భారత చిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఈ ఏడాది బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తిని వరించింది. తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సోషల్‌మీడియా ద్వారా ప్రకటించింది. అక్టోబర్ 8న జరిగే నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్‌లో మిథున్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నారు. సినిమా పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వారికి భారత ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరిస్తుంది. 1976లో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన మిథున్ తొలి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్నారు. ఆయన సినీ కెరియర్‌లో మొత్తం మూడు నేషనల్ అవార్డ్‌లను సొంతం చేసుకున్నారు. తెలుగులో గోపాల గోపాల సినిమాతో టాలీవుడ్‌కు మిథున్ చక్రవర్తి పరిచయం అయిన విషయం తెలిసిందే.
'ఐయామ్ ఎ డిస్కో డ్యాన్సర్..' పాట వినగానే వెంటనే మిథున్ చక్రవర్తి గుర్తుకొస్తారు. సుమారు 45 ఏళ్ల క్రితం మిథున్ హీరోగా నటించిన డిస్కో డ్యాన్సర్ సినిమాలోని ఈ పాట అప్పటికీ, ఇప్పటికీ పాపులరే.. అయితే కెరీర్ తొలినాళ్లలో తనతో నటించడానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపించలేదు. కలర్ తక్కువని పెద్ద హీరోయిన్స్ అతడిని దూరం పెట్టేవారని ఓ ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు. పుట్టుకతో వచ్చిన రంగును ఎలాగూ మార్చలేం కాబట్టి తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకోవాలనుకుని. చివరకు అందరూ తన రంగు గురించి కాకుండా డ్యాన్స్ గురించి మాట్లాడుకునేలా మిథున్ చేశారు.
మిథున్‌తో నటించేందుకు ఓకే చెప్పిన తొలి హీరోయిన్ జీనత్ అమన్
మిథున్ సినీ జర్నీలో మొదట పెద్ద హీరోయిన్స్ తన వైపు కన్నెత్తి చూసేవారు కాదు. అలా ఏ ఒక్క హీరోయిన్ కూడా ఆయనతో కలిసి నటించడానికి ఇష్టపడేవారు కాదు. ఒకరకంగా చెప్పాలంటే తనను హీరోగానే వాళ్లు చూడలేదు. ఆయనతో పని చేస్తే వారికి ఎటువంటి ఫేమ్ రాదని పక్కనపెట్టేవాళ్లు. సరిగ్గా అలాంటి సమయంలో జీనత్ అమన్ వచ్చింది. ఇతడు చాలా బాగున్నాడు.. ఇతడితో నటించడానికేంటి సమస్య అని మిథున్ సరసన హీరోయిన్‌గా నటించింది. ఇక అప్పటినుంచి తన కెరీర్ బ్రేకుల్లేకుండా దూసుకెళ్లింది. ఈ వషయాన్ని కూడా ఓ వేదిక మీదు మిథున్ చక్రవర్తి పంచుకున్నారు.
మిథున్ చక్రవర్తి 1976లో వచ్చిన 'మృగయ' సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేశారు. ఈ సినిమా జాతీయ అవార్డు అందుకుంది. సురక్ష, డిస్కో డ్యాన్సర్, డ్యాన్స్ డ్యాన్స్, ప్యార్ ఝుక్తా నహీ, కసమ్ ఫాయిదా కర్నే వాలేకీ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ఆయన నటించారు. హీరోగా 80, 90 దశకాల్లో ఆయన చేసిన చిత్రాలు విశేష ఆదరణ పొందాయి. బాలీవుడ్‌లో ఒకే ఏడాది 19 చిత్రాల్లో నటించి అరుదైన ఘనత సాధించిన మిథున్.. తన కెరియర్‌లో సుమారు 350కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. గతేడాదిలో 'కాబులివాల' అనే బెంగాళి చిత్రంలో ఆయన నటించారు.
Comments
Please login to add a commentAdd a comment