కృష్ణంరాజు, శ్యామలా దేవి
మీ పెళ్లయ్యి 23 (2019కి) ఏళ్లు. ఇన్నేళ్ల వైవాహిక జీవితం గురించి...
కృష్ణంరాజు: ఇన్నేళ్లయిందా అనిపిస్తోంది. మా జీవితం మంచి కలలా సాగిపోతోందంటే.. మా మధ్య ఉన్న అండర్‌స్టాండింగ్ కారణం. కోపాలు ఉంటాయి. అలా కోపం వచ్చినప్పుడు కాసేపు మాట్లాడుకోం. అయితే కోపం తగ్గి, కొంత గ్యాప్ ఇచ్చాక మాట్లాడుకుంటాం చూడండి.. అది మాత్రం భలే ఉంటుంది.
పెళ్లి రోజుకి కానుకలు ఇచ్చుకుంటారా?
శ్యామల: కృష్ణంరాజుగారే నాకు పెద్ద గిఫ్ట్. నేను పెట్టుకునే నగలు, కట్టుకునే చీరలు అన్నీ ఆయన కొనేవే. అన్నింటికీ మించి ఆయనే పెద్ద బహుమతి.
శ్యామలగారు ఇచ్చిన బహుమతుల గురించి?
కృష్ణంరాజు: తనే నాకు గిఫ్ట్.
శ్యామల: నేను మాత్రమే కాదు.. బుద్ధిమంతులైన ముగ్గురు పిల్లలను బహుమతిగా ఇచ్చాను (నవ్వుతూ).
కృష్ణంరాజుగారికి మీరు అభిమాని. అభిమాన హీరోతో పెళ్లి విశేషాలు చెబుతారా?
శ్యామల: పెళ్లి రోజున కృష్ణంరాజుగారి వైపు తలెత్తి చూడాలంటే వణుకు. ఎలాగో ధైర్యం కూడదీసుకుని ముందు కాళ్ల నుంచి చూసుకుంటూ ముఖం చూశాను. కలా? నిజమా అర్థం కాలేదు. పెళ్లికి ముందు రోజు విజయనగరం నుంచి హైదరాబాద్ వచ్చాం. నాకు జామకాయలంటే ఇష్టం. విడిది ఇంట్లో జామ చెట్టు ఉంది. నేను జామకాయలు కోస్తుంటే ‘పెళ్లి కూతురివి. కొయ్యకూడదు’ అని అమ్మ మందలించింది.
పెద్ద కుటుంబంలోకి కోడలిగా అడుగుపెడుతుంటే భయం అనిపించిందా?
శ్యామల: వీళ్లది పెద్ద ఫ్యామిలీ కాబట్టి అంత మందిలో నేను ఇమడగలుగుతానా అని అమ్మ భయపడింది. కానీ కృష్ణంరాజుగారు నాతో ‘ఎవరో ఏదో అంటారని భయపడొద్దు. ఏ పని చేసినా చక్కగా చెయ్’ అని ధైర్యం ఇచ్చారు.
మరి.. పెళ్లి చూపుల గురించి?
శ్యామల: ఆయన వాళ్ల కజిన్‌ని పంపించి, అమ్మాయిని బలవంతంగా ఒప్పించి, పెళ్లి చేస్తున్నారా? ఇష్టపడే చేసుకుంటుందా? అని అడిగి తెలుసుకోమన్నారు. ‘నాకిష్టం’ అని చెప్పాను. ఆయన కజిన్ వచ్చేసరికి మా ఇంటి చుట్టుపక్కల పిల్లలతో ఆడుకుంటున్నాను. ‘నేను వెళ్లేసరికి వదినగారు పిల్లలతో ఆడుకుంటున్నారు’ అని ఆయన చెబితే, ‘అయితే ఓకే.. మనస్తత్వం కూడా పిల్లల్లానే ఉంటుంది. మంచిదే’ అని నా ఫొటో చూసి, ఓకే చేశారు.
కృష్ణంరాజుగారి ఫస్ట్ భార్య చనిపోయాక మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు... బాగా చూసుకుంటారో లేదోననే సందేహం ఏమైనా?
శ్యామల: అస్సలు లేదు. ఆయన మంచితనం గురించి ముందే మాకు తెలుసు. ఎన్నో దాన ధర్మాలు చేసేవారు. ఆ కుటుంబానికి ఎంతో మంచి పేరుంది. ఆ ఫ్యామిలీలోకి వచ్చిన కొన్నాళ్లకే అందరికీ దగ్గరయ్యాను.
ఇంట్లో ఎవరి మాట నెగ్గుతుంది?
కృష్ణంరాజు: బేసిక్‌గా నా అభిప్రాయాలను వేరేవాళ్ల మీద రుద్దడం నాకు ఇష్టం ఉండదు. ఒకరి అభిప్రాయానికి విలువ ఇవ్వకపోతే అండర్‌స్టాండింగ్ ఉండదు. తన విషయంలోనే కాదు.. నా పిల్లల విషయంలోనూ అంతే చేస్తాను.
శ్యామల: మనం నమ్మితే పిల్లలు ఆ నమ్మకాన్ని నిలబెడతారన్నది మా అభిప్రాయం.
కృష్ణంరాజు: ‘జీన్స్’ అంటారు కదా.. అది నిజమే. ఆ ఫ్యామిలీ తాలూకు జీన్స్ పిల్లలకు కచ్చితంగా వస్తాయి. నా చిన్నప్పుడు మా నాన్నగారికి ఆరోగ్యం బాగా లేకపోతే నన్ను పిలిచి ‘మన కుటుంబం ఇలాంటిది. మన పూర్వీకులు ఇలాంటివారు’ అని చెబితే, నా మన సులో నాటుకుపోయింది. మా నాన్నగారు ఎన్నో వందల కుటుంబాలను ఆదుకున్నారు.
అవన్నీ తెలిసిన వ్యక్తిగా నాకూ సహాయం చేయడం అలవాటైంది. అలాగే కుటుంబ పరువుకి నష్టం కలగకూడదనేది డెవలప్ అయింది. అప్పుడు మా నాన్నగారు నాకు చెప్పినట్లుగా ఇప్పుడు నేను నా పిల్లలకు చెబుతుంటాను. అలాగే మా నాన్నగారికి ఉన్న సహాయ గుణం నాకు వచ్చినట్లుగా నా పిల్లలకూ వచ్చింది. ‘కుటుంబ గౌరవం’ అనే విషయాన్ని నా పిల్లలు కూడా తెలుసుకున్నారు.
మీకు ముగ్గురి పిల్లల చదువుల విషయంలో, ఇతర వ్యక్తిగత విషయాల్లో వాళ్లకు మీరు ఇస్తున్న గైడెన్స్ గురించి?
కృష్ణంరాజు: మా అమ్మాయిలు ఎప్పుడైనా డౌన్ అయితే ‘యు ఆర్ కృష్ణంరాజు డాటర్.. యు ఆర్ గ్రేట్. డోంట్ వర్రీ. భయపడొద్దు. మీ గురించి ఎవరో ఏదో చెబుతారని అనుకోవద్దు. నేను నమ్మను’ అని చెబుతుంటాను.
అలా నమ్మి పెంచడంవల్ల పిల్లలు డొనేషన్ కట్టించుకోవడానికి, రికమండేషన్ చేయించుకోవడానికి ఇష్టపడలేదు. ముగ్గురూ చదువులో బెస్ట్. మా పెద్ద అమ్మాయి సాయిప్రసీద లండన్‌లో మెరిట్ మీద ఎంబీఏ సీట్ సంపాదించుకుంది. చిన్న పాప సాయి ప్రకీర్తి ఆర్కిటెక్చర్ చదువుతోంది. మంచి పర్సంటేజ్ రావడంతో జేఎన్‌టీయూలో సీట్ వచ్చింది. మూడో పాప సైకాలజీ చదువుతానంది. సరే.. మూడు నాలుగు లక్షలు డొనేషన్ కడతా అన్నాను. అయితే బాగా చదువుకుని తనే సీట్ తెచ్చుకుంది.
పిల్లలు చక్కగా పెరగడంలో ఎవరి పాత్ర ఎక్కువ?
కృష్ణంరాజు: తన పాత్ర ఎక్కువ. నిద్ర లేచిన దగ్గర్నుంచి వాళ్లకేం కావాలి? ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంటే చదువుకోగలుగుతారు? అన్నీ తనకు తెలుసు. ఆవిడకి ముగ్గురు పిల్లలు కాదు... నాతో కలిపి నలుగురం.
ముగ్గురు అమ్మాయిలను పెంచడం కష్టంగా ఉందా? బాబు (కృష్ణంరాజు)ని పెంచడమా?
శ్యామల: (నవ్వుతూ).. నాకు ఈయన్ని పెంచడమే చాలా ఇష్టం. పిల్లలు పుట్టాక చాలామంది భర్త మీద ప్రేమ తగ్గిందని, శ్రద్ధ తగ్గిందని అంటారు. కానీ నాకు మాత్రం ముందు ఆయనే. ఆయన్ను చూసుకుంటూ పిల్లల్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటాను. పిల్లల సెలవులప్పుడే నేను గుడికి వెళుతుంటాను. ఆ సమయంలో పిల్లల్ని వాళ్ల నాన్న దగ్గర పెట్టి నేను పూజలకు వెళతాను.
మా పుట్టింటికి వెళ్లాలన్నా ఒకటీ రెండు రోజులు మాత్రమే. కృష్ణంరాజుగారికి అందరి ఆకలి తెలుసు కానీ ఆయన ఆకలి ఆయనకు తెలియదు. మనం తెలుసుకుని పెట్టాలి. ఆ విషయంలో అత్తింట్లో వాళ్లకి భార్య ఎలా చూస్తుందో అని కాస్త టెన్షన్ ఉండేది. కానీ నేను వచ్చి, చూసుకోవడం మొదలుపెట్టాక ఆ టెన్షన్ పోయింది. (మధ్యలో కృష్ణంరాజు అందుకుంటూ).. మా అమ్మ అయితే చాలా టెన్షన్ పడేది. ఆకలైనా చెప్పేవాడిని కాదు. నీరసం వచ్చి అలా నిద్రపోయేవాడిని. అందుకని వాడు అడగడు.. మనమే పెట్టాలనేది. ఇప్పుడు ఈవిడ అలానే పెడుతుంది.
కృష్ణంరాజుగారు భోజనప్రియుడు.. మీ వంటల్లో ఆయనకు బాగా నచ్చినవి?
శ్యామల: అన్నీ ఇష్టమే. నాన్‌వెజ్ అంటే చాలా ఇష్టం. మావాళ్లు ఫుడ్ బాగా తింటారు.. అలానే అందరికీ పెడతారు. ఆయనకు పెసరట్టు అంటే ఇష్టం. ఆయన పెద్దక్క నాకు నేర్పించారు. ఆయన చేపల కూర బాగా వండుతారు.
మీరు వంట ఎలా నేర్చుకున్నారు?
కృష్ణంరాజు: నేను వేటకు వెళ్లేవాడిని. పొద్దున్నే పచ్చ పావురాలను వేటాడి తీసుకు వస్తే.. అక్కడే అడవిలో వండి పెట్టేవాళ్లు. లంచ్‌కి
కొండ గొర్రె వండించేవాళ్లం. ఒక్కోసారి పులి గాండ్రింపులు వినపడినప్పుడు వంట చేసేవాళ్లు పారిపోతే, నేనే వంట చేసేవాడిని. ఆ విధంగా వంట నేర్చుకున్నాను.
ఎప్పుడైనా పులిని వేటాడారా?
కృష్ణంరాజు: లేదు. అయితే నా వెనకాల నుంచి ఒక్క పరుగుతో ముందుకు వెళ్లింది. పులి మహా పిరికి. తననెవరైనా ఎటాక్ చేస్తారనే అనుమానం కలిగితేనే అది ఎటాక్ చేస్తుంది. లేకపోతే చేయదు.
శ్యామల: మీకు ఓ పులి ఫ్యాన్ కదా..
కృష్ణంరాజు: అవును. ఒక పులి ఉండేది. ‘కటకటాల రుద్రయ్య’ కోసం ఆ పులిని తీసుకొచ్చారు. అది గాండ్రించడం మొదలుపెట్టింది. నేను దాని మెడ దగ్గర నిమురుతూ మచ్చిక చేసుకున్నాను. ఆ పులితో నాకు ఫైట్ సీన్ ప్లాన్ చేశారు. అంతకుముందు నేను దాని మెడ పట్టుకుంటే విసిరి కొట్టింది. అంత దూరం పడ్డాను. అయితే మచ్చిక చేసుకున్న తర్వాత ఫ్రెండ్లీ అయిపోయింది. అదే పులిని ఏడాది తర్వాత వేరే సినిమా కోసం తెస్తే.. నన్ను గుర్తు పట్టింది.
హ్యాపీ మ్యారీడ్ లైఫ్‌కి కొన్ని టిప్స్?
ఇద్దరూ: ఇప్పుడు ఆడపిల్లలు, మగపిల్లలు కలిసి చదువుకుంటున్నారు. ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అయితే పెళ్లయ్యాక కొందరు మగపిల్లలు ఆంక్షలు పెడుతున్నారు. ఫ్రెండ్లీనెస్ పోతోంది. అది తప్పు. అలాగే ‘ఈగో’ సమస్యలతో విడిపోతున్నారు. చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసుకోకుండా ఉంటే కాపురం హాయిగా ఉంటుంది. అలాగే ఇద్దరూ సంపాదించుకుంటున్నారు కాబట్టి కొన్ని జంటలు ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అన్నట్లు ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య పోటీ తప్పు. ఇద్దరూ సమానం అనుకోవాలి.
– డి.జి. భవాని
ప్రభాస్ గురించి?
శ్యామల: మా ఆయన్ను ప్రభాస్ ‘పెద్ద బాజీ’ అని పిలుస్తాడు. నన్ను ‘కన్నమ్మా’ అని పిలుస్తాడు. ప్రభాస్ మాకు కొడుకే. ఇప్పుడు మా ప్రభాస్ ఏమంటాడంటే.. ‘ఇన్నేళ్లు కష్టపడ్డారు. ఇప్పుడు మీరు సుఖపడాలి. మిమ్మల్ని మేం హ్యాపీగా చూడాలి’ అని వాళ్ల పెదనాన్నతో అంటాడు. పెదనాన్న అంటే.. తనకు సుప్రీమ్ అన్నమాట. అంత ప్రేమ. చెల్లెళ్లతో కూడా చాలా ప్రేమగా ఉంటాడు.
Comments
Please login to add a commentAdd a comment