నటుడు రాఘవ లారెన్స్ హీరోగా, ఎస్‌జే సూర్య విలన్‌గా నటించిన తాజా చిత్రం 'జిగర్తండ డబుల్ ఎక్స్'. నటి నిమిషా సజయన్ నాయకిగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ కార్తికేయన్ సంతానం, ఎస్.కదిరేశన్ నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని, తిరునావుక్కరుసు చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం చైన్నెలోని సత్యం థియేటర్‌లో నిర్వహించారు.
ఇందులో రాఘవ లారెనన్స్ మాట్లాడుతూ జగర్తండా చిత్రంలో తానే నటించాల్సి ఉందని.. ఆ సమయంలో తాను తెలుగులో చిత్రం చేయడంతో ఆ అవకాశాన్ని వదులుకున్నానని తెలిపారు. అయితే చిత్రం విడుదలైన తరువాత చూసి ఇంటికి వచ్చి చాలా బాధపడ్డానని ఒక రోజంతా నిద్ర కూడా పోలేదని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ చిత్రాన్ని చేయకపోవడమే మంచిదిగా భావిస్తున్నానని అన్నారు. కారణం అప్పుడు రూ. 20 కోట్ల బడ్జెట్‌లో రూపొందిన జిగర్తండా చిత్రాన్ని వదులుకోవడం వల్లే ఇప్పుడు రూ. 100 కోట్ల బడ్జెట్‌లో రూపొందిస్తున్న ఈ జిగర్తండా డబుల్ ఎక్స్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎస్‌జే సూర్యతో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు.
తాను సూర్య నటించే ముందు అలా చేద్దాం.. ఇలా చేద్దాం అని డిస్కస్ చేసుకునే వాళ్లమని, అయితే స్పాట్‌లోకి వచ్చిన తర్వాత దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు చెప్పినట్లే చేయాల్సి వచ్చేదని అన్నారు. ఆయనకు అంత కమాండ్ ఉందని పేర్కొన్నారు. ఇది తనకు చాలా ముఖ్యమైన చిత్రమని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ పేర్కొన్నారు. జిగర్తండ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు వచ్చాయని.. ఈ చిత్రానికి కూడా రెండు, మూడు జాతీయ అవార్డులు వస్తాయనే నమ్మకాన్ని నిర్మాత కార్తికేయన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది తమ సంస్థలో రూ. 100 కోట్ల బడ్జెట్లో నిర్మించిన తొలి చిత్రం అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment