టైటిల్: ఊరు పేరు భైరవకోన
నటీనటులు: సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, వెన్నెల కిశోర్, రవి శంకర్ తదితరులు
నిర్మాణ సంస్థ: హాస్య మూవీస్ బ్యానర్
నిర్మాత: రాజేష్ దండా
సమర్పణ: అనిల్ సుంకర
దర్శకత్వం: విఐ ఆనంద్
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
ఎడిటింగ్: చోటా కె ప్రసాద్
విడుదల తేది: ఫిబ్రవరి 16, 2024
కథేంటంటే..
బసవ లింగం అలియాస్ బసవ (సందీప్ కిషన్) ఓ స్టంట్ మాస్టర్. యాక్షన్ సీన్లలో హీరోలకు డూప్‌గా పని చేస్తుంటాడు. ఓ సారి అతని స్నేహితుడు జాన్(వైవా హర్ష)తో కలిసి పెళ్లి ఇంట్లో వధువు నగల్ని దొంగిలించి అనుకోకుండా భైరవ కోన అనే గ్రామంలోకి ప్రవేశిస్తారు. వీరిద్దరితో పాటు మరో దొంగ అగ్రహారం గీత(కావ్య థాపర్) కూడా ఆ గ్రామంలోకి వెళ్తుంది. అక్కడ వీరికి విచిత్రమైన పరిస్థితుల ఏర్పడుతాయి. బసవ కొట్టేసిన బంగారాన్ని రాజప్ప(రవి శంకర్) దొంగిలిస్తాడు. దాన్ని తిరిగి తెచ్చుకునేందుకు బసవ ఏం చేశాడు? స్టంట్ మాస్టర్ అయిన బసవ ఎందుకు దొంగగా మారాడు? అసలు రాజప్ప ఎవరు? భైరవకోనలో ఉన్న పెద్దమ్మ(వడివుక్కరసి), డాక్టర్ నారప్ప(వెన్నెల కిశోర్) ఏం చేశారు. గిరిజన యువతి భూమి(వర్ష బొల్లమ్మ), బసవకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? గరుడ పురాణంలో మాయమైన నాలుగు పేజీలకు ఈ భైరవ కోనకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఆ ఊరి నుంచి బసవ గ్యాంగ్ ఎలా బయటపడింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం' లాంటి హారర్ చిత్రాలతో విజయాలు అందుకున్నాడు దర్శకుడు వీఐ ఆనంద్. ఇలాంటి డైరెక్టర్ నుంచి ఫాంటసీ థ్రిల్లర్ వస్తుందంటే అంచనాలు ఏర్పడడం సాధారణం. ఇక ట్రైలర్ విడుదలయ్యాక ఊరిపేరు భైరవకోన’పై ఆ అంచనాలు మరింత పెరిగాయి. అయితే ట్రైలర్ చూసినంత ఆనంద్ గత సినిమాల మాదిరే ఇది కూడా నవ్విస్తూనే కొన్ని చోట్ల భయపెడుతుంది. మంచి ప్రేమ కథతో పాటు తండ్రి కూతుళ్ల సెంటిమెంట్‌తో మిస్టీరియస్ థ్రిల్లర్‌గా సినిమాను తీర్చిదిద్దారు. అయితే సినిమాలోని ప్రధానమైన అంశాలను ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా చేయడంలో దర్శకుడు కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. హీరో హీరోయిన్ల ప్రేమ కథను మరింతగా బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. అలాగే ఎమోషనల్‌గా కూడా ప్రేక్షకులను కనెక్ట్ చేయలేకపోయాడు. అలా అని ఈ చిత్రంలో ఎంగేజింగ్ కంటెంట్ లేదని చెప్పలేం. కడుపుబ్బా నవ్వించడంతో పాటు భయపెట్టే సీన్స్ కూడా చాలానే ఉన్నాయి.
సినిమ చూస్తున్నంతసేపు కొత్త ప్రపంచలోకి వెళ్తాం. కానీ అక్కడ జరిగే సంఘటనలు మాత్రం వాస్తవికతకు చాలా దూరంగా ఉంటాయి. ఎంత ఫాంటసీ జానార్ అయినా..తెరపై చూస్తే కొంచెం అయినా నమ్మేలా ఉండాలి. భైరవకోనలో అది మిస్ అయింది. అలాగే కథ సీరియస్ మూడ్‌లోకి వెళ్లగానే మళ్లీ దానికి కామెడీ టచ్ ఇవ్వడం కూడా.. దెయ్యాలనే బురిడీ కొట్టించడం లాంటి సీన్స్ కాస్త సిల్లీగా అనిపిస్తుంది.
కార్తీక పౌర్ణమికి ఒక రోజు ముందు అటూ భైరవకోన ఊరిని పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత మూడు నెలలు వెనక్కి వెళ్లి.. హీరోని పరిచయం చేశాడు. ఆ తర్వాత కథనం సాదా సీదాగా సాగుతుంది. హీరో గ్యాంగ్ ఎప్పుడైతే బైరవకోన గ్రామంలోకి ప్రవేశిస్తుందో..అప్పటి నుంచి కథనం ఆసక్తికరంగా సాగుతుంది. అక్కడ వైవా హర్ష, వెన్నెల కిశోర్ మధ్య వచ్చే సీన్స్ నవ్వులు పూయిస్తాయి. ఇక పెద్దమ్మ, రాజప్ప క్యారెక్టర్ల ఎంట్రీతో బైరవకోణలో ఏదో జరుగబోతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్ ప్రారంభంలో ఇంట్రెస్టింగ్ సాగినా.. కథలోని ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతున్నకొద్ది ఆ ఆసక్తి తగ్గిపోతుంది. మధ్యలో వచ్చే లవ్ ట్రాక్ కూడా అంతగా ఆకట్టుకోదు. క్లైమాక్స్ కూడా సింపుల్‌గా ఉంటుంది.
ఎవరెలా చేశారంటే..
బసవ పాత్రలో సందీప్ కిషన్ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్‌లో చక్కగా నటించాడు. భూమిగా వర్ష బొల్లమ్మ తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రకు బలమైన సన్నివేశాలు మాత్రం లేవు. కావ్య థాపర్ కీలక పాత్ర పోషించి మెప్పించింది. తెరపై అందంగానూ కనిపించింది. వెన్నెల కిశోర్, వైవా హర్షల కామెడీ సినిమాకు ప్లస్ అయింది. బ్రహ్మాజీ కనిపించేంది కాసేపే అయినా.. నవ్విస్తాడు. రవిశంకర్, జయప్రకాశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతికపరంగా సినిమా బాగుంది. శేఖర్ చంద్ర సంగీతం సినిమాకు ప్లస్ అయింది. ‘నిజమే నే చెబుతున్నా..’సాంగ్‌తో పాటు అన్నీ పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. బీజీఎం బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ ఎఫెక్ట్స్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment