‘‘నేనిప్పటివరకూ ఏ సినిమాలోనూ సిగరెట్ తాగే సన్నివేశంలో నటించలేదు. ‘కోట బొమ్మాళి పీఎస్’ సినిమా కథకు అవసరం కావడంతో తొలిసారి స్మోకింగ్ సన్నివేశం చేశాను. అందుకే ఈ చిత్రం నాకు సవాల్‌గా అనిపించింది’’ అని నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పిన విశేషాలు.
∙నేను కథే హీరోగా భావిస్తాను. నా కెరీర్‌లో తమిళంలో ఎక్కువగా పోలీస్ పాత్రలు చేశాను. కానీ తెలుగులో మాత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’ నా తొలి మూవీ. ప్రస్తుతం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి పోలీస్ ఆఫీసర్ పాత్రలకు క్రేజ్ ఉంటోంది. ∙‘కోట బొమ్మాళి పీఎస్’లో శ్రీకాంత్‌గారు, నేను పోలీస్ ఆఫీసర్స్. ఇద్దరిలో ఒకరు క్రిమినల్ అయితే ఎలా ఉంటుంది? పోలీసులపై రాజకీయ నాయకుల ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది? అన్నది ఈ చిత్రకథ.
పిల్లి మరియు ఎలుక ఆటలా థ్రిల్ చేసేలా ఉంటుంది. ఓటు గురించి అవగాహన కల్పించే లైన్ కూడా ఉంటుంది. ఎన్నికల టైమ్‌లో వస్తున్న మా సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ∙‘వరలక్ష్మి చాలా వైవిధ్యంగా చేసింది’ అని ప్రేక్షకులు అనుకునేలా మంచి పాత్రలు చేయడమే నా లక్ష్యం. లేడీ ఓరియంటెండ్ సినిమాలతో పాటు పాత్ర నచ్చితే ఎలాంటి మూవీలోనైనా నటించడానికి రెడీ. తెలుగులో నేను నటించిన ‘హనుమాన్’ సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది. కన్నడలో సుదీప్‌తో ‘మ్యాక్స్’ చిత్రంలో నటిస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment