
తమిళసినిమా: చిత్రాల్లో మంచి కంటెంట్ ఉంటే స్టార్ వాల్యూస్ లేకపోయినా ప్రేక్షక ఆదరణ పొందుతున్న రోజులివి. దీంతో ఈ తరం దర్శకులు కొందరు కథని నమ్ముకుని చిత్రాలు చేస్తున్నారు. అలా రూపొందిన చిత్రాల్లో వన్‌వే ఒకటని చెప్ప వచ్చు. జీ.గ్రూప్ ప్రొడక్షన్స్ పతాకంపై నటుడు హర్బజన్ ప్రధాన పాత్రలో నటించిన ఇందులో నటి కోవై సరళ, ఆరా, చార్లెస్ వినోద్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
నటి కుష్బూ అన్నయ్య అబ్దుల్లా కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి ఎంఎస్ శక్తివేల్ దర్శకత్వం వహించారు. ముత్తు కుమరన్ చాయాగ్రహణం, అశ్వివన్ హేమంత్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 4వ తేదీన థియేటర్లో విడుదలకు సిద్ధమవుతుంది. చిత్ర కథను దర్శకుడు ఒక కుగ్రామం నుంచి పైశాచిక ఆనందాన్ని పొందే బడా బాబుల సంస్కృతి వరకు తీసుకెళ్లాడు.
ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఒక నిరుపేద కుటుంబానికి చెందిన కోవై సరళ భర్త అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడితే ఇద్దరు పిల్లలతో ఆ తల్లి ఏం చేసిందీ? కుటుంబ బాధ్యతలు మీద పడడంతో డబ్బు సంపాదన కోసం ముంబయి వెళ్లిన యువకుడు ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాడు? ప్రాణాలను కోల్పోయేంత డేంజరస్ గేమ్‌లోకి ఎలా నెట్టపడ్డాడు? అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం వన్ వే. ప్రాణాలతో చెలగాటం ఆడే ఆ గేమ్ ఏమిటీ? అందులోకి బలవంతంగా నెట్టపడిన యువకుడి పరిస్థితి ఏమిటి అనే సన్నివేశాలను దర్శకుడు ఉత్కంఠ భరితంగా తెరపై ఆవిష్కరించారు.