Movie Audience Waiting For These 3 Movie Release In OTT: కరోనా కాలంలో ఎంటర్‌టైన్‌మెంట్‌కు సరైన వేదికలుగా మారాయి ఓటీటీలు. మహామ్మారి కారణంగా థియేటర్లు మూతపడటంతో డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో మూవీ లవర్స్‌కు ఎంతో చేరువయ్యాయి. ఓటీటీల్లో స్ట్రీమ్ అయిన చిన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అద్భుతంగా నటించే పర భాష హీరోలను దేశవ్యాప్తంగా పరిచయం చేశాయి. క్రమక్రమంగా పెద్ద హీరోలు కూడా వారి సినిమాలను ఓటీటీలో విడుదల చేసే స్థాయికి ఎదిగాయి.
ఈ క్రమంలోనే కరోనా పరిస్థితులు అనుకూలించిన తర్వాత కూడా థియేటర్లతోపాటు ఓటీటీల్లోనూ తమ చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే థియేటర్లలో రిలీజైన పుష్ప, రాధేశ్యామ్, అఖండ వంటి భారీ బడ్జెట్, స్టార్ హీరోల సినిమాలు ఓటీటీ వేదికగా అలరించాయి. మరికొన్ని సినిమాలు వచ్చేందుకు సిద్ధంగా ఉండగా.. ఓటీటీల్లో ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని ముచ్చటగా 3 సినిమాల కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అవేంటో ఓ లుక్కేద్దామా !
1. ఆర్ఆర్ఆర్ (రౌద్రం.. రణం.. రుధిరం)
మూవీ లవర్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఓటీటీ రిలీజ్‌ల్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండేది 'ఆర్ఆర్ఆర్'. దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజీ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. వెయ్యి కోట్లు సాధించింది. ఇంకా థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్' మేనియా ఏమాత్రం తగ్గలేదు. ఈ సినిమా కోసం ఓటీటీ లవర్స్ ఎప్పుడు విడుదల చేస్తారా అని కాచుకు కూర్చున్నారు. థియేటర్లలో వీక్షించిన వారు కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తే మరిన్ని సార్లు చూడొచ్చని భావిస్తున్నారు.
2. గంగూబాయి కతియావాడి
'ఆర్ఆర్ఆర్'లో సీతగా అలరించింది బాలీవుడ్ క్యూటీ అలియా భట్. ఈ సినిమాకు ముందే విడుదలైంది అలియా లీడ్ రోల్ చేసిన 'గంగూబాయి కతియావాడి' సినిమా. ముంబై మాఫియా క్వీన్‌గా పేరు తెచ్చుకున్న గంగూబాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది ఈ మూవీ. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్టర్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. అలియా భట్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. 'ఆర్ఆర్ఆర్'తో అలియా భట్ తెలుగు ఆడియన్స్‌కు చేరువకావడంతో 'గంగూబాయి కతియావాడి' మూవీ ఓటీటీ రాక కోసం ఎదురుచూస్తున్నారు.
3. ది కశ్మీర్ ఫైల్స్
ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి రికార్డులు సృష్టిస్తాయి కొన్ని సినిమాలు. అలాంటి కోవకు చెందినదే 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో 1990 సంవత్సరంలో కశ్మీర్ పండిట్స్‌పై జరిగిన మారణకాండ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. వివాదాస్పద కథాంశంతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ ఓటీటీ కోసం కూడా సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment