‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’మూవీ రివ్యూ | 'Miss Shetty Mr Polishetty' Movie Review And Rating In Telugu - Sakshi
Sakshi News home page

‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’మూవీ రివ్యూ

Published Thu, Sep 7 2023 12:11 PM | Last Updated on Fri, Sep 8 2023 9:40 AM

Miss Shetty Mr Polishetty Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి
నటీనటుటు: అనుష్క శెట్టి, నవీన్‌ పోలిశెట్టి, నాజర్‌, మురళీ శర్మ, జయసుధ, అభినవ్ గోమటం, సోనియా దీప్తి, తులసి తదిరతులు
నిర్మాణ సంస్థ: యూవీ క్రియేషన్స్‌
నిర్మాతలు: వంశీ-ప్రమోద్‌
దర్శకత్వం: పి.మహేశ్ బాబు
సంగీతం:రధన్ 
నేపథ్య సంగీతం: గోపీ సుందర్‌
విడుదల తేది: సెప్టెంబర్‌ 7, 2023

కథేంటంటే..
అన్విత(అనుష్క శెట్టి) లండన్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ చెఫ్‌. ఆమె వంటకు లండన్‌ వాసులు ఫిదా అయిపోతారు. కెరీర్‌ పరంగా ఎంతో ఎదిగినా.. పెళ్లి చేసుకోవడానికి మాత్రం నిరాకరిస్తుంది. ఆమె తల్లి(జయసుధ)ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా రిజెక్ట్‌ చేస్తుంది. పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని తల్లితో తెగేసి చెబుతుంది. తల్లి మరణించిన తర్వాత.. తనకు ఓ తోడు కావాలనుకుంటుంది అన్విత. అందుకోసం ఓ బిడ్డను కనాలనుకుంటుంది. అది కూడా పెళ్లి చేసుకోకుండా. ఐయూఐ పద్దతిలో తల్లి కావాలని ఓ డాక్టర్‌ని సంప్రదిస్తుంది. స్పెర్మ్‌ డోనర్‌ని తనే వెతుకుతానని చెప్పి..తనకు నచ్చిన లక్షణాలు ఉన్న యువకుడి కోసం సెర్చ్‌ చేస్తుంది. ఈ క్రమంలో ఆమెకు స్టాండప్ కమెడియన్ సిద్ధు (నవీన్ పోలిశెట్టి) పరిచయం అవుతాడు. తనతో క్లోజ్‌గా మూవ్‌ అయిన తర్వాత అసలు విషయం చెబుతుంది. అయితే అప్పటికే అన్వితతో ప్రేమలో పడిన సిద్దు ఆమెకు సహాయం చేశాడా? లేదా? అసలు అన్విత పెళ్లి చేసుకోకూడదని ఎందుకు నిర్ణయం తీసుకుంది?  ప్రెగ్నెంట్‌ అయిన తర్వాత ఆమె దేశం విడిచి లండన్‌ ఎందుకు వెళ్లింది? చివరకు సిద్ధూ-అన్విత కలిశారా? లేదా? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే.. 
పెళ్లి కాకుండా తల్లి కావాలనుకునే ఓ యువతి కథే ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. ఈ పాయింట్‌ వినగానే ఏదో వల్గారిటీ సినిమా అనే ఫిలింగ్‌ కలుగుతుంది. అదే సమయంలో అనుష్క లాంటి స్టార్‌ హీరోయిన్‌ ఇలాంటి సినిమాలు ఒప్పుకోదులే అనే నమ్మకం కూడా ఉంటుంది. ఆ నమ్మకాన్ని కాపాడుతూ.. ఎలాంటి వల్గారిటీ లేకుండా, ప్యామిలీ మొత్తం కలిసి చూసేలా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు మహేశ్‌బాబు పి. ఓ సున్నితమైన అంశాన్ని కామెడీ, ఎమోషన్స్‌తో అతి సున్నితంగా తెరపై చూపించాడు. ప్రతి మనిషికి జీవితంలో  ఓ తోడు కచ్చితంగా ఉండాలనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇచ్చారు. అలా అని  కథంతా సీరియస్‌గా సాగదు. కామెడీ వేలో చెబుతూనే.. అక్కడక్కడ ఎమోషనల్‌ టచ్‌ ఇచ్చాడు. 

ఫేమస్‌ చెఫ్‌గా అనుష్కను పరిచయం చేస్తూ సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత తల్లితో ఆమె బాడింగ్‌ చూపించారు. అవి కాస్త ఎమోషనల్‌గా ఉన్నప్పటికీ.. రొటీన్‌గా అనిపిస్తుంది. నవీన్‌ పోలిశెట్టి ఎంట్రీ వరకు కథ చాలా సింపుల్‌గా సాగుతుంది. ఇక హీరో ఎంట్రీ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా ఉన్నప్పటి కామెడీతో కప్పేశారు. స్టాండప్‌ కమెడియన్‌గా హీరో చెప్పే జోకులు కొన్ని చోట్ల నవ్విస్తే.. మరికొన్ని చోట్ల బోర్‌ తెప్పిస్తాయి.

హీరోయిన్‌తో హీరో ప్రేమలో పడడం..ఆమె ఏమో అతన్ని స్పెర్మ్‌ డోనర్‌గా చూడడం.. ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అదే సమయంలో తర్వాత ఏం జరుగుతుందో ఈజీగా అర్థమైపోతుంది. హీరోయిన్‌కి ప్రపోజ్‌ చేసే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. 

స్పెర్మ్‌ డొనేషన్‌ కోసమే తనతో క్లోజ్‌గా మూవ్‌ అయిందనే విషయం తెలిశాక హీరో ఏం చేశాడనేది సెకండాఫ్‌. ప్రేమించిన అమ్మాయి కాబట్టి ఆమె అడిగిన సహాయం చేస్తాడనేది అందరికి అర్థమైపోతుంది. కానీ ఈ క్రమంలో జరిగే సన్నివేశాలను హిలేరియస్‌గా రాసుకున్నాడు దర్శకుడు.  ఆస్పత్రిలో డాక్టర్‌కి హీరో మధ్య జరిగే సంభాషనలు కానీ.. హీరోయిన్‌ ఇంటికి పిలిస్తే.. వేరేలా అనుకొని వెళ్లడం..ఈ సీన్లలన్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. చివరల్లో మాత్రం ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతారు. అసలు హీరోయిన్‌  ప్రేమ, పెళ్లి ఎందుకు వద్దనుకుంటుందనే  కారణం కన్విన్సింగ్‌గా ఉంటుంది. ఎమోషనల్‌గానూ కనెక్ట్‌ అవుతారు. అయితే కథంతా ఒక పాయింట్‌ చుట్టే తిరగడంతో సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహిస్తే సినిమా ఫలితంగా  మరోలా ఉండేది.  

ఎవరెలా చేశారంటే..
ఈ సినిమా మొత్తం అనుష్క, నవీన్‌ పోలిశెట్టి పాత్రల చుట్టే తిరుగుతుంది. ఈ సినిమాలో నవీన్‌ పోలిశెట్టి, అనుష్క కాకుండా వేరేవాళ్లు నటించి ఉంటే  ఫలితం మరోలా ఉండేది.  చెఫ్‌ అన్విత పాత్రలో అనుష్క ఒదిగిపోయింది. తన స్టార్‌డమ్‌ని పక్కకిపెట్టి.. ఆ పాత్రలో ఎంతమేరకు నటించాలో అంతమేరకు చక్కగా నటించింది. తెరపై చాలా హుందాగా కనిపించింది. ఎమోషనల్‌ సన్నివేశాల్లో తన అనుభవాన్ని మరోసారి తెరపై చూపించింది.

ఇక నవీన్‌ పోలిశెట్టి మరోసారి తనదైన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడు. స్టాండప్‌ కమెడియన్‌ సిద్దూ పాత్రలో జీవించేశాడు. సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్‌ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. హీరోయిన్‌ తల్లిగా జయసుధ తన పాత్ర పరిధిమేర నటించింది. సినిమా ప్రారంభమైన 10 నిమిషాలకే ఆమె పాత్ర ముగుస్తుంది. ఇందులో ఆమె బాలయ్య వీరాభిమానిగా కనిపించడం గమనార్హం. హీరో తల్లిదండ్రులుగా తులసి, మురళీ శర్మలు రొటీన్‌ పాత్రలు పోషించారు.  హీరో స్నేహితుడిగా అభినవ్‌ గోమఠం, హీరోయిన్‌ స్నేహితురాలిగా సోనియా దీప్తితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఇక సాంకేతిక విషయాలకొస్తే.. గోపీ సుందర్‌ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌. రధన్ పాటలు బాగున్నాయి. కథలో భాగంగానే పాటలు వస్తాయి. నీరవ్ షా సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌తో పాటు సెకండాఫ్‌లోనూ కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
-అంజి శెట్టే, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement