
వివాహం తర్వాత నటి నయనతార పెద్దగా బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టలేదు. ఆ మధ్య అట్లీ దర్శకత్వంలో షారూఖ్‌ఖాన్ సరసన నటిస్తున్న హిందీ చిత్రం జవాన్ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లి అయిన నయనతార పలు విమర్శలను, వివాదాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో కూడా ఆమె భర్త, దర్శకుడు విగ్నేష్ శివన్ స్పందించారే తప్ప నయనతార ఎక్కడా స్పందించలేదు.
ఇకపోతే ఈమె ప్రధాన పాత్రలో నటించిన కనెక్ట్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 22వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. దీన్ని ఆమె భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ తమ రౌడీ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్ర ప్రమోషన్‌లోనూ నయనతార ఇప్పటి వరకు పాల్గొనలేదు. అలాంటిది తొలిసారిగా తాను అంబాసిడర్‌గా నియమితమైన ‘ది లిప్ బామ్’ ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని సందడి చేయడం విశేషం.