
లక్కీ హీరోయిన్ల లిస్టులో చేరిపోయారు నటి మీనాక్షీ చౌదరి. చిన్న చిన్న చిత్రాల్లో కథానాయకిగా నటిస్తూ వచ్చిన ఈ భామ తెలుగులో మహేశ్‌బాబు హీరోగా నటించిన గుంటూరు కారం చిత్రంలో నటించి బాగా పాపులర్ అయ్యారు. ఇకపోతే ఈమెకు తమిళంలోనూ వరుసగా అవకాశాలు రావడం విశేషం. కోలీవుడ్‌లోకి విజయ్ ఆంటోని హీరోగా నటించిన కొలై చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం విజయ్ హీరోగా నటించిన గోట్ చిత్రంలో నటించే స్థాయికి చేరుకున్నారు.
వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ నెలలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఇటీవల ఒక భేటీలో నటి మీనాక్షి చౌదరి మాట్లాడుతూ అవకాశాలు రావడం అన్నది దేవుడి వరంగా పేర్కొన్నారు. తనకు చాలా అవకాశాలు వస్తున్నాయని, చాలా సంతోషంగా ఉందన్నారు. నటుడు విజయ్‌కు జంటగా నటించిన గోట్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్‌లో విడుదలకు సిద్ధం అవుతున్నట్లు చెప్పారు. అలాగే దుల్కర్‌సల్మాన్ సరసన నటించిన లక్కీభాస్కర్ కూడా పాన్ ఇండియా చిత్రమేనని చెప్పారు.

ఈ చిత్రం సెప్టెంబర్ నెలలోనే తెరపైకి రానుందని పేర్కొన్నారు. ఇకపోతే తెలుగులో వెంకటేశ్‌కు జంటగా కొత్త చిత్రంలోనూ, వరుణ్ తేజ్ సరసన మట్కా చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నట్లు నటి మీనాక్షీ చౌదరి చెప్పారు. తాను నటిస్తున్న చిత్రాలన్నీ పాన్ ఇండియా చిత్రాలేని పేర్కొన్నారు. అయితే వీటిని చూస్తుంటే ఒక పక్క సంతోషంగా ఉన్నా, మరో పక్క భయంగానూ ఉందన్నారు. యువ హీరోలతోనూ, సీనియర్ హీరోలతోనూ నటించే అవకాశాలు తనకు మాత్రమే వస్తున్నాయని మీనాక్షీ చౌదరి అన్నారు.