రాజమౌళి, అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక, శ్రీలీల
‘‘పుష్ప 1, పుష్ప 2’ సినిమాల కోసం మేమంతా కష్టపడ్డామని చెబితే చిన్న మాట అవుతుంది. సుకుమార్‌గారు, నేను, మా యూనిట్ అంతా ఐదేళ్ల జీవితాలు పెట్టేశాం. మా నిర్మాతలు నవీన్, రవిగార్లకు కృతజ్ఞతలు. వాళ్లు కాకుండా ఏ ప్రోడ్యూసర్ అయినా ‘పుష్ప’ అయ్యేది కాదు. మమ్మల్ని నమ్మి కోట్లు ఖర్చు పెట్టినందుకు వాళ్లకు ధన్యవాదాలు’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ , రష్మికా మందన్నా జోడీగా నటించిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. శ్రీలీల ప్రత్యేక పాటలో నటించారు.
సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘పుష్ప వైల్డ్ ఫైర్ జాతర’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘పుష్ప 2: ది రూల్’ కోసం నాతో పనిచేసిన వారందరికీ థ్యాంక్స్. నాది, దేవి శ్రీది 20 ఏళ్ల ప్రయాణం. తన పాటల్లో నా కోసం ఎక్స్‌ట్రా లవ్ ఉంటుంది. ఈ తరం తెలుగమ్మాయిలకు శ్రీలీల స్ఫూర్తి. నేను ఐదేళ్లుగా పనిచేస్తున్న ఓకే ఒక హీరోయిన్ రష్మిక. తన అంకితభావానికి హ్యాట్సాఫ్. సుకుమార్‌గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.
‘పుష్ప 1, పుష్ప 2’ ఆయన సినిమాలే. ఇంత మంచి డైరెక్టర్ మన తెలుగులో ఉన్నారా? అనే భావనని ఆయన కలిగిస్తారు. సుకుమార్‌గారు లేకపోతే నేను లేను. ఆయన నాతో ‘ఆర్య’ తీయకపోయి ఉంటే నేను, ఈ వేదిక, ఈ జనాలు ఏవీ ఉండేవి కాదు. ‘పుష్ప’ నా కోసం ఆడాలని నేనెప్పుడూ అనుకోలేదు. సుకుమార్‌గారి కష్టం కోసమైనా ఆడాలనుకున్నాను. అలాగే ఈ సినిమా కోసం మూడేళ్లు త్యాగం చేసి, కష్టపడిన చిత్రబృందం కోసం ఆడాలని రెండోసారి అనుకున్నాను. ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలు వచ్చినప్పుడు తెలుగువారు ఎంతో గర్వించారు. ఆ తర్వాత ‘పుష్ప’ సినిమాకీ ఆ స్థాయిలో అంచనాలు ఉండటంతో తెలుగువారి కోసం ఈ సినిమా ఆడాలి అనుకున్నాను’’ అని తెలిపారు.
దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘సుమారు రెండు మూడు నెలల క్రితం ‘పుష్ప 2’ షూటింగ్‌కి వెళ్లాను. పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సీన్‌ని సుకుమార్‌గారు చూపించారు. ఆ ఒక్క సన్నివేశం చూడగానే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది నాకు అర్థం అయిపోయింది’’ అన్నారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘నేను వారం క్రితం ‘పుష్ప 2’ సినిమా చూసి ఇంటికెళ్లాను. ‘మగధీర’ సినిమాకి ముందు మీ మొహం ఎంతో వెలిగిపోవడం చూశాను.. మళ్లీ ఇప్పుడు చూస్తున్నాను’ అని నా భార్య నిర్మల అన్నారు. ‘పుష్ప’ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్’’ అని తెలిపారు.
సుకుమార్ మాట్లాడుతూ– ‘‘పుష్ప’ ఇలా వచ్చిందంటే కారణం కేవలం నాకు, బన్నీకి మధ్య ఉన్న బంధమే. తన మీద ప్రేమతోనే ఈ సినిమా తీశాను. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. ‘‘పుష్ప 2’ని ప్రేక్షకులు హిట్ చేస్తారనుకుంటున్నాం’’ అన్నారు నవీన్ ఎర్నేని. ‘‘ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్స్‌లో మా సినిమాని విడుదల చేస్తున్నాం’’ అని రవిశంకర్ చెప్పారు.
‘‘ఇంత పెద్ద మూవీ చేసే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు మైత్రీ మూవీస్ సీఈవో చెర్రీ. ‘‘పుష్ప’ చిత్రంలో పనిచేసినందుకు ఎంతో గర్వంగా ఉంది’’ అని పేర్కొన్నారు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్. ‘‘ఈరోజు నేను ఇలా నటిస్తున్నానంటే అది కేవలం సుకుమార్, అల్లు అర్జున్‌గార్ల వల్లే’’ అని తెలిపారు రష్మిక మందన్నా. ‘‘పుష్ప’ లో నాకు అవకాశం ఇచ్చినందుకు చిత్ర బృందానికి థ్యాంక్స్’’ అని శ్రీలీల చెప్పారు.
ఈ వేడుకలో నిర్మాతలు నాగవంశీ, సతీశ్ కిలారు, దర్శకులు గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు, వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ, నటి అనసూయ, కెమెరామేన్ మిరోస్లో కుబా బ్రోజెక్ తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment