‘‘దసరా’ సినిమా విడుదల తర్వాత చాలామంది నాని.. ‘దసరా’కి ముందు, ‘దసరా’ తర్వాత అంటున్నారు. నా గత చిత్రాలు ‘భలే భలే మగాడివోయ్, నిన్ను కోరి, జెర్సీ’లకి కూడా ఇదే మాటలు విన్నాను. జీవితాంతం నేను చేసిన ప్రతి సినిమాకి ఈ మాట వినాలని ఉంది (నవ్వుతూ)’’ అని హీరో నాని అన్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తీ సురేష్ జంటగా నటించిన చిత్రం ‘దసరా’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా మార్చి 30న విడుదలైంది. ఈ సందర్భంగా నాని పంచుకున్న విశేషాలు.
► ‘దసరా’ కథని శ్రీకాంత్ చెప్పినప్పుడు అద్భుతంగా ఉందనిపించింది. మంచి సాంకేతిక నిపుణులను తనకు ఇచ్చి, ప్రోత్సహించాలని కథ వినగానే నిర్ణయించుకున్నాను. ఈ సినిమా చేస్తున్నప్పుడే శ్రీకాంత్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని చెప్పాను. ప్రేమ, స్నేహం, పగ.. యూనివర్సల్‌గా కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, మన సంస్కృతిని సెలబ్రేట్ చేసుకునే సినిమా ఏదైనా దొరికితే అది అందరి దగ్గరకి తీసుకెళ్లడం మన బాధ్యత. ‘దసరా’ అలాంటి సినిమానే. అందుకే మిగతా భాషల్లోనూ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులే కాదు.. ఉత్తరాదిలోనూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
► ‘దసరా’ లొకేషన్‌లో ఎంజాయ్ చేస్తూ చేసిన సన్నివేశం ఏదీ లేదు. దుమ్ము, ధూళి, వేడి మధ్య చాలా కష్టపడి పని చేశాం. అయితే సన్నివేశాలు బాగా వస్తున్నాయనే ఫీలింగ్ షూటింగ్‌లోనే కలిగింది. ఈ సినిమా క్లయిమాక్స్‌ని ప్రేక్షకులతో కలసి థియేటర్‌లో చూడటానికి చాలా ఆత్రుతగా ఎదురు చూశాం.. మేము అనుకున్నట్టే క్లయిమాక్స్‌కి మంచి స్పందన వస్తోంది. ‘దసరా’ చూసినవారంతా గొప్పగా స్పందిస్తున్నారు. ఫోన్ కాల్స్‌తో పాటు ఎమోషనల్ మెసేజ్‌లు చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది.
► రామ్‌చరణ్‌కు ‘రంగస్థలం’, అల్లు అర్జున్‌కి ‘పుష్ప’, నాకు ‘దసరా’ అని సోషల్ మీడియాలో వార్తలు రావడం చూశాను. ఆ మాటలకు నటుడిగా ఆనందపడతాను. కానీ తృప్తిపడను. ఎప్పుడైతే మనం తృప్తి పొందుతామో ఆ తర్వాత ప్రయత్నం చేయడంలో అలసత్వం వచ్చేస్తుంది. ఏ సినిమాకీ నేను తృప్తిపడను. ఆనందం మాత్రం ఉంటుంది.
► రస్టిక్ మూవీ చేయాలా? వేరే జానర్ మూవీ చేయాలా? అని నేను ప్లాన్ చేయను. ‘దసరా’ మాస్ సినిమా. పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా విడుదలకు ముందే నేను దాన్నుంచి బయటికి వచ్చేశాను. ఇప్పుడు ఓ సినిమాలో ఆరేళ్ల పాపకి తండ్రిగా చేస్తున్నాను. నటుడిగా వైవిధ్యం చూపిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించేలా సినిమాలు చేయాలనేది నా ఆలోచన. నా కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ‘దసరా, ఎంసీఏ, నేను లోకల్’ ఉన్నాయి. నేను ఏ సినిమానీ జానర్‌వారీగా చూడను.. కథ నచ్చితే సినిమా చేసేస్తాను. అయితే ఏ జానర్‌ని కూడా రిపీట్ చేయకపోవడాన్ని సౌకర్యంగా భావిస్తాను.
► కొత్త దర్శకులని పరిచయం చేయాలని ప్రత్యేకంగా అనుకోను. కథ నచ్చితే చేస్తాను. అయితే నేను పరిచయం చేసిన దర్శకులు మంచి స్థానాల్లో ఉండటం గర్వంగా ఉంది. ‘దసరా’ తొలి ఆటకి మా అబ్బాయి జున్నుని తీసుకెళ్లాను. నా ఫ్యాన్స్ అరుస్తూ, పేపర్లు విసిరేస్తుంటే.. ఎందుకు అలా చేస్తున్నారో వాడికి అర్థం కాలేదు. పేపర్లు వేస్ట్ అవుతున్నాయంటూ టెన్షన్ పడ్డాడు (నవ్వుతూ).
► ప్రభాస్, మహేశ్‌గార్లతో పాటు ఇండస్ట్రీలోని చాలామంది ‘దసరా’ని మెచ్చుకుంటూ మెసేజ్‌లు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ‘జెర్సీ, శ్యామ్ సింగరాయ్’ సమయంలో కూడా చిరంజీవి, రామ్‌చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేశ్‌బాబుగార్లు మెసేజ్ చేశారు. ఇది ఆనందంతో పాటు బాధ్యతని కూడా పెంచుతుంది. నా చిత్రాలను చాలామంది వేరే చిత్రాల బాక్సాఫీసు లెక్కలతో పోలుస్తారు. ప్రతి సినిమాకి ఒక లక్ష్యం ఉంటుంది.. ప్రేక్షకులు దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి మూవీని ప్రత్యేకంగా చూడాలి.
ఆ మాట జీవితాంతం వినాలని ఉంది
Published Tue, Apr 4 2023 2:40 AM | Last Updated on Tue, Apr 4 2023 2:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment