
Naresh VK actor: ‘‘విజయకృష్ణ మూవీస్’ బ్యానర్ స్థాపించి యాభై ఏళ్లు అవుతోంది. ఈ బ్యానర్ పతాకాన్ని మళ్లీ ఎగరవేయాలనుకుని ఈ ఏడాది నుంచి సినిమాలు నిర్మించాలనుకుంటున్నాను’’ అని నటుడు నరేశ్ విజయకృష్ణ అన్నారు. నేడు (జనవరి 20) తన పుట్టినరోజుని పురస్కరించుకుని బుధవారం నరేశ్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘కరోనాను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం లేదు. 1972లో వచ్చిన ‘పండంటి కాపురం’ సినిమాతో తెరంగేట్రం చేశాను. నటుడిగా యాభై ఏళ్లు నిండాయి. ఇంతటి సుధీర్ఘ ప్రయాణానికి కారణమైన సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మలగార్లకు, నా గురువు జంధ్యాలకి థ్యాంక్స్. యాభై ఏళ్ల ప్రయాణం తర్వాత కూడా కొత్త పాత్రలు ఇస్తున్న రచయితలు, దర్శక–నిర్మాతలకు, నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు.
ఈ యాభై ఏళ్లలో ఓ పదేళ్లు సామాజిక సేవ, రెండేళ్లు ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ అభివృద్ధి కోసం కృషి చేశాను. ఈ ఏడాది అమ్మ పేరుతో (విజయ నిర్మల) స్టూడియోను అందుబాటులోకి తీసుకొస్తున్నాను. ‘నాలుగు స్థంభాలాట’ సమయంలో ‘గౌరవం నువ్వు ఆశించకు.. అందరికీ ఇవ్వు’ అని మా అమ్మ చెప్పారు.. నేను అదే ఫాలో అవుతుండటం వల్లే ఇంకా టాప్‌లో ఉన్నాను. ఓటీటీ వచ్చినా థియేటర్ అనుభూతే వేరు. ప్రస్తుతం రామ్‌చరణ్–శంకర్ సినిమా, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌తో పాటు నవీన్ పొలిశెట్టి సినిమా చేస్తున్నాను. భవిష్యత్తులో దర్శకత్వం చేయాలని ఉంది. ప్రస్తుతం రాజకీయాల గురించి ఆలోచించడం లేదు. ఇండస్డ్రీ, ఏపీ ప్రభుత్వం (టికెట్ ధరలు, ఇతర ఇండస్ట్రీ సమస్యలను ఉద్దేశించి) మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.. త్వరలోనే మంచి నిర్ణయం వస్తుందనుకుంటున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment