రజనీకాంత్ నేరుగా సినిమాల్లోకి రాలేదు. ముందు బస్ కండక్టర్‌గా పని చేశాడు, తర్వాత సినిమాల్లోకి వచ్చి సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ కూడా మొదట్లో ఫుడ్ స్టాల్‌లో పని చేశాడు. మోడలింగ్ చేస్తూ చిన్నా చితకా పాత్రలు పోషిస్తూ నేడు స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. అలా చాలామంది సినిమాల్లోకి రావడానికి ముందు అనేక పనులు చేశారు. ఇప్పుడు చెప్పుకునే వ్యక్తి కూడా మొదట్లో పండ్లు అమ్మాడు. ఆ తర్వాతే ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఇప్పుడు కోట్లు విలువ చేసే కంపెనీ నడుపుతున్నాడు. అతడే కునాల్ కపూర్.
సినిమాకే అంకితమయ్యేవాడిని..
కునాల్ 18 ఏళ్ల వయసులో పండ్లు అమ్మేవాడట. ఈ విషయాన్ని అతడే గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'ఒక్కసారి నేను సినిమా ఒప్పుకున్నాక.. అబ్బా, ఇది చేయకుండా ఉంటే బాగుండేది అని ఎన్నడూ అనుకోలేదు. సినిమాకే అంకితమయ్యేవాడిని. ఏదో ఒక పని చేయాలనుకుంటే సినిమాల్లోకి రాకముందు ఎలాగైతే పండ్లు ఎగుమతి చేసేవాడినో అదే పని కొనసాగించేవాడిని. ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న డాలర్ రేటుతో పోలిస్తే ఈ వ్యాపారం మరింత లాభాలు తెచ్చిపెడుతుంది. కానీ నాకు సినిమా అంటేనే ఇష్టం' అని చెప్పాడు.
అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నటుడిగా..
'అక్స్' అనే మూవీతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు కునాల్. తర్వాత నసీరుద్దీన్ షా నడిపిన యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకున్నాడు. 'మీనాక్షి: ఎ టేల్ ఆఫ్ త్రీ సిటీస్' అనే సినిమాలో తొలిసారి నటించాడు. తనకు గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా 'రంగ్‌దే బసంతి'. ఈ మూవీలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడే కాలేజీ విద్యార్థిగా నటించాడు. ఈ సినిమా తర్వాత అతడు అవకాశాల కోసం వెంపర్లాడే పనిలేకుండా పోయింది. ఆయనను వెతుక్కుంటూ బోలెడన్ని ఛాన్సులు వచ్చిపడ్డాయి. డాన్ 2, ఆజ నచ్లే, బచ్నాయే హసీనో, డియర్ జిందగీ.. ఇలా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు.
ఎంతోమంది ప్రాణం నిలబెట్టిన 'కెట్టో'
ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు ఓ ఎంటర్‌ప్రెన్యూర్ కూడా! క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ కెట్టో స్థాపకుల్లో ఈయన ఒకరు. కెట్టో అనేది.. ఆపదలో ఉన్నవారి కోసం విరాళాలు సేకరించే ప్లాట్‌ఫామ్. 2012లో జహీర్ అదెన్వాలా, వరుణ్ సేత్‌లతో కలిసి కునాల్ ఈ కెట్టోను ప్రారంభించాడు. ఇది ఎంత బాగా హిట్టయిందంటే.. ఇప్పటివరకు రూ.1249 కోట్ల విరాళాలాను సేకరించి ఎంతోమంది ప్రాణాలు కాపాడింది. ఈ ప్లాట్‌ఫామ్ వల్ల సంస్థ వ్యవస్థాపకులకు దాదాపు రూ.110 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి. కాగా కునాల్ కపూర్.. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌కూ బంధువే! అమితాబ్ సోదరుడు అజితాబ్ కూతురు నైనాను కునాల్ పెళ్లాడాడు. అలా వరుసకు అమితాబ్‌కు అల్లుడయ్యాడు. కునాల్ చివరగా ద ఎంపైర్ అనే వెబ్ సిరీస్‌లో కనిపించాడు.
చదవండి: ఆ దర్శకుడు నేను సినిమాల్లోకి పనికి రానన్నాడు.. ఇప్పుడు రెండు చోట్లా..
Comments
Please login to add a commentAdd a comment