టైటిల్: నీతోనే నేను
నటీనటులు: వికాస్ వశిష్ట, మోక్ష, కుషిత, అకెళ్ల తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీమామిడి ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: ఎమ్. సుధాకర్ రెడ్డి
దర్శకత్వం: అంజిరామ్
సంగీతం: కార్తీక్ బి. కడగండ్ల
సినిమాటోగ్రఫీ: మురళీ మోహన్
విడుదల తేది: అక్టోబర్ 13, 2023
కథేంటంటే..
రామ్(వికాష్ వశిష్ట) ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. మెదక్ జిల్లా లక్ష్మాపూర్ ప్రభుత్వ పాఠశాలకు బదిలీపై వస్తాడు. అదే రోజు స్పోర్ట్స్ టీచర్‌గా ఆయేషా(కుషిత)కూడా అదే స్కూల్‌లో జాయిన్ అవుతుంది. వీరిద్దరి ఆలోచనలు ఒకటే. పేద పిల్లలను వృద్ధిలోకి తీసుకు రావాలని కష్టపడుతుంటారు. ఆ స్కూల్లో చదివే పిల్లలకు ఏ ఆపద వచ్చిన తోడుగా నిలుస్తుంటారు. రామ్ మంచి తనం చూసి ఆయేషా అతన్ని ఇష్టపడుతుంది.
ఒక రోజు తన ప్రేమ విషయాన్ని రామ్‌తో చెప్పగా అతను నిరాకరిస్తాడు. తనకు అల్రేడీ సీత అనే అమ్మాయితో పెళ్లి అయిందని చెబుతాడు. అసలు సీత ఎవరు? రామ్, సీతల లవ్‌స్టోరీ ఏంటి? సీతకు ఏమైంది? సీతకు, ఆయేషాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ప్రేమించిన రామ్ కోసం అయేషా తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ఏంటి? మంచి టీచర్‌గా పేరున్న రామ్..తన వృత్తికి ఎందుకు రాజీనామా చేశాడు? చివరకు ఆయేషా ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే ‘నీతోనే నేను’ సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఈ సినిమాలో ఓ సన్నివేశం ఇలా ఉంటుంది. ప్రార్థన సమయంలో ఓ విద్యార్థిని కళ్లు తిరిగి పడిపోతుంది. ఆస్పత్రికి తీసుకెళ్తే.. వాటర్ సరిగా తాగకపోవడంతో కిడ్నీలో రాళ్లు వచ్చాయని చెబుతారు. వాటర్ ఎందుకు తాగడం లేదని ఆ విద్యార్థిని అడిగితే.. స్కూల్‌లో వాష్ రూమ్ సరిగా లేదని, అందులోకి వెళ్లడం ఇష్టంలేకనే నీళ్లు తాగడం లేదని చెబుతుంది. వెంటనే హీరో కలెక్టర్‌కి లెటర్ రాయడం.. ఆ సమస్య తీరిపోవడం జరుగుతుంది. ఈ ఒక్క సీన్ చాలు ‘నీతోనే నేను’ ఓ మంచి సందేశాత్మక చిత్రమని చెప్పడానికి.
కమర్షియల్ పంథాలో కొన్ని థ్రిల్లింగ్ అంశాలను జోడిస్తూ..ఓ మంచి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు అంజిరామ్. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ..దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు మాత్రం రొటీన్‌గా ఉంటాయి. ప్రభుత్వం పాఠశాలలో ఉండే సమస్యలు..వాటిని హీరో పరిష్కరించిన తీరు..అన్ని గత సినిమాల్లో మాదిరే ఉంటాయి.
స్కూల్ టీచర్‌గా హీరో రావడం..అక్కడి సమస్యలు పరిష్కరించడం..అతని లవ్‌స్టోరీ..ఇలా రొటీన్‌గా ఫస్టాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో వచ్చే ట్విస్టులు సినిమాపై ఆసక్తి పెంచుతుంది. మధ్య మధ్యలో కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. పాటలు కూడా కథకు అతికించినట్లుగా అనిపిస్తాయి. క్లైమాక్స్‌లో ఆయేషా పాత్ర ఇచ్చే ట్విస్ట్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కమర్షియల్‌గా ఈ చిత్రం ఏ మేరకు ఆట్టుకుంటుందో తెలియదు కానీ..ఓ మంచి సందేశం మాత్రం ఇస్తుంది.
ఎవరెలా చేశారంటే..
ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాము పాత్రలో వికాస్ వసిష్ట చక్కగా నటించాడు. ఓ బాధ్యత గల టీచర్‌గా, భార్య కోసం పరితపించే భర్తగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక పీటీ టీచర్ ఆయేషాగా కుషిత తన పాత్ర పరిధిమేర నటించింది. హీరో భార్య సీతగా నటించిన మోక్ష.. భావోద్వేగాలను చక్కగా పండించింది. కన్నింగ్ టీచర్‌గా ఆకెళ్లతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ చిత్ర పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం ఓకే. సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న రాసిన పాటలు బాగున్నప్పటికీ.. కథలో ఇరికించినట్లు అనిపిస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment