గగన కచేరికి గాన కోకిల | Mumbai: Legendary Singer Lata Mangeshkar Passed Away | Sakshi
Sakshi News home page

గగన కచేరికి గాన కోకిల

Published Mon, Feb 7 2022 1:42 AM | Last Updated on Mon, Feb 7 2022 7:27 AM

Mumbai: Legendary Singer Lata Mangeshkar Passed Away - Sakshi

ఆదివారం ముంబైలో అంత్యక్రియల కోసం లతా మంగేష్కర్‌ పార్థివదేహాన్ని తీసుకొస్తున్న సాయుధ దళాలు

ముంబై: గాన కోకిల, సుమధుర గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌ ఇక లేరు. 140 కోట్ల మంది భారతీయులనే గాక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను శోకసముద్రంలో ముం చుతూ గంధర్వ లోకానికి మరలిపోయారు. దాదాపు 80 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు అందరినీ అలరించి, మైమరపించిన ఆమె మధుర గాత్రం శాశ్వతంగా మూగవోయింది. చిన్నా పెద్దా అందరికీ లతా దీదీగా సుపరిచితురాలైన ఈ మెలొడీ క్వీన్‌ 92 ఏళ్ల వయసులో ఆదివారం ముంబైలో కరోనాతో కన్నుమూశారు. జనవరిలోనే స్వల్ప కరోనా లక్షణాలు కన్పించడంతో బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చేరిన లత, తర్వాత నిమోనియాతో కూడా బాధపడ్డారు.


ఆదివారం ముంబైలో లతా మంగేష్కర్‌ పార్ధివదేహం వద్ద నివాళులర్పిస్తున్న ప్రధాని మోదీ


లత కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో ఆశా భోంస్లే, శ్రద్ధా కపూర్‌ తదితరులు

శనివారం ఉదయానికి పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. చివరికి కీలక అవయవాల వైఫల్యంతో ఆదివారం ఉదయం 8.12 గంటలకు తుదిశ్వాస విడిచారు. రాష్ట్రపతి మొదలుకుని ప్రముఖులంతా లత మృతి పట్ల ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు. కేంద్రం దేశవ్యాప్తంగా రెండు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. అధికారిక కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేశారు. రెండు రోజులూ త్రివర్ణ పతాకాన్ని సగం మేర అవనతం చేసి ఉంచుతారు. పార్లమెంటు సోమవారం లతకు నివాళులు అర్పించనుంది. అనంతరం ఆమె గౌరవార్థం ఉభయ సభలను గంటపాటు వాయిదా వేస్తారు. 

తల్లడిల్లిన దేశం 
లత మరణ వార్త విని దేశమంతా తల్లడిల్లిపోయింది. ఉదయాన్నే ఆమె పాటలతోనే లేచి, వాటిని వింటూనే రాత్రి నిద్రలోకి జారుకునే కోట్లాది మంది అభిమానులు ఈ దుర్వార్తను జీర్ణించుకోలేకపోయారు. కడసారి చూపు కోసం ముంబై పొద్దార్‌ రోడ్డులోని లత నివాసం ‘ప్రభు కుంజ్‌’ముందు బారులు తీరారు. అక్కడి నుంచి శివాజీ పార్కు దాకా 10 కిలోమీటర్ల పొడవునా సాగిన అంతిమయాత్రకు అశేషంగా తరలివచ్చారు. అశ్రు నయనాలతో ఆమె పార్థివ దేహంతో పాటు సాగారు. లతా దీదీ అమర్‌ రహే అంటూ నినదించారు. చెట్లు, బిల్డింగుల పైకెక్కి అంతిమయాత్రను వీక్షించారు.


లత అంత్యక్రియలకు కుమార్తెతో వచ్చిన అమితాబ్‌

కోట్లాది మంది టీవీల్లో చూస్తూ విలపించారు. సైనిక, పోలీసు దళాలు సెల్యూట్‌ చేస్తూ ముందు సాగుతుండగా లత సోదరి, ప్రఖ్యాత గాయని ఆశా భోంస్లేతో పాటు తోబుట్టువులంతా పార్థివ దేహంతో పాటు వాహనంలో వెళ్లారు. శివాజీ పార్కు వద్ద ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకుని బాలీవుడ్‌ తదితర సినీ, క్రీడా ప్రముఖులంతా త్రివర్ణ పతాకంలో చుట్టిన లత భౌతిక కాయాన్ని సందర్శించారు. పుష్పగుచ్ఛాలుంచి ఘనంగా కడసారి నివాళులర్పించారు. కుటుంబీకులను మోదీ ఓదార్చి వెనుదిరిగారు. అనంతరం పూర్తి ప్రభుత్వ లాంఛనాల మధ్య జరిగిన అంత్యక్రియల్లో బాలీవుడ్‌ నటులు షారూక్‌ ఖాన్, ఆమిర్‌ ఖాన్, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తదితర ప్రముఖులెందరో బాధాతప్త హృదయాలతో పాల్గొన్నారు. సోదరుడు హృదయనాథ్‌ లత చితికి నిప్పంటించారు. 

తిరుగులేని కెరీర్‌ 
లత 1929 సెప్టెంబర్‌ 28న ఇండోర్లో జన్మించారు. ఐదేళ్ల వయసులోనే సంగీత సాధన మొదలు పెట్టడంతో స్కూలు చదువు అంతగా సాగలేదు. 1942లో 13వ ఏట కితీ హసాల్‌ అనే మరాఠీ చిత్రంలో పాడటం ద్వారా గాయనిగా కెరీర్‌ మొదలుపెట్టారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. అనితరసాధ్యమైన కంఠ మాధుర్యంతో దేశదేశాల అభిమానులను ఉర్రూతలూగించారు. ‘ప్యార్‌ కియా తో డర్నా క్యా’, ‘సత్యం శివం సుందరం’, ‘పానీ పానీ రే’... ఇలా చెప్పుకుంటూ పోతే లత సుమధుర గళం నుంచి జాలువారిన అజరామరమైన పాటల జాబితాకు అంతే ఉండదు.

80 ఏళ్ల అద్భుత కెరీర్లో హిందీలోనే గాక తెలుగు, తమిళ్, కన్నడతో పాటు ఏకంగా 36 భాషల్లో 30 వేలకు పైగా పాటలు పాడి అలరించారు. 2012 అక్టోబర్లో చివరి పాట పాడారు లత. దేశ చరిత్రలో అత్యుత్తమ ప్లేబ్యాకర్‌ సింగర్‌గా నిలిచిన ఆమెను వరించిన అవార్డులకు లెక్కే లేదు. పలు ఫిల్మ్‌ఫేర్లు, నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డులతో పాటు దాదాసాహెబ్‌ ఫాల్కే, పద్మభూషణ్, పద్మవిభూషణ్, 2001లో భారతరత్న అందుకున్నారు. ఆమె అవివాహితగానే మిగిలిపోయారు. దిగ్గజ గాయకులు, సంగీత దర్శ కులు, నటీనటులెందరో లతను అమితంగా అభి మానించేవారు. అపర సరస్వతిగా కీర్తించేవారు కూ డా. ఈ పొగడ్తను, ఆప్యాయతలను ఆమె వినమ్రం గానే స్వీకరించేవారు. ‘‘అంతా నా తల్లిదండ్రులు, ఆ భగవంతుని ఆశీర్వాదం’’ అని గత అక్టోబర్లో తన చివరి ఇంటర్వ్యూలో చెప్పారామె.

రాయల్‌ హాల్లో ప్రదర్శన ఇచ్చిన తొలి భారత ఆర్టిస్టు
లండన్లోని ప్రఖ్యాత రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్లో 1974లో లత సంగీత విభావరి నిర్వహించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ఆర్టిస్టుగా రికార్డు సృష్టించారు. ఆమెకు అదే తొలి అంతర్జాతీయ ప్రదర్శన కూడా. ‘‘ఇన్హీ లోగోం నే’, ‘ఆజా రే పర్‌దేశీ’, ‘ఆయేగా ఆనేవాలా’అంటూ లత లైవ్‌లో పాడిన బాలీవుడ్‌ ఆపాత మధురాలు వినేందుకు అభిమానులంతా విరగబడ్డారు. దాంతో ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. ‘పూల సుగంధానికి రంగు లేదు. పారే నీటికి హద్దుల్లేవు. సూర్య కిరణాలకు మత భేదాల్లేవు. లతా మంగేష్కర్‌ గళానికి ఎల్లల్లేవు. పరిమితులు అసలే లేవు’అంటూ ఆమె గురించి బాలీవుడ్‌ దిగ్గజం దిలీప్‌కుమార్‌ ఉర్దూలో కవితాత్మక పరిచయ వాక్యాలతో అలరించారు. ఈ షో తాలూకు ఎల్పీ రికార్డింగులు రెండు వాల్యూమ్‌లుగా విడుదలై అప్పట్లో రికార్డు స్థాయిలో 1.33 లక్షల కాపీలు అమ్ముడుపోయాయి.  

లతాజీ మరణం కలచివేసింది
లతా మంగేష్కర్‌ మరణించారన్న వార్త నన్ను ఎంతగానో కలచివేసింది. నాతోపాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భౌతికంగా జీవించి లేకపోయినా ఆమె పాడిన పాటలకు మాత్రం మరణం లేదు. భారతరత్న లతా మంగేష్కర్‌ సాధించిన విజయాలు అసామాన్యం. భావి తరాలకు ఆమె ఒక స్ఫూర్తి ప్రదాత. ఒక గాయనిగానే కాకుండా గొప్ప మానవతావాదిగా లతాజీ గుర్తుండిపోతారు. కొన్ని శతాబ్దాల కాలంలో ఆమెలాంటి వారు ఒక్కరే జన్మిస్తారు. 
– రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 

అద్భుత స్వరం దూరమైంది
లతా మంగేష్కర్‌ మరణం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతి చెందా. లతాజీ మృతితో భారతదేశానికి అద్భుత స్వరం దూరమయ్యింది. ఆమె కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను అలరించారు. 
– ఎం.వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి 

భారతీయ సంస్కృతికి ప్రతీక
గానకోకిల లతాజీని రాబోయే తరాలు భారతీయ సంస్కృతికి ప్రతీకగా స్మరించుకుంటాయి. ఆమె నాపై కురిపించిన ఆప్యాయతను గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఆమెతో మాట్లాడిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను. దశాబ్దాలుగా భారతీయ సినిమా పరిణామ క్రమానికి ప్రత్యక్ష సాక్షి లతా దీదీ. కేవలం సినిమాలే కాదు, దేశాభివృద్ధిని సైతం కాంక్షించారు. భారత్‌ను బలమైన, అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని ఎల్లప్పుడూ కోరుకునేవారు. లతా దీదీతో చక్కటి బాంధవ్యం ఉండేదని నాలాంటి ఎంతోమంది మున్ముందు గర్వంగా చెప్పుకుంటారు. భౌతికంగా ఆమె మనమధ్య లేకపోయినా పాటల రూపంలో ఎప్పటికీ మనతోనే ఉంటారు. మధురమైన ఆమె గాత్రం మనతో ఉండిపోతుంది.  
– ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లతాజీ సేవలను వర్ణించలేం 

కేవలం భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో లతా మంగేష్కర్‌ అభిమానులు ఉన్నారు. ఆమె తన స్వరంతో అందరినీ అలరించారు. సంగీత ప్రపంచానికి లతాజీ చేసిన సేవలను మాటల్లో వర్ణించడం అసాధ్యం. ఆ మె మరణం వ్యక్తిగతంగా నాకు తీరని నష్టం కలిగించింది. ఎన్నోసార్లు ఆమె నుంచి ఆశీస్సులు అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. 
– కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా 

దేశం గొప్ప బిడ్డను కోల్పోయింది 
భారత గానకోకిల లతా మంగేష్కర్‌. భారత్‌ తన గొప్ప బిడ్డను కోల్పోయింది. ఆమె మరణంతో దేశానికి పూడ్చలేని నష్టం వాటిల్లింది. లతాజీ స్థానాన్ని భర్తీ చేయడం అసాధ్యం. ఆమె తన పాటల ద్వారా దేశంలో సాంస్కృతిక వికాసానికి ఎనలేని సేవ చేశారు. లతా మంగేష్కర్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.
– మన్మోహన్‌ సింగ్, మాజీ ప్రధానమంత్రి 

ఆ స్వరానికి మరణం లేదు 
లతా మంగేష్కర్‌ అమృత స్వరం అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆ స్వరానికి మరణం లేదు. ఆమె మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యా. లతాజీ మృతితో భారతీయ కళా ప్రపంచానికి ఎంతో నష్టం వాటిల్లింది. 
– రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ 

ఒక శకం ముగిసింది
లతా మంగేష్కర్‌ మరణంతో భారతీయ సంగీతంలో ఒక శకం ముగిసింది. ఆ స్వరకోకిల గాత్రం ప్రపంచమంతటా ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆ స్వర మాధుర్యం అభిమానులెవరూ మర్చిపోలేనిది. 
– అరవింద్‌ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి  

నమ్మలేకపోతున్నాం.. 
లతా మంగేష్కర్‌ అద్భుతమైన గాత్ర మాధుర్యంతో భారతీయులందరి హృదయాలను కదిలించారు. భారత గానకోకిల ఇక లేరన్న విషయం నమ్మలేకపోతున్నాం. ఆమె మరణాన్ని తలచుకొంటే మనసు బరువెక్కుతోంది. దశాబ్దాలపాటు వివిధ భాషల్లో వేలాది పాటలు పాడి ప్రజలను అలరించడం సాధారణ విషయం కాదు. 
– ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి 

పాటలు విని పరవశించా.. 
లతాజీ గొంతు నుంచి జాలువారిన మధురమైన పాటలు విని పరవశించిపోయా. బెంగాల్‌తోపాటు ఈశాన్య ప్రాంతాల కళాకారులను ఆమె అభిమానించేవారు. ఆమె తన కళాప్రపంచంలో బెంగాల్‌కు స్థానం కల్పించారు. కోట్లాది మంది లాగే నేను కూడా లతాజీకి పెద్ద అభిమానిని. ఆమె మన నుంచి దూరం కావడం దురదృష్టకరం. 
– మమతా బెనర్జీ, పశ్చిమబెంగాల్‌ సీఎం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement