
విమర్శలు, ప్రశంసలకు అతీతంగా కూలీ సినిమా కలెక్షన్ల రికార్డ్స్ సృష్టిస్తోంది. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి నాగార్జున(Nagarjuna Akkineni) తొలిసారిగా స్టైలిష్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోపే బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అనూహ్యమైన కాంబినేషన్లను సెట్ చేయడం ద్వారా సినిమాపై పెంచిన ఆసక్తి కలెక్షన్ల వర్షంలో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో సైమన్ అనే కోల్డ్ బ్లడెడ్ విలన్ విలన్ పాత్రలో నాగార్జున కనిపించడం కూడా కలెక్షన్ల జోరుకి బాగా దోహదం చేసినట్టు కనిపిస్తోంది. దక్షిణాదితో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో ఉన్న ప్రతీ చోటా రికార్డు స్థాయిలో కలెక్షన్లు రావడం దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమా మొదటి రోజున రూ. 17 కోట్లకు పైగా వసూలు చేసింది. ఉత్తర అమెరికాలో తెలుగు వెర్షన్ 1.3 మిలియన్ డాలర్లను సంపాదించింది, ఇది జూ.ఎన్టీయార్, హృతిక్ రోషన్‌ల వార్ 2 తెలుగు వెర్షన్ కంటే దాదాపు రెట్టింపు కావడం గమనార్హం.
నాగార్జున విలన్ పాత్రను పోషించడంపై ఆ పాత్రను మలచిన తీరు ఆయన వీరాభిమానులకు అంతగా రుచించనప్పటికీ... మొదటి నుంచీ నాగార్జున వైవిధ్య భరిత పాత్రల ఎంపికను ప్రశంసించే వారికి మాత్రం సంతృప్తినే అందించింది. వీటికి అతీతంగా మరోవైపు నాగార్జున మాత్రం ఈ విజయాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆయన అనుభవం నుంచి తామెన్నో నేర్చుకున్నామని, సినిమా యూనిట్‌లో ప్రతీ ఒక్కరితో ఆయన ప్రవర్తించే తీరు, సినిమా పూర్తి అయిన వెంటనే అందరికీ గిఫ్ట్ బాక్స్‌లు ఇచ్చి వారిని ఆదరించిన విషయాలు నాగార్జున గుర్తు చేసుకుంటూ కొనియాడడం తెలిసిందే. రజనీకాంత్ తో కలిసి నటించాలని తాను ఎంత కోరుకున్నారో తన మాటల ద్వారా చెప్పకనే చెబుతున్నారు నాగ్.
అయితే రజనీతో చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న విధానం చూస్తుంటే గతంలోని కొన్ని సంఘటనలు గుర్తుకు వస్తున్నాయని సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ సందర్భంగా దాదాపు 35 ఏళ్ల క్రితం నాటి సంఘటనలు గుర్తుకు తెస్తున్నారు. అప్పట్లో రజనీకాంత్ హీరోగా దళపతి అనే సినిమా తీశారు దర్శకుడు మణిరత్నం. ఆ సమయంలోనే సెన్సేషనల్ స్టార్ కాంబినేషన్‌కి ఆయన ప్లాన్ చేశారు. అందులో భాగంగా మళయాళ మెగాస్టార్ మమ్ముట్టిని కూడా ఆ సినిమాలో తీసుకున్నారు.
తెలుగులో సినిమాకి ఊపు తెచ్చేలా మరో పాత్రకి నాగార్జున తీసుకోవాలని ఆయన భావించారు. ఈ విషయంపై కొన్ని రోజుల పాటు సంప్రదింపులు జరిగాయి. అయితే రజనీకాంత్‌తో, మణిరత్నంతో సినిమా చేయాలని ఎంతో ఇష్టం ఉన్నప్పటికీ నాగార్జున ఎందుకో గాని ఆ పాత్రకి అంగీకరించలేదు. దాంతో ఆ పాత్ర కోసం అప్పట్లో కొత్తగా పరిశ్రమలోకి వచ్చిన అరవింద్ స్వామిని తీసుకున్నారు.
నిజానికి ఆ సినిమాలో రజనీ, మమ్ముట్టి పాత్రలకు పూర్తి భిన్నంగా అరవింద్ స్వామిది చాలా పాజిటివ్ పాత్ర. రౌడీయిజం, దాడులు,ప్రతిదాడులను అణచివేయాలనే జిల్లా కలెక్టర్ పాత్ర అరవింద్ స్వామికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటున్న సినీ వర్గాలు...అప్పట్లో రజనీ తో కలిసి మంచి పాత్ర చేయని నాగ్...ఇప్పుడు విలన్ పాత్ర చేయడం విశేషమంటూ గుర్తు చేసుకుంటున్నారు.