దేవబ్రాహ్మణులకు నందమూరి బాలకృష్ణ క్షమాపణలు చెప్పారు. పొరపాటును మన్నించండి అంటూ బహిరంగ లేఖ రాశారు. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దేవ బ్రాహ్మణులకు గురువు దేవళ మహర్షి అని, వారి నాయకుడు రావణాసురుడు అని చరిత్రని వక్రీకరించేలా మాట్లాడారు.
చరిత్ర పూర్తిగా తెలుసుకోకుండా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, వెంటనే క్షమాపణలు చెపి ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని దేవాంగుల కమ్యూనిటీ డిమాండ్ చేసింది. దీంతో బాలకృష్ణ వారికి క్షమాపణలు చెబుతూ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు.
‘దేవబ్రాహ్మణ సోదరసోదరీమణులకు మీ సోదరుడు నందమూరి బాలకృష్ణ మనఃపూర్వక మనవి. దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని నాకందిన సమాచారం తప్పు అని నాకు తెలియజేసిన దేవబ్రహ్మణ పెద్దలందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేనన్న మాట వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధపడ్డాను. నాకు ఎవరిని బాధ పెట్టాలన్న ఆలోచన లేదు, ఉండదని కూడా తెలుగు ప్రజలందరికి తెలుసు.
దురదృష్టవశాత్తు ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే.. అంతేకానీ సాటి సోదరుల మనసు గాయపరచటం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏమంటుంది చెప్పండి. పైగా దేవాంగులలో కూడా నా అభిమానులు చాలా మంది ఉన్నారు. నా వాళ్లను నేను బాధపెట్టుకుంటానా? అర్థం చేసుకొని పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నాను’అని బాలకృష్ణ లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment