టైటిల్ : కవిసమ్రాట్
దర్శకత్వం: సవిత్ సి చంద్ర
నిర్మాత : ఎల్. బి. శ్రీరామ్
సంగీతం: జోశ్యభట్ల
కవి సమ్రాట్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పద్మభూషణ్..ఎన్నో అవార్డులు, మరెన్నో సత్కారాలు, సన్మానాలు.. ఇవన్నీ విశ్వనాథ సత్యనారాయణకు విశేషణాలు, అలంకారాలు, అభినందన మాలలు. వాస్తవానికి విశ్వనాథ సత్యనారాయణ భారతరత్న కంటె ఎక్కువే. మేరు నగధీరుడు. ఆయన... అల నన్నయకు లేదు తిక్కనకు లేదా భోగము.. అన్న ధిషణాహంకారి.ఆ ధిషణ ఆయనకు అలంకారం. ఆ అహంకారం ఆయనకు ఆభరణం.కవన్నాక.. కాదు కాదు కవిసమ్రాట్ అన్నాక ఆ మాత్రం ఆత్మగౌరవం ఉండాల్సిందే. అదే చూపారు కవిసమ్రాట్ సినిమాలో దర్శకులు సవిత్ సి. చంద్ర.ఈ యువకుడి వయసు రెండున్నర పదులు. చదివింది ఇంజనీరింగ్.
అసలు విశ్వనాథ సత్యనారాయణను అర్థం చేసుకోగలిగే వయసు కాదు.కాని... ఆయనను తనలోకి ఆవహింపచేసుకున్నాడు ఈ యువ దర్శకుడు.తాతగారయిన డా. చివుకుల సుందరరామశర్మ గారి నుంచి వారసత్వంగా తెలుగు సాహిత్యం వచ్చి ఉండొచ్చు. ఈ చిత్రంలో మూసధోరణిలో ఆయన ఎక్కడ ఎప్పుడు పుట్టారు, బాల్యం విద్యాభ్యాసం వంటి అంశాలు కనిపించవు. ఆయన ధిషణ మాత్రమే మనకు చూపాడు దర్శకుడు.ఏది ఏమైనా యువతరం తలచుకుంటే సాధించలేనిది, చేసి చూపించలేనిది లేదని నిరూపించాడు దర్శకుడు సవిత్ సి. చంద్ర.ఇందులో ఎల్. బి. శ్రీరామ్ ను చూస్తుంటే సాక్షాత్తు విశ్వనాథ సత్యనారాయణ కళ్ల ముందు కదలాడారు.
పాత్రలోకి ప్రవేశించి, ఎక్కడా ఎల్. బి. శ్రీరామ్ అనే నటుడు కనపడకుండా సహజంగా నటించారు. విశ్వనాథ సత్యనారాయణ సోదరుడి పాత్రలో అనంత్, తండ్రిగా ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్యశాస్త్రి ఎంతో చక్కగా నటించారు. ఒక తెలుగు సాహితీవేత్తను వెండి తెర మీద చూపి తెలుగు కవి ఔన్నత్యానికి వన్నె తెచ్చి, తెలుగు ఖ్యాతిని సినీ లోకానికి పరిచయం చేసిన ఈ యువదర్శకుడి తెలుగు భాషాభిమానానిని మెచ్చుకోవాలి.
విశ్వనాథ సత్యనారాయణ చెప్పినట్లుగా నన్నయ, తిక్కనల మీద కాకుండా ఆయన మీదే ఒక చిత్రం రావటం కూడా ఆయన దార్శనికత కనిపిస్తుంది.విశ్వనాథ సత్యనారాయణను ఒక తెలుగు హీరోగా చిత్రీకరించాడు దర్శకుడు.ఈ చిత్రాన్ని ఆదరించి, తెలుగు జ్ఞానపీఠాన్ని ఈ తరానికి చేరువ చేయడం తెలుగు ప్రేక్షకుల బాధ్యత.ఈ చిత్రంలో పద్మనాభం పాత్రలో నటించిన శ్రీఅన్వేష్ వెండితెరకు మరో మంచి కొత్త కమెడియన్, విలన్‌గా అందరినీ ఆకర్షిస్తాడు. జోశ్యభట్ల చేసిన సంగీతం ఈ చిత్రాన్ని ఆ రోజుల్లోకి తీసుకువెళ్తుంది. ఇదొక ఫీల్ గుడ్ సినిమా.
Comments
Please login to add a commentAdd a comment