
తమిళ సినిమా: బహుభాషా నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం మహారాజా. ఫ్యాషన్ స్టూడియోస్ సుధన్ సుందరం, ది రూట్ జగదీష్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొరంగు బొమ్మై చిత్రం ఫేమ్ నిధిలన్ కథా, దర్శకత్వం బాధ్యతలను వహిస్తున్నారు. నటి మమతా మోహన్ దాస్ నాయకిగా నటించిన ఇందులో బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్, నటి అభిరామి, నటుడు నట్టి, అరుల్ దాస్, సింగంపులి తదితరులు ముఖ్యపాత్ర పోషించారు. దినేష్ పురుషోత్తమన్ చాయాగ్రహణం, అద్నీష్ లోకనాథ్ సంగీతాన్ని అందించారు.
ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం చెన్నైలోని ఒక హోటల్లో చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. నటుడు నట్టి మాట్లాడుతూ.. ఈ చిత్ర స్క్రీన్ ప్లే ఇకపై వచ్చే చిత్రాలకు ఒక ఉదాహరణగా ఉంటుందన్నారు. నటి అభిరామి మాట్లాడుతూ.. విజయ్ సేతుపతితో కలిసి నటించిన తొలి చిత్రం ఇదే అన్నారు. చురుకైన కళ్లు కలిగిన వ్యక్తి కమలహాసన్ తర్వాత విజయ్ సేతుపతినే అని పేర్కొన్నారు. ఇలాంటి ఒక స్పెషల్ చిత్రంలో తాను నటించడం సంతోషమని నటి మమతా మోహన్‌దాస్ పేర్కొన్నారు. మహారాజా రివెంజ్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు.
విజయ్ సేతుపతి 50వ చిత్రానికి తాను దర్శకుడు కావడం సంతోషమాన్ని నిధిలన్ పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు విజయ్ చతుపతి మాట్లాడుతూ.. అనుభవం, సహనం మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయన్నారు. అలాంటి అనుభవాన్ని కలిగించిన తన దర్శక నిర్మాతలకు, అభిమానులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. 50వ చిత్రం కచ్చితంగా తన సినిమా ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఈ చిత్రం నిర్మాతలకు మూడు రెట్లు లాభాలు తెచ్చిపెడుతుందని దర్శకుడు చెప్పారని, అది పొగరు కాదని.. చిత్రంపై నమ్మకం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment