‘‘మంచి నటుడు కావాలని పరిశ్రమలోకి వచ్చాను. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. 50 ఏళ్లు సినీ ప్రయాణం పూర్తి చేసుకోవడం ప్రేక్షకుల ప్రేమ, అభిమానాల వల్లే సాధ్యమైంది. నా జీవితాంతం చిత్ర పరిశ్రమకు సేవ చేస్తాను’’ అని నటుడు డా. నరేశ్ వీకే అన్నారు. నటుడిగా ఆయన ప్రయాణం మొదలై 50 ఏళ్లు పూర్తయ్యాయి. నేడు (జనవరి 20) నరేశ్ పుట్టినరోజు.
(చదవండి: ప్రముఖ హీరో మంచి మనసు... ఆరుగురు ఖైదీలు విడుదల)
ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని శుక్రవారం నరేశ్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నా తొమ్మిదో ఏట ‘పండంటి కాపురం’ (1972)తో బాలనటుడిగా అడుగుపెట్టాను. మా అమ్మ విజయ నిర్మల, జంధ్యాల, కె. విశ్వనాథ్, బాపు, రమణ, ఈవీవీ సత్యనారాయణ, వంశీ, రేలంగి నరసింహారావు వంటి మహనీయులతో సినిమాలు చేసే అదృష్టం దక్కింది. రాజకీయాలు, ఆ తర్వాత సమాజ సేవ వల్ల దాదాపు పదేళ్లు పరిశ్రమకి దూరమయ్యాను.
సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, బిజీగా ఉన్నాను. నాకు నెగటివ్ రోల్స్ చేయాలని ఉంది. ఇక ఏ ప్రభుత్వమైనా సినీ పరిశ్రమకు తగిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వాలి. నంది అవార్డులని పరిశ్రమ గౌరవంగా చూస్తుంది. కానీ ఇప్పుడా అవార్డులని ఇవ్వడం లేదు.. మళ్లీ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మా అబ్బాయి నవీన్‌కి దర్శకుడిగా మంచి భవిష్యత్ ఉంటుందని నమ్ముతున్నాను. మా విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్‌ని మోడ్రన్ స్టూడియోగా చేస్తున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment