
ఫైల్ ఫోటో
సాక్షి, ముంబై: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇంటివద్ద శుక్రవారం అర్థరాత్రి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. మనాలీలోని కంగనా నివాసం సమీపంలో తుపాకీ శబ్దాలు వినిపించటంతో ఆమె పోలీసులకు సమాచారం అందించారు. నటుడు సుశాంత్ సింగ్ మరణం తరువాత బాలీవుడ్ తీరుతెన్నులపై విమర్శలు గుప్పిస్తున్నకంగనా ముఖ్యమంత్రి కుమారుడిని ‘‘బేబీ పెంగ్విన్’’అని సంబోధిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన తరువాత రోజు ఈ పరిణామం చోటు చేసుకోవడం ఆమె అభిమానుల్లో ఆందోళన రేపుతోంది. (సుశాంత్ ఆత్మహత్య కేసులో తాజా ట్విస్ట్ )
ఈ ఘటనపై నటి కంగనా రనౌత్ ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం రాత్రి 11.30 గంటలకు పెద్ద శబ్దం వినిపించిందని, వెంటానే తాను తన సెక్యూరిటీ ఇన్‌ఛార్జిని పిలిచినట్లు తెలిపారు. అయితే, ఆపిల్ తోటల్లో గబ్బిలాలను భయపెట్టడానికి ఎవరైనా తుపాకీతో కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు అనుమానించారని కానీ పొరుగువారిని అడిగినప్పుడు, వారు దీన్ని ఖండించారని వెల్లడించారు. ఎనిమిది సెకన్ల వ్యవధిలో రెండు షాట్లను విన్నాననీ, తుపాకీ కాల్పులు ఎలా ఉంటాయో తనకు తెలుసంటూ ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు. (కంగన రనౌత్ సంచలన వ్యాఖ్యలు)
స్థానికుల ద్వారా తనను బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, కేవలం ఏడు, ఎనిమిది వేల రూపాయలు ఇచ్చి ఇలాంటి చేయించడం ముంబైలో పెద్ద కష్టమేమీ కాదని కంగనా వ్యాఖ్యానించారు. అంతేకాదు బహుశా సుశాంత్ ను కూడా ఇలాగే భయపెట్టి ఉంటారని పేర్కొన్నారు. అయినా తాను భయపడేది లేదని ప్రశ్నిస్తూనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కొడుకు గురించి వ్యాఖ్యలు చేసిన తర్వాత తనను బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కంగనా అభిప్రాయపడ్డారు. తన ఫిర్యాదు మేరకు బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారని కంగనా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment