బినాకా గీత్‌మాలా అమీన్‌ సయానీ ఇకలేరు | Ameen Sayani took his last breath HN Reliance Hospital in Mumbai | Sakshi
Sakshi News home page

బినాకా గీత్‌మాలా అమీన్‌ సయానీ ఇకలేరు

Published Thu, Feb 22 2024 6:37 AM | Last Updated on Thu, Feb 22 2024 6:37 AM

Ameen Sayani took his last breath HN Reliance Hospital in Mumbai - Sakshi

ముంబై: నాలుగు దశాబ్దాలకుపైగా కోట్లాది మంది భారతీయ రేడియో శ్రోతలను తన గాత్రంతో కట్టిపడేసిన దిగ్గజ అనౌన్సర్‌ అమీన్‌ సయానీ ఇక లేరు. 91 ఏళ్ల సయానీ ముంబైలో మంగళవారం సాయంత్రం గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు రాజిల్‌ చెప్పారు. ‘‘సాయంత్రం ఆరింటపుడు గుండెపోటు రాగానే హుటాహుటిన హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఆస్పత్రికి తరలించాం. ఎంతగా ప్రయతి్నంచినా వైద్యులు ఆయనను కాపాడలేకపోయారు’’ అని కుమారుడు రాజిల్‌ వెల్లడించారు.

బినాకా గీత్‌మాలాతో దేశవ్యాప్తంగా ఖ్యాతి
‘నమస్తే బెహ్నో ఔర్‌ భాయియో, మై ఆప్కా దోస్త్‌ అమీన్‌ సయానీ బోల్‌ రహా హూ’’ అంటూ మొదలయ్యే ఆయన గాత్రఝరికి మంత్రముగ్ధు్దలు కానివారే లేరు. రేడియో సిలోన్‌లో 1950వ దశకం ఆయనకు స్వర్ణయుగం. 1952 డిసెంబర్‌లో మొదలైన ‘బినాకా గీత్‌మాలా’ కార్యక్రమాన్ని అద్భుతమైన తన గాత్రంతో కోట్లాది మంది శ్రోతలకు ఫేవరెట్‌ ప్రోగ్రామ్‌గా మార్చేశారు.

అలనాటి మేటి హిందీ సినిమా పాటలను పరిచయం, ప్రసారంచేస్తూ సాగే ఈ కార్యక్రమం 1952 నుంచి 1988దాకా నిరాటంకంగా ప్రతి బుధవారం ప్రసారమయ్యేది. 1988లో బినాకా గీత్‌మాలాను ఆలిండియా రేడియో వారి వివిధ్‌ భారతిలోకి మార్చారు. 1994దాకా ఆ కార్యక్రమం అత్యంత ప్రజాదరణ పొందిన పోగ్రామ్‌గా కీర్తి గడించిందంటే దానికి కారణం సయానీయే. అత్యంత ఎక్కువకాలం నడిచిన కార్యక్రమంగానూ అది రికార్డు సృష్టించింది. ప్రసారమయ్యే పాటల్లోని విశిష్టతను తనదైన విశ్లేషణతో చెబుతూ శ్రోతలను ఆకట్టుకుంటూ ‘రేడియో మ్యా్రస్టో’గా ప్రసిద్ధికెక్కారు.

50,000 ప్రోగ్రామ్‌లు, 19వేలకుపైగా జింగిల్స్‌
1932 డిసెంబర్‌ 21వ తేదీన ముంబైలో ‘బహుభాషా’ కుటుంబంలో జన్మించిన సయానీ 13 ఏళ్ల వయసులోనే తల్లికి ‘రెహ్బార్‌’ పక్షపత్రికలో రచనలో సాయపడేవారు. ఆలిండియా రేడియో బాంబేలో చిన్నారుల కార్యక్రమంలో పాల్గొనేవారు. కెరీర్‌ మొదట్లో ఇంగ్లిష్‌ బ్రాడ్‌కాస్టర్‌గా పనిచేశారు. స్వాతంత్య్రం సిద్ధించాక హిందీలోకి మారారు. రేడియోలో ఏకంగా 50,000 ప్రోగ్రామ్‌లు, 19వేలకుపైగా జింగిల్స్‌ చేశారు. తన సోదరుడు హమీద్‌ మరణం తర్వాత ఆయన నుంచి బాధ్యతలు తీసుకుని ఎనిమిదేళ్లపాటు బోర్న్‌వీటా క్విజ్‌ పోటీని విజయవంతంగా నిర్వహించారు. సంగీత శిఖరాలు లతా మంగేష్కర్, కిశోర్‌ కుమార్‌లతో ఈయన చేసిన ఇంటర్వ్యూలు ఆనాడు అమిత ఆదరణ పొందాయి. సయానీ మరణంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీసహా పలు రంగాల ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement