Kiran Abbavaram About Sammathame Movie, Gopinath Reddy - Sakshi
Sakshi News home page

Kiran Abbavaram: బొమ్మరిల్లు లాంటి వైబ్‌లోనే సమ్మతమే ఉంటుంది

Published Mon, Jun 20 2022 8:55 PM | Last Updated on Mon, Jun 20 2022 9:12 PM

Kiran Abbavaram About Sammathame Movie, Gopinath Reddy - Sakshi

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ "సమ్మతమే". చాందిని చౌదరి కథానాయికగా నటిస్తోంది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హీరో కిరణ్ అబ్బవరం మీడియాతో మాట్లాడారు. ఆయన పంచుకున్న "సమ్మతమే" చిత్ర విశేషాలివి. 

"సమ్మతమే" చిత్రానికి మీరెలా సమ్మతమయ్యారు?
దర్శకుడు గోపీనాథ్, నేను నాలుగేళ్ళుగా ప్రయాణిస్తున్నాం. హైదరాబాద్‌కు వచ్చి షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నప్పటి నుంచి గోపి నాకు పరిచయం. సినిమా పట్ల ఇద్దరికీ ఒకే అవగాహన, ప్యాషన్ వుంది. ఇద్దరం ఒక్కటిగా తిరిగి సినిమాపై ఇంకా అవగాహన పెంచుకుని, నేర్చుకున్నాం. ఈ క్రమంలో నేను 'రాజా వారు రాణి గారు', 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' చేశాను. గోపి అప్పటికే ఇంకా కథని రాస్తున్నాడు. తను సమయం ఎక్కువ తీసుకుంటాడు. స్క్రిప్ట్ చాలా పగడ్బందీగా తయారైన తర్వాత 'సమ్మతమే' స్టార్ట్ చేశాం. ఇలాంటి పాయింట్‌ను ఎవరూ తీయలేదు.

సమ్మతమే కథ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే?
ట్రైలర్ ఓపెనింగ్‌లోనే ఒక డైలాగ్ వుంటుంది. ఇంటికి మహాలక్షి ఆడపిల్ల. ఆ ఆడపిల్ల లేని ఇల్లు బోసిపోయి వుంటుంది. ఇందులో కథానాయకుడి పేరు కృష్ణ. అతని తల్లి చిన్నప్పుడే చనిపోతుంది. ఆ ఇంటికి మళ్ళీ ఆడపిల్ల వస్తే కళ వస్తుంది. అందుకే చిన్నప్పుడే 'నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావని'' నాన్నని అడుగుతాడు. పెళ్లిపై అంత శుభసంకల్పం వున్న ఒక క్యారెక్టర్‌కు తన పెళ్లిచూపుల్లో ఎలాంటి అమ్మాయి ఎదురైంది? దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు? ఒక మధ్యతరగతి కుర్రాడు సిటీ నేపథ్యం ఉన్న అమ్మాయి ప్రేమలో పడితే ఎలా వుంటుంది? అనే అంశాలు చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి.

ట్రైలర్‌లో ఒక డైలాగ్‌కు బీప్ సౌండ్ కూడా వేశారు. యూత్‌ను ఆకర్షించడానికా?
లేదండీ. ఆ పరిస్థితిలో అతని బాధ ఎక్కువగా వుంటుంది. ఆ భాదలో ఆ మాట ఎవరైనా వాడుతారు. షూటింగ్ చేసినప్పుడు ఆ పదం అవసరమని చేశాం. ట్రైలర్ లో కూడా ఆ పదం వదిలేయవచ్చు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎలాంటి ఇబ్బంది వుండకూడదని బీప్ పెట్టి విడుదల చేశాం. 

సినిమాలో మిగతా నటీనటుల గురించి?
సినిమా లో చాలా పెద్ద కాస్ట్ వుంది. సప్తగిరి గారి ఎపిసోడ్ చాలా బావుంటుంది. చాలా మంది మంచి నటులు వున్నారు. సర్‌ప్రైజ్‌ కోసం చూపించలేదు. లిమిటెడ్ బడ్జెట్‌లో ఈ సినిమా చేయాలని అనుకున్నాం. తెలియకుండానే సమ్మతమే పెద్ద సినిమా అయ్యింది. 75 లైవ్ లోకేషన్స్‌లో సినిమా తీశాం. ఎక్కడా రాజీపడలేదు. మీరు చూసినప్పుడు కూడా ఆ రిచ్ నెస్ కనిపిస్తుంది.

దర్శకుడు గోపితో ప్రయాణం గురించి?
మేము ఇద్దరం అన్నదమ్ముల్లా వుంటాం. నా ప్రతి సినిమా రిలీజ్ కి గోపి ఫ్యామిలీ అంతా వస్తారు.  మాఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనేసరికి తెలియకుండానే ఒక కంఫర్ట్ జోన్ వచ్చేసింది.  

మూడు నాలుగు నెలల వ్యవధిలో కొత్త సినిమాతో వస్తున్నారు కదా.. ఇలా వరుస సినిమాలతో రావడం సరైన వ్యూహమేనా ? 
నా వరకైతే సరైన వ్యూహమేనని చెప్తాను. హీరోలు ఎక్కువ సినిమాలు చేయడమే కరెక్ట్ అని నా వ్యక్తిగత అభిప్రాయం. వరుసగా సినిమాలు బయటికి వస్తుంటే అందరికీ పని దొరుకుతుంది. అయితే ఒక సినిమాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. నేను వరుసగా నాలుగు సినిమాలు చేస్తున్నప్పటికీ వాటికి కేటాయించే సమయం ఎక్కువ. ప్రతి సినిమాపై చాలా కేర్ తీసుకుంటాను. నా దర్శకులు, నిర్మాతలు బలంగా వుండటం నా అదృష్టం. అనుకున్న సీన్ సరిగ్గా రాకపోతే మళ్ళీ షూట్ చేయడానికి నిర్మాతలు సిద్దంగా వున్నారు. ఇప్పుడు రాబోతున్న నాలుగు సినిమాలు చాలా పెద్ద స్కేల్‌లో చేశాం.

మీ ప్రతి సినిమా మధ్యతరగతి నేపధ్యంలో వుంటుంది కదా ? దీనికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా?
నాకు ఇలాంటి కథలు నచ్చుతున్నాయేమో. నేను దర్శక నిర్మాతలకు అలా కనిపిస్తున్నానేమో. నాపై ఇలాంటి కథలు చేస్తే వర్క్ అవుట్ అవుతాయని అనుకోవచ్చు. నేను కథ ఎంపిక చేసినప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ పాయింట్లకి మొగ్గు చూపను. నాకు మన మధ్య జరిగే కథలే ఇష్టం. ఇది మనోడి కథరా అనే ఫీలింగ్ ఉన్నప్పుడే నేను ఎక్కువ ఎగ్జయిట్‌ అవుతాను. ఇలాంటి కథలే ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడతాను. 

సమ్మతమే టైటిల్ చాలా సాఫ్ట్ గా వుంటుంది కదా.. అందరికీ రీచ్ అవుతుందా లేదా అని చర్చించారా?
ఇలాంటి టైటిల్స్ వినగా వినగా వాల్ పోస్టర్పై చూడగా చూడగా ఎక్కువగా రీచ్ వుంటుంది. ఉదాహరణకి గీత గోవిందం. సమ్మతమే ఫార్మాట్ కూడా ఇలానే వుంటుంది. బొమ్మరిల్లు లాంటి సినిమాని చూసినపుడు ఎంటర్టైన్మెంట్, లవ్ ని ఫీలవుతూ ఒక మంచి ఫీలింగ్ తో బయటికివస్తాం కదా, అలాంటి వైబ్‌లోనే సమ్మతమే ఉంటుంది. సమ్మతమే టైటిల్ విన్నప్పుడే చాలా ఎగ్జయిట్ ఫీలయ్యాం. 

'సమ్మతమే' ఒక అమ్మాయి ఎమోషన్ మీద నడిచే కథ అని చెప్తున్నారు కదా! హీరోయిన్ ని ఎంపిక చేయడానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి ? చాందినీని ఎంపిక చేయడనికి కారణం ? 
హీరోయిన్ ని ఎంపిక చేసే క్రమంలో చాలా సమయం పట్టింది. దర్శకుడు గోపి ఐదు నెలలు తీసుకున్నాడు. నేను అప్పటికీ ఇంకా తెలిసిన హీరో కాలేదు. కేవలం రాజా వారు రాణి గారు ఒక్కటే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోయిన్ కోసం చాలా ఆప్షన్స్ చూశాం. చాలా రిజక్షన్స్‌ కూడా అయ్యాయి. ఈ క్రమంలో తెలుగమ్మాయి చాందినీ అయితే ఇద్దరి జోడి బావుంటుందని దర్శకుడు గోపి చాందినీని ఫైనల్ చేశారు.

ట్రైలర్ లో పోటాపోటీగా మీ సీన్స్ కనిపిస్తున్నాయి.. సెట్స్ లో మీ కెమిస్ట్రీ ఎలా వుండేది ? మీ కెమిస్ట్రీని స్క్రీన్ పై ఎలా బ్యాలెన్స్ చేశారు ? 
బయట కూడా మేము అలానే వుండటం వలన మాకు అది పెద్ద సమస్య కాలేదు. చాందినీ నాలానే కొంచెం హైపర్ యాక్టివ్ గా వుంటుంది. తన పోష్ కల్చర్ నాకు నిజంగానే తేడా వుండేది. దీంతో నటించాల్సిన అవసరం రాలేదు. (నవ్వుతూ). చాలా సహజంగా వచ్చేసింది. 

రెట్రో సాంగ్ పెట్టినట్లు ఉన్నారు కదా?
దీని కోసం చిన్న లిబర్టీ తీసుకున్నాం. హీరో తనకు అమ్మాయి లేదనే పెయిన్‌లో ఉన్నపుడు కలలో వెళ్ళే ఒక స్వేచ్ఛ ఉంటుంది. అలా 90 వైబ్స్ కి తీసుకెళ్ళి చేసిన పాట అది. పాట చాలా బాగా వచ్చింది.

చాందినీ, మీరు ఇద్దరూ షార్ట్ ఫిలిమ్స్ నుంచే వచ్చారు కదా.. కలసి నటించడం ఎలా అనిపించింది?
చాలా సంతోషంగా అనిపించింది. మేము ఎక్కడి నుంచి వచ్చామో మూలాలు తెలుసు. ఆ కంఫర్ట్ జోన్ వుంది. ఆ ఫ్రెష్ నెస్ ని మీరు స్క్రీన్ పై చూస్తారు. కృష్ణ ,శాన్వీ పెయిర్ చూడముచ్చటగా వుంటుంది. ట్రైలర్ చూసి చాలా మంది ఇదే చెప్పారు. 

మీ కొత్త సినిమాల గురించి?
ఆగస్ట్‌లో 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' రిలీజ్ వుంటుంది. సెప్టెంబర్ చివరిలో 'వినరో భాగ్యం విష్ణు కథ' గీత ఆర్ట్స్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ సినిమా వుంటుంది. ఈ ఏడాదిలోనే ఈ మూడు సినిమాలు విడుదలవుతాయి.

చదవండి: జూన్‌ నాలుగో వారంలో విడుదలవుతున్న సినిమాల లిస్ట్‌ ఇదిగో!
 హనీమూన్‌కు చెక్కేసిన నయనతార దంపతులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement