టైటిల్ : కిరోసిన్
నటీనటులు :ధృవ, ప్రీతిసింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, సమ్మెట గాంధీ, మధుసూదన్ రావు, కాంచెరపాలెం రాజు తదితరులు
నిర్మాణ సంస్థ :బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్
నిర్మాతలు: దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్
దర్శకత్వం : ధృవ
విడుదల తేది: జూన్ 17,2022
టాలీవుడ్‌లో పెద్ద తరహా చిత్రాలే కాదు.. కాన్సెప్ట్ బాగుంటే చిన్న చిత్రాలు కూడా మంచి వసూళ్లను రాబడుతాయి. అందుకే ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో చిన్న సినిమా ధైర్యంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. వాటిలో చాలా వరకు సక్సెస్ సాధించాయి కూడా. తాజాగా మరో చిన్న చిత్రం ‘కిరోసిన్’ థియేటర్ల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం (జూన్ 17) థియేటర్లలో విడుదలైంది. ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.
‘కిరోసిన్’కథేంటంటే..
జనగూడెం తండాకి చెందిన రామప్ప(సమ్మెట గాంధీ)కూతురు గౌరీ(లావణ్య చెవుల) హత్యకు గురవుతుంది. లోకల్ ఎమ్మెల్యే దొరబాబు(బ్రహ్మాజీ) ఒత్తిడితో నిందితులను పట్టుకోకుండానే.. తప్పుడు ఆధారాలు చూపించి ఈ కేసును క్లోజ్ చేస్తాడు ఎస్సై(జీవిన్). కొన్ని రోజుల తర్వాత పైఅధికారులు ఈ కేసు దర్యాప్తుని ఏసీపీ వైభవ్(ధృవ)కి అప్పజెప్పుతారు. వైభవ్ ఈ కేసు దర్యాప్తులో భాగంగా తండా సర్పంచ్ రావుల నాయక్(మధుసూదన్ రావు)తో పాటు పలువురి అనుమానితులను విచారిస్తాడు. ఈ హత్య కేసుకు గతంలో జరిగిన మరో ఇద్దరి యువతల హత్యలకు సంబంధం ఉందని ఏసీపీ ధృవ భావిస్తాడు. ఆ దిశగా విచారణ చేపట్టడంతో అసలు నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏంటి? గౌరీని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? వేరు వేరు ప్రాంతాల్లో జరిగిన హత్యలకు గౌరీ హత్య కేసుతో ఎలాంటి సంబంధం ఉంది? చివరకు ఏసీపీ వైభవ్ హంతకుడిని ఎలా పట్టుకున్నాడు? ఈ చిత్రానికి అసలు కిరోసిన్ అనే టైటిల్ పెట్టడం వెనుక ఉన్న కారణం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. కానీ, సరైన రీతిలో తీస్తేనే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వినూత్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దర్శకుడు ధృవ. ఈ చిత్రంలో ఆయనే హీరోగా నటించడం విశేషం. ధృవ ఎంచుకున్న పాయింట్స్, రాసుకున్న స్క్రీన్‌ప్లే, డిజైన్ చేసుకున్న క్యారెక్టర్లు బాగున్నాయి. అయితే కథ కాస్త నెమ్మదిగా సాగడం మైనస్. ఫస్టాఫ్ అంతా గౌరీ కేసు విచారణ చుట్టే తిరుగుతుంది. ఆమెని ఎవరు హత్య చేశారనేది క్లైమాక్స్ వరకు తెలియజేయకుండా సస్పెన్స్‌ని మెయింట్ చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ధృవ ఎంట్రీతో ఫస్టాప్‌లో వేగం పుంజుకుంటుంది. గౌరీ కేసు కంటే ముందు మరో హత్య కేసుని ఏసీపీ వైభవ్ నిమిషాల్లో చేధించే సీన్ ఆకట్టుకుంటుంది. బిడ్డ చనిపోయిన విషయం తెలిశాక తండ్రి రామప్ప ఏడుస్తూ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే.. ఎస్సై పట్టించుకోకపోవడం, ఓ అమాయకుడిని ఇరికించి, ఈ కేసుని క్లోజ్ చేయడం పోలీసు వ్యవస్థలో జరిగే అన్యాయాలకు ఎత్తిచూపెడుతోంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. వేరు వేరు ప్రాంతాల్లో జరిగే హత్యలకు గౌరీ కేసుతో ముడిపెడుతూ.. ఏసీపీ చేసిన విచారణ ఆకట్టుకుంటుంది. ఈ వరుస హత్యల వెనుక ఏదో పెద్ద కారణం ఉంటుందని భావించిన ప్రేక్షకుడికి కాస్త నిరాశ కలిగించేలా క్లైమాక్స్ ఉంటుంది.అయితే ఇలాంటి సైకోలు కూడా సాధారన వ్యక్తులుగా మన చుట్టూ ఉంటారా? అనేలా క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారికి ‘కిరోసిన్’ నచ్చుతుంది.
ఇక నటీనటుల ఫెర్పార్మెన్స్ విషయానికొస్తే..ఏసీపీ వైభవ్‌గా ధృవ చక్కటి నటనను కనబరిచాడు. తండావాసి రామప్ప పాత్రలో సమ్మెట గాంధీ ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్‌ని బాగా పండించాడు. ఎమ్మెల్యే దొరబాబుగా బ్రహ్మాజీ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఆయన పాత్ర నిడివి తక్కువే. సినియర్ నటుడైన బ్రహ్మాజీని ఇంకాస్త వాడుకుంటే సినిమాకు కలిసొచ్చేది. అగర్ బత్తీలు అమ్ముకునే శివయ్య పాత్ర ఈ సినిమాకు హైలైట్. ఈ పాత్రలో రామారావు జాదవ్ ఒదిగిపోయాడు. సైకోగా తనదైన నటనతో మూడు నిమిషాలు హడలెత్తించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువల సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment