
చెన్నై: ‘నీకేం కాదు.. ధైర్యంగా ఉండు. అనారోగ్యం నుంచి త్వరలోనే కోలుకుంటావు. కుటుంబ సమేతంగా మా ఇంటికి రండి. నేను నిన్ను చూస్తాను’ ఈ మాటల్ని అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న తన అభిమానిలో ధైర్యాన్ని నింపటానికి సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. బాషాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. వారంతా ఆయన్ని రాజకీయ నాయకుడిగా చూడాలని ఎన్నాళ్లుగానో ఆశిస్తున్నారు. కాగా ప్రస్తుతం రజనీకాంత్ కూడా కరోనా కారణంగా షూటింగ్‌లు రద్దు కావడంతో ఇంట్లోనే ఉంటూ త్వరలోనే ప్రారంభించనున్న రాజకీయ పార్టీ గురించి సుదీర్ఘ చర్చల్లో మునిగిపోయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా రజనీకాంత్ వీరాభిమానుల్లో ఒకరైన మురళి అనే అతను కరోనా వ్యాధితో ముంబైలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఇతనికి యూరిన్ సమస్య కూడా ఉండటంతో ఆరోగ్యం విషమంగా మారింది. (చదవండి: రజనీకాంత్ క్షమాపణ.. నిజమేనా?)
ఇలాంటి పరిస్థితుల్లో మురళి తన ట్విట్టర్‌లో రజినీకాంత్ గురించి ‘2021లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో గెలిచి అత్యుత్తమ నాయకుడు గాను, ఒక తండ్రిగా, ఆధ్యాత్మిక గురువుగా రాజ మార్గాన్ని ఏర్పరచి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి వ్యక్తికి రూ. 25 వేల ఆదాయం వచ్చే పరిస్థితిని తీసుకురావాలి. నీ సారథ్యంలో నడిచి సేవలు అందించలేకపోతున్నానని బాధపడుతున్నాను’ అని పేర్కొన్నాడు. తన అభిమాని∙గురించి తెలిసిన రజనీకాంత్ అతనికి ఒక వీడియోను పంపారు. అందులో ‘మురళి నేను రజనీకాంత్‌ని మాట్లాడుతున్నాను. నీకేం కాదు కన్నా. ధైర్యంగా ఉండు. నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తావు. ఆ తర్వాత దయచేసి కుటుంబంతో సహా మా ఇంటికి రావాలి. నేను మిమ్మల్ని చూస్తాను’ అంటూ రజనీకాంత్ తన అభిమానికి ధైర్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment