మద్యం మత్తులో దురుసు ప్రవర్తన? క్లారిటీ ఇచ్చిన మనోజ్‌ | Manchu Manoj Gives Clarity on Viral Video | Sakshi
Sakshi News home page

Manchu Manoj: నేను ఏ తప్పూ చేయలేదు, ఎక్కడికీ పారిపోను.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నా!

Published Fri, Dec 13 2024 4:19 PM | Last Updated on Fri, Dec 13 2024 5:42 PM

Manchu Manoj Gives Clarity on Viral Video

మద్యం మత్తులో హీరో మంచు మనోజ్‌ ఓ పెద్దాయనతో దురుసుగా ప్రవర్తించాడంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై మనోజ్‌ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. తన బిడ్డను ఇంట్లో బంధించి, తన దగ్గరకు వెళ్లనివ్వకపోతే ఇంకెలా ప్రవర్తిస్తానని ప్రశ్నించాడు. అలాగే తాను మద్యం సేవించలేదని స్పష్టం చేశాడు.

నేనే మీడియాను పిలిచా
'తెలంగాణ డీజీపీ ఆఫీస్‌కు వెళ్లిన తర్వాత జరిగిన ఓ బాధాకర సంఘటన గురించి చెప్పాలి. దానివల్ల నేను, నా భార్య ఎంతో నరకం అనుభవించాం. మా తొమ్మిది నెలల కుమార్తెను ఇంట్లో బంధించి మమ్మల్ని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మాపై దాడి చేశారు. ఆ సమయంలో నా చొక్కా కూడా చిరిగిపోయింది. నిస్సహాయ స్థితిలో ఉన్న నేను మీడియా సాయం కోరాను. మా ఇంటి ఆవరణలోకి రావడంలో వాళ్లది ఏమాత్రం తప్పులేదు.

నా ఛాతీపై కొట్టడంతో..
దీనికి సంబంధించిన వీడియో రిలీజ్‌ చేయాలని విష్ణు భాగస్వామి రాజ్‌ కొందూరును కోరుతున్నాను. ఇప్పటికే కిరణ్‌, విజయ్‌లను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ విచారణ పూర్తయితే నిజాలు బయటకు వస్తాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో విషయానికి వస్తే.. తెల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి నా ఛాతీపై కొట్టాడు. నన్ను నేను రక్షించుకునే క్రమంలో ఆయన్ను వెనక్కు నెట్టేశాను. రెండురోజుల్లో నాపై జరిగిన రెండో దాడికి ఇదే నిదర్శనం. 

మీరైతే ఏం చేస్తారు?
అయినా మీ తొమ్మిది నెలల చిన్నారి నుంచి మిమ్మల్ని దూరం చేస్తే మీరేం చేస్తారో చెప్పండి.. ఆ సమయంలో నేను తాగి ఉన్నానని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆ రోజంతా నేను పోలీసులతో, మీడియాతోనే ఉన్నాను. అలాంటి సమయంలో నేనెక్కడ మందు తాగాను? వినయ్‌ కావాలనే నాపై ఈ పుకార్లు సృష్టించాడు. ఆస్తి కోసం డిమాండ్‌ చేస్తున్నానన్నాడు. నా పరువు మర్యాదలకు భంగం కలిగించి నా నోరు నొక్కేయాలని చూస్తున్నాడు. కానీ నేను వెనక్కు తగ్గను.

ఆయుధాలతో భయపెట్టాలని చూసిన విష్ణు
ఇదంతా జరుగుతున్నప్పుడు నా సోదరుడు విష్ణు ఎక్కడా కనిపించలేదు. మా నాన్నను ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పుడు మాత్రమే కనిపించాడు. దీనికంటే ముందు నాకు సపోర్ట్‌గా వచ్చినవారిని తన బౌన్సర్లతో భయపెట్టేందుకు ప్రయత్నించాడు. ఆయుధాలు కూడా తీసుకువస్తానన్నాడు. అయినప్పటికీ వారు ఏమాత్రం జంకకుండా నా కూతురికి రక్షణగా నిలబడ్డారు.

నేను పారిపోవడం లేదు
వినయ్‌ నా కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తున్నాడు. ఇది అన్యాయం, అనైతికం. నేను ఏ తప్పూ చేయలేదు. సాక్ష్యాధారాలతో నాపై చేసిన ప్రతి ఆరోపణను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను ఎక్కడికీ పారిపోవడం లేదు. నిజం నిప్పులాంటిది.. కచ్చితంగా బయటకు వస్తుంది అని మనోజ్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో రాసుకొచ్చాడు.

చదవండి: సినీ హీరో అల్లు అర్జున్‌ అరెస్ట్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement