న ప్రశ్నలు ప్రేక్షకుడి మదిలో మొదలవుతాయి. చివరకు అసలు విషయం తెలిసి భావోద్వేగానికి లోనవుతారు. ఇక క్లైమాక్స్ అయితే అదుర్స్ అనే చెప్పాలి. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినా.. కట్టిపడేసేలా కథనాన్ని నడిపించాడు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. షాన్ రొనాల్డ్ సంగీతం చాలా బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకి ప్రాణం పోశాడు.ఎస్.ఆర్. కాదిర్ సినిమాటోగ్రఫీ బాగుంది. కోర్టు సన్నివేశాలను తెరపై అద్భుతంగా చూపించాడు. . ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment