
సాక్షి,ముంబై: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఆందోళన రేపుతోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఇప్పటికే యంగ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ కరోనా బారినపడగా, తాజాగా విలక్షణ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. సినిమా షూటింగ్ సమయంలో కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా నిర్ధారణ అయింది. ఈయనతోపాటు చిత్ర దర్శకుడికి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం వీరిద్దరు హోం ఐసోలేషన్‌లో ఉంటూ, వైద్యుల సూచనల మేరకు చికిత్స పొందుతున్నారు. దీంతో షూటింగ్ వాయిదా పడింది. మరోవైపు గతవారం రోజులుగా వీరితో సన్నిహితంగా మెలిగిన వారిలో కరోనా టెన్షన్ మొదలైంది.
తిత్లీ ఫేమ్ కను బెహ్ల్ దర్శకత్వంలో వస్తున్న ‘డెస్పాచ్’ మూవీ షూటింగ్‌లో మనోజ్ బిజీగా ఉండగా వైరస్ బారినపడ్డారు. రోనీ స్క్రూవాలా మూవీని నిర్మిస్తున్నారు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే దర్శక దిగ్గజం రాజమౌళి, హీరో రామచరణ్, హీరోయిన్ తమన్నా తదితరులకు కరోనా సోకింది. తాజాగా తెలుగు, హిందీ సినిమాలలో విలన్ పాత్రలతో ఆకట్టుకున్నంటున్ ఆశిష్ విద్యార్ధి కూడా కరోనా బారిన పడ్డట్టు వీడియో ద్వారా తెలియజేశారు. కాగా గత ఏడాది చాలా మంది బాలీవుడ్ నటులు కోవిడ్-19 బారిన పడ్డారు. ముఖ‍్యంగా సీనియర్ నటులు అమితాబ్ బచ్చన్, హీరో అభిషేక్, ఐశ్వర్య రాయ్ దంపతులు, వారి కుమార్తెతోపాటు, అర్జున్ కపూర్, మలైకా అరోరా, కృతి సనన్, వరుణ్ ధావన్, జెనెలియా డిసౌజా ఇతర ప్రముఖులు కరోనానుంచి కోలుకున్న సంగతి తెలిసిందే.