ఆస్కార్‌ బరిలో లాపతా లేడీస్‌ | Laapataa Ladies: India Official Entry to Oscars | Sakshi
Sakshi News home page

ఆస్కార్‌ బరిలో లాపతా లేడీస్‌

Published Tue, Sep 24 2024 3:04 AM | Last Updated on Tue, Sep 24 2024 9:04 AM

Laapataa Ladies: India Official Entry to Oscars

బాలీవుడ్‌ చిత్రం ‘లాపతా లేడీస్‌’కు అరుదైన ఘనత దక్కింది. వచ్చే ఏడాది మార్చిలో లాస్‌ ఏంజిల్స్‌లో జరగనున్న 97వ ఆస్కార్‌ అవార్డ్స్‌లోని ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్  కోసం పోటీ పడేందుకు ‘లాపతా లేడీస్‌’ చిత్రం బరిలో నిలిచింది. భారతదేశం తరఫున ఈ సినిమాను ఆస్కార్‌ నామినేషన్  ఎంపిక కోసం పంపిస్తున్నట్లు ‘ఫిల్మ్‌ ఫెడరేషన్  ఆఫ్‌ ఇండియా’ (ఎఫ్‌ఎఫ్‌ఐ) సోమవారం ప్రకటించింది.

29 చిత్రాలు పరిశీలించి ‘లాపతా లేడీస్‌’ని ఏకగ్రీవంగా ఇండియా ఎంట్రీగా ఆస్కార్‌ నామినేషన్‌కి పంపేందుకు ఎంపిక చేసినట్లు ‘ఎఫ్‌ఎఫ్‌ఐ’  కమిటీ డైరెక్టర్‌ ఆర్‌.జహ్ను బారువా తెలిపారు. కిరణ్‌రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్‌’లో నితాన్షి గోయల్, ప్రతిభా రంతా, స్పర్శ్‌ శ్రీవాస్తవ్‌ ప్రధాన పాత్రధారులుగా, రవికిషన్ , ఛాయాకందం ఇతర పాత్రల్లో నటించారు. ఆమిర్‌ఖాన్ , కిరణ్‌రావు, జ్యోతిదేశ్‌ పాండే నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది సెప్టెంబరులో జరిగిన 48వ టోరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో తొలిసారి ప్రదర్శించబడి ప్రశంసలు అందుకుంది.ఆ తర్వాత ఈ ఏడాది మార్చి 1న థియేటర్స్‌లో విడుదలై, సూపర్‌హిట్‌ ఫిల్మ్‌గా నిలిచింది. 

1958లో జరిగిన 30వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో ‘మదర్‌ ఇండియా’, 1989లో జరిగిన 61వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో ‘సలామ్‌ బాంబే’, 2002లో జరిగిన 74వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో ‘లగాన్ ’ చిత్రాలు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ ను దక్కించుకున్నప్పటికీ అవార్డులను గెలుచుకోలేదు. గత ఏడాది ‘ఎఫ్‌ఎఫ్‌ఐ’ ఆస్కార్‌కు పంపిన మలయాళ చిత్రం  ‘2018: ఎవ్రీవన్  ఈజ్‌ ఏ హీరో’ కూడా నామినేషన్  దక్కించుకోలేదు.

తాజాగా ‘లాపతా లేడీస్‌’ ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ ను దక్కించుకుంటే.. 23ఏళ్ల తర్వాత ఈ విభాగంలో ఆస్కార్‌ నామినేషన్ ను దక్కించుకున్న భారతీయ చిత్రంగా నిలుస్తుంది. వచ్చే ఏడాది జనవరి 17న ఆస్కార్‌ నామినేషన్ ్సను అధికారికంగా ప్రకటించనున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement