టైటిల్: కస్టడీ
నటీనటుటు: నాగచైతన్య, అరవింద స్వామి, శరత్‌కుమార్, కృతీశెట్టి, ప్రియమణి, రామ్‌కీ, సంపత్ రాజ్ తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
రచన- దర్శకుడు: వెంకట్ ప్రభు
సంగీతం: ఇళయరాజా,యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: ఎస్.ఆర్. కథిర్
ఎడిటర్: వెంకట్ రాజేన్
విడుదల తేది: మే 12, 2023
గతేడాది నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ, కీలక పాత్ర పోషించిన లాల్ సింగ్ చడ్డా..రెండూ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడ్డాయి. దీంతో గ్రేట్ కమ్ బ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో ‘కస్టడీ’ చిత్రం చేశాడు. సాలిడ్ హిట్‌తో పాటు తమిళ్‌లో కూడా తన మార్కెట్ పెంచుకోవాలని భావిస్తున్నాడు. అందుకే ‘కస్టడీ’ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్‌లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్‌ని క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య నేడు (మే 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? చైతూకి సాలిడ్ హిట్ లభించిందా?లేదా? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
ఈ సినిమా కథంతా 1990 బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. శివ(నాగచైతన్య).. సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఓ సిన్సియర్ కానిస్టేబుల్. డ్యూటీ అంటే ప్రాణం పెడతాడు. ఓ సారి అంబులెన్స్‌కి దారి ఇప్పించడం కోసం ముఖ్యమంత్రి దాక్షాయణి(ప్రియమణి) కాన్వాయ్‌ని ఆపి వార్తల్లోకి ఎక్కుతాడు. శివకి డ్రైవింగ్ స్కూల్‌లో పనిచేసే రేవతి(కృతిశెట్టి) అంటే చాలా ఇష్టం. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలనుకుంటారు.
అయితే కులాలు వేరుకావడంతో రేవతి ఫ్యామిలీ ఒప్పుకోదు. దీంతో ఇద్దరు కలిసి పారిపోదామనుకుంటారు. డ్యూటీ ముగించుకొని మరో కానిస్టేబుల్‌తో కలిసి రేవతి ఇంటకి వెళ్తున్న క్రమంలో ఓ కారు వచ్చి వీరి స్కూటర్‌ని గుద్దుతుంది. ఆ కారులో రాజు(అరవింద స్వామి), , సీబీఐ ఆఫీసర్ జార్జ్ (సంపత్ రాజ్) ఉంటారు. రాజు బాగా మద్యం సేవించి ఉండడంతో ఇద్దరిని అరెస్ట్ చేసి స్టేషన్‌కి తీసుకొస్తారు. విషయం తెలుసుకొని ఐజీ నటరాజన్(శరత్ కుమార్)తో సహా కొంతమంది రౌడీలో రాజుని చంపడానికి స్టేషన్‌కి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు రాజు నేపథ్యం ఏంటి? అతన్ని చంపడానికి పోలీసులతో పాటు సీఎం దాక్షాయణి మనుషులు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? వారి నుంచి రాజుని రక్షించిన శివ.. బెంగళూరు ఎందుకు తీసుకెళ్లాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
వెంకట్ ప్రభు సినిమాల్లో స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంటుంది. కథ పాతదే అయినా ఆయన ఇచ్చే ట్రీట్‌మెంట్ కొత్తగా ఉంటుంది. ఊహించని ట్విస్టులు ఉంటాయి. కస్టడీ చిత్రంలో వెంకట్ ప్రభు మ్యాజిక్ అంతగా వర్కౌట్ కాలేదు. అతని స్క్రీన్‌ప్లే మాయ కొన్ని చోట్ల మాత్రమే పని చేసింది. అయితే ఈ సినిమాలో కొత్తదనం ఏంటంటే.. ఒక విలన్‌ని కాపాడడానికి హీరో ప్రయత్నించడం. విలన్‌ని రక్షించుకోవడం కోసం హీరో పడ్డ కష్టాలు ఏంటి అనేది ఈ సినిమా కథ. కథ బాగున్నప్పటికీ కథనం మాత్రం రొటీన్‌గా సాగుతుంది.
సినిమా ప్రారంభమైన 20 నిమిషాల తర్వాత అసలు కథ మొదలవుతుంది. అప్పటి వరకు నడిపించిన లవ్‌స్టోరీ అంతగా ఆకట్టుకోలేదు. అరవింద్ స్వామి పాత్ర ఎంటర్ అయ్యాక కథ మొదలైయిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత కథ కాస్త ఆసక్తిగా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ కూడా సాధారణంగానే ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో కథ సీరియస్‌గా సాగుతుంది. కానీ తర్వాత ఏం జరుగుతుంది? క్లైమాక్స్ ఎలా ఉంటుంది అనేదే ముందే ఊహించొచ్చు. సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్, ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేవు. దానికి తోడు స్లో నెరేషన్ కూడా ఇబ్బందిగా మారుతుంది.
ఎవరెలా చేశారంటే..
కానిస్టేబుల్ శివ పాత్రలో నాగచైతన్య ఒదిగి పోయాడు. యాక్షన్ సన్నివేశాలు ఇరగదీశాడు. రేవతిగా కృతీశెట్టి ఉన్నంతలో చక్కగా నటించింది. ఇక సినిమా మొత్తంలో అరవింద్ స్వామి పాత్రని బాగా హైలెట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే అతనికి ఇచ్చే ఎలివేషన్ బాగున్నప్పటికీ.. దానికి తగ్గట్లుగా క్యారెక్టర్ డెప్త్ లేదు. ఇక ముఖ్యమంత్రి దాక్షాయణిగా ప్రియమణి పర్వాలేదనిపించింది.
అయితే ఆమె పాత్రకి బలమైన సన్నివేశాలు లేవు. పోలీసు ఉన్నతాధికారిగా శరత్ కుమార్ మెప్పించాడు. యాక్షన్ సన్నివేశాలు బాగానే చేశాడు. రాంకీ, జయసుధల పాత్రల నిడివి చాలా తక్కువ. ఆ పాత్రలకు ఇంతపెద్ద నటులు అవసరం లేదనిపిస్తుంది. హీరో అన్నయ్య విష్ణుగా జీవా, అతని ప్రియురాలుగా ఆనందితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం బాగుంది. పాటలు అంతగా ఆకట్టుకోకపోవడమే కాకుండా.. సాఫీగా సాగుతున్న కథకి అడ్డంకిగా మారాయి. ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment