![Kangana Ranaut Move Supreme Court Seeking Transfer Of FIRs - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/3/Kangana-Ranaut.jpg.webp?itok=h2iyAJri)
న్యూఢిల్లీ : ముంబైలో తనపై ఉన్న కేసులన్నింటిని సిమ్లాలోని కోర్టుకు తరలించాలంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముంబైలో తనకు, తన సోదరి రంగోలి చందేల్‌కు ప్రాణహాని ఉందని, తన ఆస్తులకు సైతం ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో కేసులన్నింటిని సిమ్లా కోర్టుకు మార్చాల్సిందిగా తన లాయర్ నీరజ్ శేఖర్ ద్వారా పిటిషన్ దాఖలు చేయించారు. శివసేన ప్రభుత్వానికి తనపై ఉన్న వ్యక్తిగత కోపం కారణంగా ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నట్లు ఆమె అందులో వివరించారు. ఆమెపై నమోదైన పలు కేసుల వివరాలను పిటిషన్‌లో పేర్కొంటూ, ఆ కేసులన్నింటిని సిమ్లా కోర్టుకు మార్చాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తనకు చెందిన ఇంటిని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూల్చేసిన ఘటనను సైతం ఆమె ప్రస్తావించారు. దాన్ని హైకోర్టు కూడా తప్పుబట్టిందని అందులో పేర్కొన్నారు. ఈ చర్యల ద్వారా ప్రభుత్వం తనపై వ్యక్తిగత కక్షను పెంచుకుందని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment