సీబీఎఫ్‌సీ మాజీ చైర్మన్ పహ్లాజ్ నిహలానీ (ఫైల్‌ఫోటో)
ముంబై: ఫుడ్ పాయిజన్ వల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యాను.. రక్తపు వాంతులయ్యాయి.. దాదాపు 28 రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నాను అని ప్రముఖ నిర్మాత, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్‌సీ) మాజీ చైర్మన్ పహ్లాజ్ నిహలానీ తెలిపారు. ఓ రెస్టారెంట్ నుంచి తీసుకువచ్చిన ఆహారం తిన్న తర్వాత తనకు రక్తపు వాంతులయ్యాయని.. 28 రోజులు ఆస్పత్రిలోనే ఉన్నాను అని బాలీవుడ్ హంగామాకు తెలిపారు.
తనకు ఎదురైన ఈ భయానక అనుభవం గురించి పహ్లాజ్ నిహలానీ వర్ణిస్తూ.. ‘‘నెల రోజుల క్రితం నేను ఒక్కడినే ఇంటిలో ఉన్నాను. నా భార్య వేరే ఊరు వెళ్లింది. ఈ క్రమంలో ఓ రోజు అనుకోకుండా మహమ్మారి సమయంలో నేను నిర్మించిన ఓ సినిమా యూనిట్ సభ్యులు మా ఇంటికి వచ్చారు. పిచ్చపాటి మాట్లాడుతూ కూర్చున్నాం. బాగా ఆలస్యం అయ్యింది. ఆ సమయంలో వారిని ఊరికే పంపిచడం భావ్యం కాదని భావించి తిని వెళ్లమని చెప్పాను. అప్పటికే నా కోసం మా ఇంట్లో ఆహారం తయారు చేశారు. కానీ అది అందరికి సరిపోదు. దాంతో బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాను’’ అన్నారు.
తింటున్నప్పడే తేడా కొట్టింది
‘‘వారి కోరిక మేరకు చికెన్ ఐట్సం ఆర్డర్ చేశాను. ఇక మాంసాహారంలో నేను చికెన్ మాత్రమే తింటాను. దాంతో వారు నన్ను కూడా తమతో జాయిన్ కావాల్సిందిగా కోరారు. వద్దనడం మర్యాద కాదని భావించి సరే అన్నాను. ఆ తర్వాత కొంచెం చికెన్ తీసుకుని తిన్నాను. అప్పుడే ఏదో తేడా కొట్టింది. దాని గురించి వారికి చెప్పాను. వాళ్లు పర్లేదు బాగానే ఉంది.. ఏం కాదు తిను అని హామీ ఇవ్వడంతో తిన్నాను’’ అంటూ చెప్పుకొచ్చారు.
తెల్లవారుజామున 3 గంటలకు రక్తపు వాంతులు
‘‘ఆ తర్వాత కాసేపటికే నాకు కాస్త అసౌకర్యంగా అనిపించడమేక కాక వాంతికి అయ్యింది. ఆపై కాస్తా బాగానే అనిపించింది.. నీరసంగా అనిపించడంతో వెంటనే పడుకున్నాను. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నాకు మరోసారి వాంతికి అయ్యింది. చాలా రక్తం పోయింది. వెంటనే నా కొడుక్కి కాల్ చేశాను. తను సేమ్ బిల్డింగ్‌లో ఉంటున్నాడు. తను నన్ను ఆస్పత్రికి తరలించాడు. 28 రోజుల పాటు హాస్పిటల్‌లోనే ఉన్నాను’’ అన్నారు
చావు అంచుల వరకు వెళ్లి వచ్చాను
‘‘ఆస్పత్రిలో చేరిన గంటలోనే నాకు అన్ని టెస్ట్‌లు చేశారు. ఇక 28 రోజుల పాటు హాస్పిటల్‌లోనే ఉన్నాను. మహమ్మారి సమయం కావడంతో నా దగ్గరకు ఎవరిని రాన్వివలేదు. కానీ నేను చాలా అదృష్టవంతుడిననే చెప్పాలా. జాగ్రత్తగా చూడటానికి కుటుంబ సభ్యులు దగ్గర లేరు.. సరైన వైద్య సిబ్బంది కూడా లేరు. మరణం అంచుల వరకు వెళ్లి.. క్షేమంగా తిరిగి వచ్చాను’’ అని తెలిపారు.
రెస్టారెంట్‌పై కేసు పెడతాను
‘‘ఇక నా ఆరోగ్యం ఇంతలా క్షీణించడానికి కారణం అయిన సదరు రెస్టారెంట్ మీద కేసు పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఆ రోజు నాతోపాటు భోంచేసిన మిగతా వారు అస్వస్థతకు గురయ్యారు. కానీ నా పరిస్థితి తీవ్రంగా మారింది. ఆరోజు తిన్నదే నా చివరి భోజనం అనుకున్నాను. ఈ క్రమంలో నేను మీ అందరిని కోరేది ఒక్కటే. ఇంట్లో వండిన ఆహారాన్ని తినండి. బయట ఫుడ్ తీసుకుని ఇలా ఇబ్బంది పడకండి అన్నారు.
పహ్లాజ్ నిహలానీ 29 సంవత్సరాల పాటు పిక్చర్స్ మరియు టీవీ ప్రోగ్రాం నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు మరియు 2009 లో ఈ పదవికి రాజీనామా చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ఛైర్పర్సన్ పదవికి 19 జనవరి 2015 న పదవీవిరమణ చేశారు. 2017లో ఆయన స్థానంలో ప్రసాన్ జోషి నియమితులయ్యారు.
చదవండి: ప్రాణాలు తీసిన జొన్నరొట్టె
Comments
Please login to add a commentAdd a comment