
నోరా ఫతేహి (Nora Fatehi).. ఐటం సాంగ్ డ్యాన్సరే కాదు, నటి కూడా! కానీ ఆమెకు ఎక్కువగా డ్యాన్సర్‌గానే గుర్తింపు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అభిషేక్ బచ్చన్ సరసన బి హ్యాపీ అనే సినిమాలో నటిస్తోంది. అయితే తనను ప్రతిసారి ఎవరో ఒకరితో పోల్చడం నచ్చదంటోందీ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నోరా ఫతేహి మాట్లాడుతూ.. నేను ముక్కుసూటిగా మాట్లాడతాను. దాన్ని అందరూ తలపొగరు అనుకుంటారు.
ఐటం సాంగ్స్, యాక్టింగ్..
స్పెషల్ సాంగ్స్‌లో కనిపించనంతమాత్రాన హీరోయిన్‌గా చేయొద్దని ఎక్కడా లేదే! ప్రతి ఒక్కరూ ఐటం సాంగ్స్ (Item Songs) చేయొచ్చు, కావాలనుకుంటే నటించనూవచ్చు. ఈ విషయంలో అందరికీ ఒకేవిధమైన న్యాయం ఉండాలి. స్పెషల్ సాంగ్స్ చూసినప్పుడు నేను ఏమని ఫీలవుతానో తెలుసా? అమ్మాయిలు ధైర్యంగా ముందడుగు వేశారు.. అందంగా కనబడుతూనే ఇలాంటి పాటల్లో కనిపించేందుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదని సంతోషపడతాను.

నాతో పోల్చుకుంటున్నారు
కానీ నచ్చని విషయం ఏంటంటే.. వారి సాంగ్ ప్రమోషన్‌కు నా పేరును వాడుకోవడం! ఏదైనా పాటను జనాల్లోకి తీసుకెళ్లాలనుకున్నప్పుడు నా పేరును లాగుతున్నారు. నోరాతో పోల్చితే చాలనుకుంటున్నారు. అన్ని పీఆర్ ఏజెన్సీ (PR campaigns)లు ఇదే పని చేస్తున్నాయి. కొత్త పాట రిలీజైనప్పుడల్లా నోరా కెరీర్ ముగిసినట్లే.. ఈ కొత్త బ్యూటీ నోరా కంటే 100 రెట్లు నయం.. ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. దీని వెనక ఎవరున్నారో నాకు తెలుసు.
ఎవరినీ కిందకు లాగను
ఇందుకోసం ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారో కూడా బాగా తెలుసు. సేమ్, ఇలాగే అవతలివారిని కిందకు లాగుతూ ప్రచారం చేద్దామని కొన్ని పీఆర్ ఏజెన్సీలు నన్ను సంప్రదించాయి. కానీ నేనందుకు ఒప్పుకోలేదు. నన్ను నేను ఎవరితోనూ పోల్చుకోలేను. ఎవరినీ కిందకు లాగడం నాకిష్టం లేదు. నా పాట రిలీజైనప్పుడు నా పనితనం, డ్యాన్స్, ఎఫర్ట్స్.. ఇవి చూసి మాత్రమే జనాలు నన్ను మెచ్చుకోవాలి అని చెప్పుకొచ్చింది.
శ్రీలీల వంటి హీరోయిన్ల రాకతో..
ఈ మధ్య శార్వరి, శ్రీలీల (Sreeleela), రాషా వంటి పలువురు యంగ్ హీరోయిన్లను నోరాతో పోల్చారు. అంతేకాదు వారి రాకతో నోరా కెరీర్ ఖతమైపోయిందన్న కామెంట్లు కూడా చూశాం అంటున్నారు నెటిజన్లు. నోరా ప్రధాన పాత్రలో నటించిన బి హ్యాపీ సినిమా విషయానికి వస్తే. ఈ మూవీ మార్చి 14న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment