తెలుగు సినీ పరిశ్రమకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. బాహుబలితో మొదలైన ఈ ప్రభంజనం ఆర్‌ఆర్‌ఆర్ వరకు ఇంకా కొనసాగుతూనే ఉంది. టాలీవుడ్‌తో పాటు సౌత్ సినిమాలన్నీ బాలీవుడ్ లెక్కలను బీట్ చేస్తున్నాయి. కేజీఎఫ్, సాహో, పుష్ప సినిమాలే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు కొత్తగా ఆర్‌ఆర్‌ఆర్ కూడా ఆ జాబితాలో చేరింది. ఈ క్రమంలో సౌత్ ఇండస్ట్రీపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న అగ్రదర్శక నిర్మాత కరణ్ జోహార్ దక్షిణాది సినిమాలను ఆకాశానికెత్తేసాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమ నుంచి వస్తున్న విభిన్న తరహా చిత్రాలను చూసి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ నేర్చుకోవాలని, రొటీన్ సినిమాలు కాకుండా కొత్త దారిని ఎంచుకోవాలని అభిప్రాయపడ్డారు. బాలీవుడ్‌లో మూసధోరణి కొనసాగుతుంది. బయోపిక్స్ హిట్ అయితే అంతా ఆ తరహా సినిమాలను రూపొందిస్తాం.
ఒకవేళ సందేశాత్మక సినిమాలు విజయం సాధిస్తే అవే కథల్ని ఎంచుకుంటాం. నాతో సహా దర్శక నిర్మాతలంతా పక్కవాళ్లు ఏం చేస్తున్నారనే ఆలోచిస్తుంటాం. కానీ తెలుగులో అలా కాదు. తమ సొంత ఆలోచనలతో కథలు రూపొందిస్తున్నారు. అందుకే ఇటీవల వచ్చిన పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్ లాంటి సినిమాలు బాలీవుడ్‌లో కూడా గొప్ప విజయాలు సాధిస్తున్నాయి అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment