ఉషా ఉతుప్
పాప్ సింగర్‌గా.. విలక్షణ పాటలకు కేరాఫ్‌గా..
ఒక హీరోకి పాడిన ఏకైక గాయనిగా...
నైట్‌క్లబ్‌సింగర్‌గా.. దమ్మారో దమ్ పాటతో నేపథ్య గాయనిగా...
51 సంవత్సరాలుగా పాటల ప్రపంచానికి సుపరిచితులు ఉషా ఉతుప్.
ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె తన గురించి చెప్పుకొచ్చారు..
ఉషా ఉతుప్.. ఈ పేరు వినగానే పెద్ద బొట్టు, పట్టు చీర, భారీ నగలు.. ఎప్పటినుంచి ఈ వేషధారణ ప్రారంభమైంది అని నన్ను అడుగుతారు. 1969లో ప్రారంభించాను. అప్పట్లో మంచి కంచి పట్టు చీరలు దొరికేవి కాదు. చాంద్ పొట్ట్ అని తమిళంలో అంటారు. అదే తిలకం సీసా. ఆ సీసాలో ఉండే చిన్న పుల్లలాంటి దానితో బొట్టు పెట్టుకునేదాన్ని. నేను పాటలు పాడటం మొదలుపెట్టే సమయానికి రంగుల రంగులలో సింగార్ కుంకుమ్ రావటం మొదలైంది. ఆ కుంకాన్ని చేతితో ముఖం మీద గుండ్రంగా పెట్టుకునేవారు. నేను కూడా అలా మొదలుపెట్టాను. అలా అలా రానురాను పరిమాణం పెరుగుతూ వచ్చింది. బొట్టుతోపాటు నేను కూడా పెద్దదాన్ని అవుతున్నాను. నేను ఎయిర్‌పోర్టుకి వెళ్లినప్పుడు, ఎప్పుడైనా ఉదయాన్నే ముఖాన బొట్టు కనిపించకపోతే, అక్కడి వారు ‘అమ్మా, బొట్టు ఏది, పెట్టుకోలేదేంటి’ అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నిస్తున్నారు. అందరికీ నా బొట్టు అంత అలవాటయిపోయింది. బొట్టు నా జీవితంలో భాగం అయిపోయింది. ఈ వేషధారణ నాకు నేనుగా రూపొందించుకున్నాను.
నైట్ క్లబ్‌లో పాడుతోంది
నేను నైట్ క్లబ్‌సింగర్‌గా నా కెరీర్ ప్రారంభించాను. ఆ తరవాత సినీపరిశ్రమలో నేపథ్య గాయనిగా మారాను. నైట్‌క్లబ్‌లో నా పాట విన్న లక్ష్మీకాంత్ ప్యారేలాల్, ఆర్‌డి బర్మన్, శంకర్ జైకిషన్... ఇంకా చాలామంది... మద్రాసీ అమ్మాయి నైట్ క్లబ్‌లో పాడుతోంది అంటూ వినటానికి ఆసక్తి చూపేవారు. ఆ తరవాత వాళ్ల సినిమాలలో పాడటానికి అవకాశం ఇచ్చారు. నేను ఓబెరాయ్ హోటల్‌లో పాడినప్పుడు, బాలీవుడ్ నటుడు దేవానంద్ అక్కడ ఉన్నారు. పాట పూర్తికాగానే నన్ను పిలిపించి, ‘హరేరామ హరే కృష్ణ చిత్రంలో పాడతావా’ అని అడిగారు. అది 1969.
షాన్ సినిమాకి పాడాను
నేను ప్లేబాక్ సింగర్‌గా దమ్మారో దమ్ పాటతో కెరీర్ ప్రారంభమయ్యింది. దేవుళ్ల పేర్లు నన్ను చుట్టుముట్టేశాయి. హరి ఓం హరి, హరేరామ్ హరేకృష్ణ, రాధేశ్యామ్ రాధేశ్యామ్ పాటలు పాడాను. అందరూ నా పాట విని, కోమల గళంతో, చాలా బాగా పాడానని నన్ను ప్రశంసించారు. నా గొంతులాంటి గొంతు మాత్రం కాదు వారిది. నా కెరీర్ ప్రారంభమయ్యాక, ఎవరైనా హీరోయిన్లకు నా గొంతు సరిపోదనుకుంటే, టైటిల్స్ పడుతున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ లో పాడించేవారు. అలా షాన్ సినిమాకి పాడాను. ఒకసారి మిథున్‌చక్రవర్తికి పాడాను. ఒక అబ్బాయికి పాడిన ఏకైక గాయనిని నేనే. అంటూ చెప్పుకొచ్చారు. ఉషా ఉతుప్.
Comments
Please login to add a commentAdd a comment