సెలబ్రిటీలు ట్రోలింగ్ బారిన పడటం సర్వసాధారణమైపోయింది. అయితే కొందరు విమర్శలతోనే ఆగిపోవడంలేదని బెదిరింపులకు పాల్పడుతున్నారంటోంది హీరోయిన్ రైమా సేన్. ఏకంగా ఇంట్లోని తన ల్యాండ్‌లైన్‌కు కాల్ చేసి బెదిరిస్తున్నారని వాపోయింది. ప్రస్తుతం ఆమె 'మా కాళి' అనే సినిమా చేస్తోంది. 1946 ఆగస్టు 16న కలకత్తాలో జరిగిన ఓ దారుణ ఉదంతాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోందీ మూవీ. ఈ మధ్యే ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ రిలీజైంది.
ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు
అది చూసిన కొందరు తనను అదే పనిగా బెదిరిస్తున్నారట. 'నాకు వరుసగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. సినిమా చూసిన తర్వాత అప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకని ఇలా ఏదిపడితే అది అనేస్తున్నారు. మా కాళి సినిమా ఎందుకు ఒప్పుకున్నావని ప్రశ్నిస్తున్నారు. లెజెండరీ నటి సుచిత్రా సేన్ మనవరాలుయ్యండి ఇలాంటి మూవీస్ చేస్తావా? నువ్వు కూడా కోల్‌కతాలోనే ఉండేది.. అది గుర్తుంచుకో అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. ఈ బెదిరింపులు భరించలేకపోతున్నాను' అంది.
తెలుగులో ఒకే ఒక సినిమా
కాగా రైమా సేన్ గతేడాది ద వ్యాక్సిన్ వార్ సినిమాలో కనిపించింది. కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ మూవీ వివాదంగానే మారింది. ఇప్పుడు మా కాళి మూవీతో ఈ హీరోయిన్ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ చిత్రానికి విజయ్ ఏలకంటి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈమె తెలుగులో ధైర్యం అనే సినిమాలో నటించింది. ఆమె తల్లి మూన్ మూన్ సేన్, సోదరి రియా సేన్ కూడా నటీమణులు కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment