Naga Chaitanya Speech At Custody Movie Press Meet - Sakshi
Sakshi News home page

Naga Chaitanya: కస్టడీకి నా కెరీర్‌లోనే ఎక్కువ బడ్జెట్‌, మా తాతగారి స్థాయికి రీచ్‌ అవుతానో, లేదో!

Published Fri, May 12 2023 3:33 AM | Last Updated on Fri, May 12 2023 10:27 AM

Naga Chaitanya Speech at Custody Movie Press Meet - Sakshi

‘‘ఓ నటుడుగా నన్ను నేనెప్పుడూ విమర్శించుకుంటూనే ఉంటాను... అభినందించుకోను. ఎప్పటికప్పుడు తప్పులు వెతుకుతూనే ఉంటాను.. నటుడిగా నన్ను నేను మెరుగుపరచుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాను’’ అని అన్నారు నాగచైతన్య. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘కస్టడీ’. పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో నాగచైతన్య చెప్పిన విశేషాలు.

► తమిళ చిత్రం ‘మానాడు’ విడుదల కాకముందే వెంకట్‌ ప్రభుగారు నాకు ‘కస్టడీ’ స్టోరీ చెప్పారు. అయితే ‘మానాడు’ విడుదలై, హిట్‌ సాధించిన తర్వాత, ఈ సినిమానే మేం తెలుగులో రీమేక్‌ చేస్తే బాగుంటుందన్నట్లుగా కొందరు నిర్మాతలు అభిప్రాయపడ్డారు. కానీ ‘కస్టడీ’ స్టోరీ నన్ను ఎగ్జయిట్‌ చేసింది. పైగా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కొంతవరకు పూర్తయింది. దీంతో ‘కస్టడీ’ని సెట్స్‌పైకి తీసుకెళ్లాం. ఈ సినిమాలో భాగంగా కొందరు పోలీసులను కలిశాను. వారి కథలు నన్ను చాలా ఇన్‌స్పైర్‌ చేశాయి.

► ఈ సినిమాలో నేను పోలీస్‌ కానిస్టేబుల్‌ శివ పాత్ర చేశాను. నా కెరీర్‌లో ఎప్పుడూ చేయనటువంటి కొన్ని కొత్త యాక్షన్‌ సీక్వెన్స్‌లను ఈ సినిమా కోసం చేశాం. కథ రీత్యా ఈ తరహా యాక్షన్‌ సీక్వెన్స్‌లు అవసరం అయ్యాయి. అయితే కొన్ని యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ కోసం కొంత రిహార్సల్స్‌ చేశాం. ఈ సినిమాలోని వాటర్‌ సీక్వెన్స్‌ కోసం మూడు రోజులు రిహార్సల్స్‌ చేసి, దాదాపు 15 రోజులు షూట్‌ చేశాం. ఈ ఎపిసోడ్‌ ఓ హైలైట్‌గా ఉంటుంది.  

► సినిమా మొదలైన తొలి ఇరవై నిమిషాలు కూల్‌గా ఉంటుంది. ఎప్పుడైతే స్క్రీన్‌పైకి అరవింద్‌ స్వామిగారు వస్తారో అప్పట్నుంచి స్టోరీ మలుపు తీసుకుని ఆడియన్స్‌ను స్క్రీన్‌పై నుంచి చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. ఈ చిత్రంలో శరత్‌ కుమార్, అరవింద్‌ స్వామి, ప్రియమణి వంటి సీనియర్స్‌ నటించారు. వారి నుంచి నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. ఇచ్చిన డైలాగ్స్‌ను తనదైన స్టైల్లో ఇంప్రూవ్‌ చేసి చెబుతుంటారు అరవింద్‌ స్వామిగారు. ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది. వెంకట్‌గారు ఏ స్క్రిప్ట్‌ అయితే నాకు చెప్పారో అదే తీశారు. ఆయన స్క్రీన్‌ప్లే స్టయిల్‌ తెలుగు ప్రేక్షకులకు కొత్తగా ఉంటుంది. ఈ చిత్రంలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ స్టోరీకి తగ్గట్లుగానే ఉంటాయి. ఫ్యామిలీ ఎలిమెంట్స్‌ కూడా ఉన్నాయి. అవుట్‌పుట్‌ పట్ల చాలా నమ్మకంతో ఉన్నాను. పోలీస్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాల్లో నాకు ‘ఘర్షణ’, నాన్నగారి ‘శివమణి’, ‘జేమ్స్‌ బాండ్‌’ యాక్షన్‌ ఫ్రాంచైజీ చిత్రాలు ఇష్టం.

► నిర్మాత శ్రీనివాసా చిట్టూరిగారు సెట్స్‌లో కూల్‌గా ఉంటారు. ‘కస్టడీ’ నా కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మించబడింది. ఈ సినిమా 1990 బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ఇళయరాజాగారు, యువన్‌ శంకర్‌రాజాగార్లు ఇచ్చిన మ్యూజిక్‌ ‘కస్టడీ’కి ప్లస్‌. ‘కస్టడీ’ని వేరే సినిమాతో పోల్చవద్దు. ‘కస్టడీ’ చిత్రం ‘కస్టడీ’యే.

► నేను తెలుగు డబ్బింగ్‌ కోసం దాదాపు పది రోజులు తీసుకుంటాను. కానీ తమిళ ‘కస్టడీ’ సినిమాకు డబ్బింగ్‌ పూర్తి చేయడానికి నెలరోజుల టైమ్‌ పట్టింది. నా సొంత వాయిస్‌ అయితే ఆడియన్స్‌కు యాక్టర్‌గా చేరువకావొచ్చు. మన పెర్ఫార్మెన్స్‌ కూడా మెరుగ్గా కనిపిస్తుంది. అందుకే తమిళంలో డబ్బింగ్‌ చెప్పాను.   

► నేను ఫలానా రకమైన సినిమాలు చేస్తేనే ఆడియన్స్‌కు నచ్చుతాయని అదే ట్రాక్‌లోకి వెళితే ఓ యాక్టర్‌గా అది నా బలహీనత అవుతుంది. ఈ విషయంలో నన్ను నేను కన్విన్స్‌ చేసుకోలేను. గతంలో నేను చేసిన కొన్ని లవ్‌స్టోరీలు వర్కౌట్‌ అయ్యాయి. అలా అని అవే సినిమాలు చేస్తుంటే ఓ యాక్టర్‌గా ఎదగలేను. చైతన్య ఎలాంటి సబ్జెక్ట్‌ అయినా బాగా చేస్తాడని ఆడియన్స్‌తో అనిపించుకోవాలి.  
► ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులకు ఏ రకమైన సినిమాలు నచ్చుతున్నాయో తెలుసుకోవడం చాలెంజ్‌లా మారింది. కానీ ఆడియన్స్‌కు నచ్చే సినిమా ఇస్తే వారి ఆదరణ ఓ రేంజ్‌లో ఉంటుంది.
► నా తర్వాతి ప్రాజెక్ట్‌ గురించి త్వరలో అధికారికంగా చెబుతాను. ‘ధూత’ వెబ్‌ సిరీస్‌ రిలీజ్‌ అమెజాన్‌ చేతిలో ఉంది. ఈ ఏడాదే స్ట్రీమింగ్‌ స్టార్ట్‌ కావొచ్చు.  


మా తాతగారు, నాన్నగారు గొప్ప గొప్ప సినిమాలు చేశారు. కొన్ని స్టాండర్ట్స్‌ క్రియేట్‌ చేశారు. కొందరు వారితో మాకు పోలికలు పెడుతుంటారు. అయితే ఈ విషయాన్ని నేను ఓ ప్రెజర్‌లా తీసుకోను. చాలెంజ్‌లా స్వీకరించి, నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. ఆ స్థాయికి నేను రీచ్‌ అవుతానా? లేదా అనేది నాకు తెలియదు. కానీ నా శక్తివంచన లేకుండా కష్టపడుతూనే ఉంటాను. 

నా గురించిన కొన్ని వార్తలు వస్తూనే ఉన్నాయి (విడాకుల అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ..). డిఫరెంట్‌ వార్తలు రాస్తున్నారు. కానీ ఆడియన్స్‌ ఫూల్స్‌ కాదు. తెలివైనవారు. ఏది జెన్యూన్‌ న్యూస్‌.. ఏది కాదనేది వారికి తెలుసని అనుకుంటున్నాను. నేను అయితే నవ్వుకుని వదిలేస్తున్నాను.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement