
టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) 'ఆషిఖి 3' (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజైన ఫస్ట్‌లుక్ టీజర్‌లో వీరి కెమిస్ట్రీ చూసి అభిమానులు ఫిదా అయ్యారు. మీ జోడీ బాగుందని మెచ్చుకున్నారు. పైగా బయట కూడా తరచూ జంటగానే కనిపించడంతో ఆఫ్‌స్క్రీన్‌లోనూ ప్రేమాయణం నడిపిస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది.
నేను సింగిల్
తాజాగా ఈ రూమర్‌పై కార్తీక్ క్లారిటీ ఇచ్చాడు. ఫిలింఫేర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ మాట్లాడుతూ.. నేను సింగిల్‌గా ఉన్నాను. ప్రస్తుతం ఎవరితోనూ డేటింగ్‌లో లేను. గతంలోనూ నేను పలువురితో ప్రేమాయణం సాగించినట్లు వార్తలు వచ్చాయి. అందులో కొన్ని నిజాలు కాగా మరికొన్ని ఉట్టి అబద్ధాలు మాత్రమే!
నేర్చుకున్నా..
అప్పుడీ గాసిప్స్ గురించి నేనంతగా పట్టించుకునేవాడిని కాదు. నేను ఎవరినైనా కలిసినా కూడా ఏవేవో కథనాలు అల్లుకునేవారు. ఒకరకంగా చెప్పాలంటే నా గురించి నాకే తెలియని వార్తలు వచ్చేవి. అవి చూసి నేను కాస్త జాగ్రత్తగా ఉండాలని తెలుసుకున్నాను. పరిస్థితుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చాడు. కాగా కార్తీక్.. జాన్వీ కపూర్, సారా అలీఖాన్, అనన్య పాండే వంటి పలువురు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినట్లు ఆమధ్య వార్తలు వచ్చాయి.
రూ.50 కోట్లు.. నేనొక్కడినే తీసుకుంటున్నానా?
కార్తీక్ ఒక్కో సినిమాకుగానూ రూ.50 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు వస్తున్న వార్తలపైనా స్పందించాడు. ఇండస్ట్రీలో నేనొక్కడినే అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నానా? మిగతావాళ్ల గురించి రాయరు కానీ నాగురించి మాత్రం నొక్కి చెప్తుంటారు అని అసహనం వ్యక్తి చేశాడు. కార్తీక్- శ్రీలీలల సినిమా విషయానికి వస్తే.. అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కృషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది.
చదవండి: అల్లు అర్జున్ బర్త్‌డే: 'ఎదురు నీకు లేదులే.. అడ్డు నీకు రాదులే'