
‘‘సినిమాకు కులం, మతం, ప్రాంతం అనే భావన ఉండదు. సినిమా అనేది ప్రజలకు వినోదాన్ని పంచుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికీ అవసరం’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హన్సిక లీడ్ రోల్‌లో డి. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. ‘ది హిడెన్ ట్రూత్’ అనేది ఉపశీర్షిక. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించారు.
ఈ చిత్రం టీజర్, ఫస్ట్ లుక్‌ని తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ‘అఖండ, పుష్ప’ సినిమాల రాకతో ఇండస్ట్రీ కొంత పుంజుకుంది. చిత్ర పరిశ్రమ ఇంకా పుంజుకోవాలని తెలంగాణలో సినిమా టికెట్ ధరలను పెంచడంతో పాటు 5వ ఆటకు అనుమతి ఇచ్చాం. షూటింగ్‌ల పర్మిషన్ కోసం సింగిల్ విండో విధానాన్ని ఓకే చేశాం. తెలంగాణలో ప్రస్తుతానికి థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. పరిస్థితులు ఉధృతంగా ఉంటే ఆంక్షలు విధిస్తాం. త్వరలోనే ఆన్‌లైన్ పోర్టల్‌ని అందుబాటులోకి తీసుకొస్తాం.
ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల సమస్యలపై ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడతాను. ‘మై నేమ్ ఈజ్ శృతి’ చిత్రం గొప్ప విజయం సాధించాలి’’ అన్నారు. శ్రీనివాస్ ఓంకార్ మాట్లాడుతూ– ‘‘ శరీర అవయవాల మాఫియా నేపథ్యంలో ఒక కొత్త కాన్సెప్ట్‌తో తీసిన చిత్రమిది. ఇలాంటి మంచి సినిమా తీసే చాన్స్ ఇచ్చిన నిర్మాతలకు రుణపడి ఉంటాను’’ అన్నారు. ‘‘మా చిత్రం చాలా బాగుంటుంది.. అందరూ ఆదరించాలి’’ అన్నారు హన్సిక. ‘‘ఓ యువతి తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను ఎలా ఎదుర్కొంది? అన్నదే ఈ చిత్రకథ’’ అన్నారు ప్రభాకర్ గౌడ్. ఈ చిత్రానికి సహనిర్మాతలు: పవన్‌కుమార్ బండి, ఏజీ ఎలియస్, నాగేందర్ రాజు, లైన్ ప్రొడ్యూసర్: కె. విజయ్‌కుమార్.
Comments
Please login to add a commentAdd a comment