బుల్లితెరపై మహాభారతంలో కృష్ణుడిగా నటించిన నితీష్ భరద్వాజ్ తన భార్యపై మానసిక వేధింపుల కేసు పెట్టారు. ఆయన భార్య స్మిత మధ్యప్రదేశ్ క్యాడర్‌లో జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. చాలా రోజుల నుంచి స్మిత తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తుందంటూ భోపాల్ కమీషనర్ ఆఫ్ పోలీస్‌కి ఆయన ఫిర్యాదు చేశారు.
స్మిత ఆయనకు రెండో భార్య. 1991లో మోనిషా పాటిల్‌తో నితీష్ భరద్వాజ్‌కు మొదటి వివాహం జరిగింది. 2005లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఐఏఎస్ అధికారిణి అయిన స్మితను ప్రేమించి నితీష్ రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ వారిద్దరి మధ్య కూడా విభేదాలు రావడంతో 2019లో విడాకుల కోసం ధరఖాస్తు చేసుకుంటే 2022లో ముంబై ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసింది. తాజాగా తన రెండో భార్య స్మితపై వేధింపుల కేసు పెట్టడంతో సంచలనంగా మారింది.
భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణచారి మిశ్రా ఈ ఫిర్యాదును స్వీకరించారు. ఈ ఫిర్యాదును స్వీకరించి విచారణకు ఆదేశించారు. ఏడీసీపీ షాలినీ దీక్షిత్ ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నట్లు కమిషనర్ హరినారాయణచారి మిశ్రా తెలిపారు. ఈ కేసులో నిజానిజాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, నితీష్, ఐఏఎస్ అధికారిణి స్మిత ఒకరినొకరు ప్రేమించుకుని 2009లో మధ్యప్రదేశ్‌లో పెళ్లి చేసుకున్నారు. 12 సంవత్సరాల వివాహం తరువాత విబేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలు స్మిత వద్దే ఉంటున్నారు. వారిని కలుద్దామనుకుంటే ఆ అవకాశం స్మిత కల్పించడం లేదని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నాడు. వీరికి 11 ఏళ్ల వయస్సు గల కవల కుమార్తెలు ఉన్నారు. తనను స్మిత మానసిక వేధనకు గురిచేస్తుందని ఆయన ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రముఖ టీవీ షో 'మహాభారతం'లో నటుడు నితీష్ భరద్వాజ్ శ్రీకృష్ణుడి పాత్ర పోషించి మెప్పించారు. గతంలో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment