
నయాగరా జలపాతంలోని ప్రవాహాలు ఎంత సుందరంగా ఉంటాయో, నయనతార అంత అందంగా ఉంటారని చెప్పవచ్చేమో. జీవితంలో ఎన్నో ఆటంకాలను ఎదురొడ్డి నటన అనే నిత్య ప్రవాహంలో తెలియాడుతున్న నటి నయనతార. దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ పరువాల సుందరి సరోగసీ విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయ్యారు. ఆ పిల్లలకు కావాల్సినంత అమ్మ ప్రేమను అందిస్తూనే అగ్ర కథానాయకిగా కొనసాగుతున్నారు.
మరో పక్క వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ, సొంత వ్యాపారాలను లాభాల బాటలో నడిపిస్తూ, నిర్మాతగానూ కొనసాగుతూ దటీజ్ నయనతార అనిపించుకుంటున్నారు. ఇకపోతే వేడుక ఏదైనా, ఎవరిదైనా నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు తమ ప్రత్యేకతను చాటుకుంటారు. ఇటీవల ముంబయిలో అంబానీ ఇంట జరిగిన వివాహ వేడుకలోనూ నయనతార, విఘ్నేశ్ శివన్ కలిసి ప్రత్యేకంగా రొమాంటిక్ ఫోజులతో ఫొటోలు దిగి నెటిజన్లకు పని చెప్పారు. ఇకపోతే నటిగానూ బిజీగా ఉన్న నయనతార ప్రస్తుతం తమిళంలో టెస్ట్, మన్నాంగట్టి చిత్రాలను పూర్తి చేశారు.
మలయాళంలో నివిన్‌బాలి సరసన ఒక చిత్రం చేస్తున్నారు. యష్‌కు జంటగా కన్నడంలో టాక్సీస్ చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యారు. అలాగే త్వరలో మూక్తుత్తి అమ్మన్–2 చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. వీటితో పాటు మరో చిత్రానికి నయనతార పచ్చజెండా ఊపినట్లు తాజా సమాచారం. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై రూపొందనున్న ఈ ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రంలో నయనతార కథానాయకిగా నటించనున్నట్లు తెలిసింది. భరద్వాజ్ రంగన్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి సర్జన్ కేఎం దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.