‘‘ది రాయల్స్’ సిరీస్‌లో ఇషాన్ కట్టర్ తల్లి పాత్రలో నేను నటించాల్సి ఉంది. అయితే నాకు చెప్పిన కథకి, ఫైనల్ స్క్రిప్ట్‌కి సంబంధం లేదనిపించింది... అందుకే ‘ది రాయల్స్’ అవకాశాన్ని తిరస్కరించాను’’ అని చెప్పారు బాలీవుడ్ నటి మల్లికా శెరావత్. రాజ్ శాండిల్య దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’. గత నెల 11న విడుదలైన ఈ సినిమాలో చందా రాణి అనే పాత్రలో తనదైన నటనతో అలరించారు మల్లికా శెరావత్.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ– ‘‘ఇషాన్ కట్టర్ లీడ్ రోల్‌లో ‘ది రాయల్స్’ సిరీస్‌ని రూపొందించాలని నెట్‌ఫ్లిక్స్ సంస్థ భావించింది. ఇందులో ఇషాన్ తల్లి పాత్రలో నటించమని మేకర్స్ నన్ను సంప్రదించారు. నా పాత్ర, కథ ఎంతో నచ్చడంతో చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే ఫైనల్‌గా స్క్రిప్ట్ పేపర్ మీదకు వచ్చేసరికి ఎన్నో మార్పులు జరిగాయి. చెప్పిన దానికి, రాసిన దానికి సంబంధం లేదనిపించింది.
దీంతో వాళ్లు నన్ను మోసం చేశారనిపించి, నేను చేయనని తిరస్కరించాను’’ అని తెలిపారు. అలాగే తన వ్యక్తిగత విషయం గురించి కూడా ఆమె స్పంది స్తూ– ‘‘గతంలో నేను ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నాను. అయితే అది బ్రేకప్ అయింది. ప్రస్తుతానికి సింగిల్‌గానే ఉన్నాను. వివాహంపై నాకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మంచి మనసు ఉన్న వ్యక్తిని భర్తగా పొందడం కష్టమే. నా ఆరోగ్యంపట్ల నేనెప్పుడూ జాగ్రత్తగా ఉంటాను. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటాను. అలాగే మంచి భోజనం తింటా, సమయానికి నిద్రపోతా’’ అని తెలిపారు మల్లికా శెరావత్.
Comments
Please login to add a commentAdd a comment