దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. కరోనా సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా ఉండటంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్, పడకల కొరత ఏర్పడింది. దీంతో ఆక్సిజన్ కొరతతో ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తమ వంతుగా ఆయా కోవిడ్ కేర్ సెంటర్లకు ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్‌తో కలిసి భారత్‌లోని కోవిడ్ బాధితుల కోసం నిధులను సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 7.5 కోట్లు) సేకరించినట్లు తాజాగా ప్రియాంక సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
అయితే 3 మిలియన్ డాలర్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తాజాగా ఆమె చెప్పారు. ఈ మొత్తం భారతదేశంలో కోవిడ్‌తో బాధపడుతున్న వారికి వెచ్చించాలని ప్రియాంక-నిక్ దంపతులు భావిస్తున్నారు. గివ్ ఇండియా ద్వారా ఈ నిధులను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 7.5 కోట్ల రూపాయల నిధులు సేకరించామని చెప్పారు. ఈ డబ్బును భారత్‌లో ఎలా వినియోగించనున్నారో వివరాలు అడుగుతూ గివ్ ఇండియా సీఈఓ అతుల్ సతీజాతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ సంభాషణను ప్రియాంక షేర్ చేశారు.
ఈ ఫండ్‌ను భారత్‌లో ఆక్సీమీటర్లు అవసరమైన ప్రాంతాల్లో వెచ్చించేలా ప్లాన్ చేస్తున్నట్లు సతీజా చెప్పారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో టీకాలు అందుబాటులో లేవని, వారి కోసం కూడా కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తామని ఆయన వివరించారు. అదే విధంగా ఆపదలో ఉన్న భారత్‌కు టీకాలు పంపి ఆదుకోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను తాను కోరినట్లు ప్రియాంక తెలిపారు. భారత్‌లో పరిస్థితి తీవ్రంగా ఉన్నందున తగిన విధంగా ఆదుకోవాలని బైడెన్‌కు వివరించినట్లు కూడా ప్రియాంక పేర్కొన్నారు.
కాగా ఇటీవల ప్రియాంక భర్త నిక్ జోనస్ ఓ లైవ్ షోలో జరిగిన ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చారు. తాను తొందరగా కొలుకునేందుకు ప్రియాంక కారణమని, ప్రతి క్షణం తనను కనిపెట్టుకుని అన్ని విధాల సపర్యలు చేసిందని, గొప్ప భార్య అంటూ ప్రియాంక మీద నిక్ ప్రేమ కురిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment