
Tuck Jagadish Movie: కరోనా వల్ల చిత్రపరిశ్రమకు పెద్ద దెబ్బే పడింది. ఎప్పుడు షూటింగ్స్ పూర్తవుతాయో, ఎప్పుడు సినిమాలు రిలీజవుతాయో తెలియని పరిస్థితి దాపురించింది. ఒకవేళ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నా జనాలు థియేటర్లకు వచ్చి చూస్తారా? అన్నది కూడా సందిగ్ధంగానే ఉంది. ఈ క్రమంలో ఎన్నో చిన్న, పెద్ద సినిమాలు ఓటీటీని ఆశ్రయించాయి. నష్టం అన్న మాట రాకుండా మంచి డీల్ కుదుర్చుకుని ఎంతో కొంత లాభాన్ని ఆర్జిస్తున్నాయి.
ఈ క్రమంలో నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమా కూడా ఓటీటీలోకి వస్తుందంటూ మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమధ్య చిత్రయూనిట్ దీనిపై స్పందిస్తూ అవి వట్టి పుకార్లుగా కొట్టిపారేసింది. టక్ జగదీష్ థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ టక్ జగదీష్ ఓటీటీ ప్రసారం కానుందంటూ రూమర్లు వస్తూనే ఉన్నాయి. నిర్మాతలు డిజిటల్ రిలీజ్‌కు మొగ్గు చూపుతున్నప్పటికీ నాని మాత్రం ఒప్పుకోవడం లేదట. అయితే అమెజాన్ ప్రైమ్ రూ.37 కోట్లు ఆఫర్ ఇవ్వడంతో మేకర్స్ ఓటీటీలో విడుదల చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం.
శాటిలైట్ హక్కులను 8 కోట్లకు స్టార్ మా సొంతం చేసుకున్నట్లు వినికిడి. హిందీ డబ్బింగ్ రైట్స్‌కు మరో రూ.5 కోట్లు, ఆడియో రైట్స్‌ను దక్కించుకునేందుకు ఆదిత్య మ్యూజిక్ రూ.2 కోట్లు చెల్లించినట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తంగా టక్ జగదీష్ రూ.52 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఈ డీల్స్ నిజమేనా? నాని ఓ మెట్టు దిగి ఓటీటీకి ఓకే చెప్పాడా? అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే! షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఎస్‌ఎస్ థమన్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment