టైటిల్:లింగొచ్చా
నటీనటులు:కార్తిక్ రత్నం, సుప్యర్ధ సింగ్, ఉత్తేజ్, తాగుబోతు రమేష్, కునాల్ కౌషిక్ . కె, ఫిదా మౌగాల్, ప్రేమ్ సుమన్, భల్వీర్ సింగ్, పటాస్ సద్దామ్, కె. నరసింహ(మిమిక్రి ఆర్టిస్ట్), ఇస్మాయిల్ భాయ్, ఫిష్ వెంకట్, కళా సాగర్, శరత్ కుమార్ తదితరులు
నిర్మాణ సంస్థ:
నిర్మాత:యాదగిరి రాజు
దర్శకుడు: ఆనంద్ బడా
సంగీతం: బికాజ్ రాజ్
విడుదల తేది: అక్టోబర్ 27, 2023
కథేంటంటే..
శివ(కార్తిక్ రత్నం) హైదరాబాద్‌కు చెందిన బార్బర్. తన కులవృత్తిని చేస్తూ.. స్నేహితులతో కలిసి తిరుగుతుంటాడు. అతనికి చిన్నప్పటి నుంచే తన ఏరియాకు చెందిన ముస్లిం అమ్మాయి నూర్జహాన్(సుప్యర్థ సింగ్)అంటే చాలా ఇష్టం. తన వయసుతో పాటు నూర్జహాన్‌పై ప్రేమ కూడా పెరుగుతుంటుంది. కొన్నాళ్లకు నూర్జహాన్‌ను ఆమె పెరెంట్స్ దుబాయ్‌కి పంపిస్తారు. ఆ విషయం తెలియక శివ.. ఆమె ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు. చిన్న వయసులోనే దుబాయ్ వెళ్లిననూర్జహాన్ పెద్దయ్యాక మెడికల్ స్టూడెంట్‌గా తిరిగి హైదరాబాద్‌కు వస్తుంది. ఆ విషయం తెలుసుకున్న శివ..ఆమెకు దగ్గరయ్యేందుకు చాలా ప్రయత్నిస్తాడు.కొన్నాళ్లకు శివ మనసు తెలుసుకున్న నూర్జహాన్.. అతని ప్రేమను అంగీకరిస్తుంది. ఈ విషయంలో ఆమె ఇంట్లో తెలియడంతో వేరే వ్యక్తితో పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? నూర్జహాన్ సింగిల్‌గా ఎందుకు దుబాయ్‌కి వెళ్లాల్సి వచ్చింది? ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడంతో శివ ఏం చేశాడు? చివరకు వీరిద్దరు ఒకటయ్యారా లేదా? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
హైదరాబాద్ నేటివిటి స్టొరీతో సినిమా వచ్చి చాలా కాలమైంది. గతంలో హైదరాబాద్ నేపథ్యంలో హైదరాబాది నవాబ్స్, అంగ్రేజ్ సినిమాలు వచ్చి మంచి విజయం సాధించాయి. చాలా కాలం తర్వాత మళ్లీ అలాంటి నేపథ్యంతో వచ్చిన చిత్రం లింగోచ్చా. పాతబస్తీ నేపథ్యంతో సాగే ఓ మంచి ప్రేమ కథా చిత్రమిది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ..దాన్ని తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. చాలా సన్నివేశాలు గత ప్రేమకథా చిత్రాలను గుర్తు చేస్తాయి. దీంతో ఓ ఫ్రెష్ లవ్‌స్టోరీని చూస్తున్నామనే ఫీలింగ్ కలుగదు. అయితే హైదరాబాదీ నేపథ్యం.. హిందీ, ఉర్తూ, తెలుగు మిక్స్ డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచేలా చేస్తాయి.
తాగుబోతు రమేష్, ఉత్తేజ్ మధ్య జరిగే కామెడీ సంభాషణతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత వెంటనే శివ, నూర్జహాన్ చైల్డ్ ఎపిసోడ్‌తో అసలు కథ ప్రారంభం అవుతుంది. అయితే ఈ చైల్డ్ ఎపిసోడ్ కాస్త సాగదీతగా అనిపిస్తుంది. నూర్జహాన్ దుబాయ్ నుంచి తిరిగి వచ్చి ఎంబీబీఎస్ కాలేజీలో చేరిన తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది.
తను ప్రేమించిన అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం శివ చేసే ప్రయత్నాలు కాస్త నవ్విస్తాయి. కానీ ఆ సీన్లతో కొత్తదనం కనిపించదు. ఇక సెకండాఫ్‌లో కూడా చాలా సన్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. కానీ చివరి 20 నిమిషాలు మాత్రం అందరూ కథలో లీనమైపోతారు. ఫ్రీక్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కథను నడించిన విధానం బాగుంది. నటీనటుల నుంచి, సాంకేతిక వర్గం నుంచి మంచి ఔట్‌ఫుట్ రావడంతో దర్శకుడు పాసయ్యాడు. కానీ కథ, కథనంపై ఇంకాస్త ఫోకస్ పెట్టి.. కొత్త ప్రజెంట్ చేసి ఉంటే ‘లింగోచ్చా’ ఫలితం మరోలా ఉండేది.
ఎవరెలా చేశారంటే..
కార్తిక్ రత్నం మంచి నటుడు. ఎలాంటి పాత్రలో అయినా జీవించేశాడు. ఈ చిత్రంలో కూడా పాతబస్తీకి చెందిన నాయి బ్రాహ్మణుడు శివ పాత్రలో ఒదిగిపోయాడు. డైలాగ్ డెలివరీతో పాటు డ్యాన్స్ కూడా ఇరగదీశాడు. ఇక ముస్లిం యువతి నూర్జహాన్‌గా సుప్యర్థ సింగి తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. తెరపై అందంగా కనిపించింది. తాగుబోతు రమేష్, ఉత్తేజ్ లు స్టోరి నేరేటర్స్ గా మెప్పించారు. మిగతా నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే..
బికాజ్ రాజ్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫి ఈ మూవీకి ప్లస్ అయింది. హైదరాబాద్ అందాలను తెరపై అద్భుతంగా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువల సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment